ఎమ్మెల్యే నిధులు @ మంత్రులు | Telangana Govt Changes In ACDF System | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే నిధులు @ మంత్రులు

Jan 29 2019 12:54 AM | Updated on Jan 29 2019 7:08 AM

Telangana Govt Changes In ACDF System - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధి (ఏసీడీఎఫ్‌) విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానానికి తెరతీయబోతోంది. గతంలో ఉన్న విధానాన్నే తిరిగి అమలు చేయాలని నిర్ణయించింది. ఏసీడీఎఫ్‌ విధానంలో మార్పులపై ప్రణాళిక శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. సీఎం కేసీఆర్‌ ఆమోదం పొందగానే ఉత్తర్వులు జారీ చేయనుంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త విధానం అమలులోకి రానుందని అధికార వర్గాలు తెలిపాయి.

అసెంబ్లీ ఎన్నికల పరిణామాలు, అంతకుముందు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల  వైఖరి కారణంగానే ఏసీడీఎఫ్‌లో మార్పులు చేయాల్సి వస్తోందని ఇటీవలి జరిగిన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఎంపీలతో చెప్పారు. ఏసీడీఎఫ్‌ ఖర్చు విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు సమాన ప్రాధాన్యత ఇచ్చేలా సీఎం కేసీఆర్‌ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. 2016 ఏప్రిల్‌ 1 నుంచి ఇదే విధానం అమలవుతోంది. ఈ విధానంలో ఏసీడీఎఫ్‌ నిధుల ఖర్చుపై పూర్తి అధికారం స్థానిక ఎమ్మెల్యేకే ఉంటుంది. అయితే కొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు దీన్ని సైతం గుర్తించకుండా.. అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శలు చేయడంపై ప్రభుత్వ పెద్దలు అసంతృప్తితో ఉన్నారు.

దీంతో.. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో అమలు చేసిన విధానాన్నే తిరిగి అమల్లోకి తీసుకురావాలని భావించారు. దీనికి అనుగుణంగా ప్రణాళిక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఏసీడీఎఫ్‌ కింద ప్రతి ఎమ్మెల్యేకు ఏటా మూడు కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయిస్తోంది. ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనలకే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతోంది. కొత్త విధానం ప్రకారం ఎమ్మెల్యేకు రూ.1.50 కోట్లు మాత్రమే కేటాయిస్తారు. మిగిలిన కోటిన్నర రూపాయలను ఖర్చు చేసే ప్రతిపాదనలను ఆమోదించే అధికారాన్ని జిల్లా మంత్రికి అప్పగిస్తున్నారు. 

కోటిన్నర నుంచి 3 కోట్లకు.. 
మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం ఏసీడీఎఫ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. టీడీపీ హయాంలో ఈ నిధి ఏటా కోటి రూపాయలుగా ఉండేది. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో దీన్ని రూ.1.50 కోట్లకు పెంచారు. కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టాక దీన్ని 3 కోట్ల రూపాయలకు పెంచారు. 2016 ఏప్రిల్‌ 1 నుంచి పెంచిన నిధి అమలులోకి వచ్చింది. టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో.. ఏసీడీఎఫ్‌ నిధుల్లో 50% స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాదనల ప్రకారం, మిగిలిన 50% జిల్లా మంత్రి సిఫారసు మేరకు ఖర్చు చేసేవారు. పార్లమెంట్‌ సభ్యుల అభివృద్ధి నిధి తరహాలోనే మొత్తం సీడీఎఫ్‌ నిధిని ఎమ్మెల్యేల ప్రతిపాదనల ప్రకారమే ఖర్చు చేసేలా సీఎం కేసీఆర్‌ కొత్త విధానాన్ని తెచ్చారు. అయితే దీని వల్ల కొన్ని నియోజకవర్గాల్లో ఆశించిన అభివృద్ధి జరగలేదని ప్రభుత్వానికి సమాచారం వచ్చింది.

పలువురు ఎమ్మెల్యేలు స్థానిక అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా అనుచరులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కొందరు తీరా ఎన్నికల సమయంలో ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోలేదని, నిధులను కేటాయించలేదని విమర్శలు చేశారు. ఏసీడీఎఫ్‌ ఖర్చు పూర్తిగా ఎమ్మెల్యేకే ఉండడంతో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోని అధికార పార్టీ శ్రేణులు ఇబ్బందులు పడ్డారు. సొంత పార్టీ ప్రభుత్వం ఉన్నా గ్రామాల్లో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకునే పరిస్థితి లేకుండాపోయింది. ఇది పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీకి క్షేత్రస్థాయిలో కొంత ఇబ్బందిని సృష్టించింది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు సమాన ప్రాధాన్యత ఇచ్చేలా సీడీఎఫ్‌ విధానాన్ని అమలు చేసినా రాజకీయంగా ప్రభుత్వంపై విమర్శలు తప్పలేదు. దీంతో దీనిపై కొత్త విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement