టీడీపీ దిగజారుడు రాజకీయం

TDP Activists Attack on YSR Congress Party Leaders Anantapur - Sakshi

టీడీపీ దిగజారుడు రాజకీయం

బీజేపీ–జనసేనతో జతకట్టి కుట్రలు

ఇన్నేళ్లూ దాడులతోనే ఇప్పుడు కూడా రెచ్చగొట్టే ధోరణి

కొన్నిచోట్ల పోటీకి వెనుకంజ

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులకు అడ్డుకట్ట

పచ్చని పల్లెల్లో అగ్గి రాజేస్తున్న టీడీపీ

దిగజారుడు రాజకీయాలకు అలవాటు పడిన టీడీపీ నేతలు.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ వైఖరి మార్చుకోని పరిస్థితి. నామినేషన్‌ రోజునే కుట్రలు, కుతంత్రాలకు తెరతీశారు. రెచ్చగొట్టి.. రచ్చచేసి ప్రజల్లో సానుభూతి పొందేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. నామినేషన్‌ రోజే పలు చోట్ల వైఎస్సార్‌ సీపీ నేతలు, అభ్యర్థులపై దాడికి తెగబడ్డారు. చివరకు తమపైనే     వైఎస్సార్‌ సీపీ నేతలు దాడి చేశారంటూ గగ్గోలు పెట్టారు. ఓటమి భయంతో వారు చేస్తున్న చిల్లర రాజకీయాలు చూసి జనం ఛీకొడుతున్నారు.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: అధికారంలో ఉన్నన్ని రోజులు హత్యలు, దాడులతో రాజకీయం చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు.. ఇప్పుడు రెచ్చగొట్టే ధోరణితో స్థానిక సంస్థల ఎన్నికల్లో అగ్గిరాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం తమకు బలం లేని ప్రాంతాల్లో ఏకంగా బీజేపీతోనే జతకట్టి గొడవలు సృష్టిస్తున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా కరువైన నేపథ్యంలో అల్లర్లను ప్రోత్సహిస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ విస్తృతంగా పర్యటిస్తున్నా పోటీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏకంగా బీజేపీ–జనసేన నేతలతో కలిసి అల్లర్లకు తెరలేపినట్టు తెలుస్తోంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఓటమి ఖాయమన్న సంకేతాల నేపథ్యంలో కనీసం అభ్యర్థులు పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో పచ్చని పల్లెల్లో అగ్గి రాజేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో శాంతిభద్రతలు పక్కాగా అమలవుతున్నాయి. ఎక్కడా ఘర్షణలు చెలరేగి దాడులు జరిగిన దాఖలాలు లేవు.  అంతేకాకుండా మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజల్లో నూతనోత్సాహం నెలకొంది. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో ప్రజల ముంగిటకు పాలన వచ్చింది. వర్షాలు కూడా సమృద్ధిగా కురిసి.. పంటలకు ధరలు కూడా బాగా ఉండటంతో పల్లెలో ఆనందోత్సాహలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలకు కనీసం పనిలేకుండా పోయింది. దీంతో అశాంతిని లేపడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందాలని టీడీపీ నేతలు యత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

వైఎస్సార్‌ సీపీ నాయకుడిపై దాడి
కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి మోహన్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేసి తిరిగి వెళ్తుండగా.. టీడీపీకి చెందిన తిమ్మరాజు, రామాంజనేయులు, భోయరాజు, బోయ వన్నూర్‌ స్వామిలు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు ధనుంజయ, గురుగన్నలపై  దాడి చేసి గాయపరిచారు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్త గురుగుప్ప ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.   

కయ్యానికి కాలుదువ్వి...
వాస్తవానికి ధర్మవరం నియోజకవర్గంలో గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సూరి ఓటమి తర్వాత వెంటనే బీజేపీలో చేరారు. తాను చేసిన అవినీతి వ్యవహారాలను కప్పిపుచ్చుకునేందుకు పార్టీ మారారన్న విమర్శలు ఉన్నాయి. అయితే, ఈ స్థానంలో గత ఐదు నెలలుగా టీడీపీ ఎవరినీ ఇన్‌చార్జిగా నియమించలేదు. చివరకు జిల్లా పర్యటన సందర్భంగా ధర్మవరం ఇన్‌చార్జి బాధ్యతలను పరిటాల కుటుంబానికే అప్పగించారు. అయితే, ఇన్ని రోజులుగా ఎక్కడా నియోజకవర్గంలో తిరిగినపాపన పోలేదు. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా గత రెండు, మూడు రోజులుగా ధర్మవరంలో తిరుగుతున్నప్పటికీ అనుకున్న స్పందన కరువైంది. దీంతో బీజేపీ–జనసేనతో కలిసి టీడీపీ నాటకాలకు తెరలేపింది. ఈ నేపథ్యంలోనే జనసేన అభ్యర్థి నామినేషన్‌ వేసి వస్తూ.. రెచ్చగొట్టే విధంగా వైఎస్సార్‌సీపీ నేతలను చూస్తూ మీసం మెలేయడంతో పాటు కాలరేగరేసి కయ్యానికి కాలుదువ్వినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో టీడీపీ నేతల ప్రోద్భలం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదే తరహాలో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అల్లర్లకు టీడీపీ తెరచాటు బాగోతాన్ని నడిపినట్లు సమాచారం. బత్తలపల్లిలో ఎంపీడీఓ కార్యాలయం  వద్ద టీడీపీ నేతలు దాడికి తెVýæబడగా...ఆరుగురు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు గాయపడ్డారు.

హిందుపురం నియోజకవర్గంలో వర్గాలుగా, గ్రూపులుగా విడిపోయిన ప్రతిపక్ష టీడీపీ నేతలు ఎవరికివారుగా నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. నామినేషన్లు ఎవరైనా  వేయండని.. చివరకు ఎమ్మెల్యే బాలకృష్ణ అభ్యర్థులను నిర్ణయిస్తారంటూ కొత్త మెలిక పెట్టారు. దీంతో తమ పేర్లు చివరి జాబితాలో ఉండేలా చూసుకునేందుకు పైరవీలకు తెరలేపారు.
శింగనమల నియోజకవర్గంలోని ఎల్లనూరులో ఎంపీటీసీ స్థానాలకు పూర్తిగా అభ్యర్థులు కరువైన పరిస్థితి. నిన్నటివరకు పూర్తిగా నియోజకవర్గానికి దూరంగా ఉన్న టీడీపీ ఇన్‌చార్జి బండారు శ్రావణి ఎన్నికల నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నానికి నియోజకవర్గానికి చేరుకున్నారు. మీరు పోటీలో ఉండండి.. డబ్బులు సర్దుబాటు చేస్తానంటూ గతంలో ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ ఎన్నికల ఖర్చుకు నిధులివ్వాలని అభ్యర్థులు కోరుతున్నట్టు తెలుస్తోంది.  
పెనుకొండ నియోజకవర్గంలో ఆ పార్టీ నేతలు జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించేందుకు భారీగా డబ్బులు దండుకున్నట్టు తెలుస్తోంది.

బత్తలపల్లిలో ఉద్రిక్తత
ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండల కేంద్రంలో బుధవారం ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్‌ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో టీడీపీ కార్యకర్త చెన్నకేశవులు వైఎస్సార్‌సీపీ నాయకులపై కవ్వింపు చర్యలకు దిగాడు. వైఎస్సార్‌సీపీ మండల ఇన్‌చార్జ్‌పై దాడి చేయబోయాడు. అయినా వైఎస్సార్‌ సీపీ నాయకులు సంయమనం పాటించగా.. మరో దఫా రెచ్చగొట్టే రీతిలో దుర్భాషలాడారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో టీడీపీ నేతలు దాడి చేయగా..వైఎస్సార్‌ సీపీకి చెందిన ఆరుగురు కార్యకర్తలు గాయపడ్డారు. నామినేషన్ల ప్రక్రియ గంటపాటు నిలిచిపోయింది. బత్తలపల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. 

ఇదీ టీడీపీ హత్యా రాజకీయాల చరిత్ర
గత ఐదేళ్ల టీడీపీ అధికారంలో ప్రతిపక్ష నేతలపై హత్యాకాండలతో పాటు అనేక దాడులు చోటు చేసుకున్నాయి. ఇంతటి దాడుల చరిత్ర ఉన్న టీడీపీ నేతలు.. ప్రశాంత వాతావరణం నెలకొన్న ప్రస్తుత సందర్భంలో దాడులు జరుగుతున్నాయంటూ విమర్శలు చేయడాన్ని ప్రజలు ఛీత్కరిస్తున్నారు. గతంలో టీడీపీ హయాంలో జరిగిన దాడులు మచ్చుకు కొన్ని..
రాప్తాడు మండల తహసీల్దారు కార్యాలయంలోనే   ప్రసాద్‌రెడ్డిని అతికిరాతకంగా నరికి చంపారు.  
కిష్టిపాడు సింగిల్‌ విండో అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డిని సమావేశం ఉందని పిలిపించి మరీ.. కార్యాలయంలోనే రాడ్లు, రాళ్లు, కట్టెలతో దాడి చేసి హత్య చేశారు.  
యల్లనూరులో వైఎస్సార్‌సీపీ నేత ప్రకాశం శెట్టిని 2014 ఎన్నికలు ముగిసిన వెంటనే హత్య చేశారు. ఇక ఇదే నియోజకవర్గం ఎల్లుట్లలో మల్లికార్జున అనే మరో నేతను కూడా హత్య చేశారు. ఇక రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లుకు చెందిన విశ్వనాథ్‌ను అప్పటి అధికారపార్టీ నేతలు మట్టుపెట్టారు.  
అప్పటి రాప్తాడు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై అనంతపురం జిల్లా నడిబొడ్డున ఉన్న సర్వజనాసుపత్రి వద్ద టీడీపీ నేతలు దాడికి దిగారు. అదే సమయంలో జిల్లాలో ఏకంగా రాష్ట్ర డీజీపీ రాముడు కూడా పర్యటనలో ఉన్నారు.
ఇవే కాకుండా 2017 నవంబర్‌లో గొందిరెడ్డిలో బాబయ్యపై టీడీపీ నేతలు దాడి చేశారు. 2017 నవంబర్‌ 12న రామగిరి మండలం పేరూరులో వైఎస్సార్‌సీపీ నేత సుబ్బుకృష్ణ దంపతులపై దాడి చేశారు.
ధర్మవరం నియోజకవర్గంలోని కొండగట్టుపల్లిలో చిన్నికృష్ణ అనే రైతుకు చెందిన 350 చీనీ చెట్లు నరికేశారు. ఇదే నియోజకవర్గంలోని కేతిరెడ్డి కాలనీలో 112 నెంబర్‌ రేషన్‌షాపు యజమాని శకుంతల భర్త నారాయణరెడ్డిపై దాడి చేసి కిడ్నాప్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top