హామీలు మరిచేవాళ్లం కాదు | Sakshi
Sakshi News home page

హామీలు మరిచేవాళ్లం కాదు

Published Sun, Oct 15 2017 2:10 AM

Narendra Modi in Bihar as it happened: PM hardsells development  - Sakshi

మొకమా/పట్నా: ఎన్డీయే ప్రభుత్వం ప్రారంభించిన అన్ని పథకాలను నిర్ణీత గడువులోగా పూర్తిచేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గతంలో ఎన్నికల సమయంలో హామీలిచ్చి మరిచిపోయేవారని అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. బిహార్‌లోని మొకమాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మోదీ అనంతరం ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.

‘రోడ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టులు పేదల కోసం కాదని చాలా మంది రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నారు. వీరి ఆలోచనా ధోరణే ఇన్నాళ్లుగా దేశాన్ని నష్టపరిచింది’ అని మోదీ తెలిపారు. అంతర్గత జలరవాణాకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మోదీ.. బ్రిటీష్‌ కాలంలో గంగానదిపై ఉన్న జలరవాణా వ్యవస్థను, అప్పట్లో మొకమాను ‘మినీ కోల్‌కతా’ పిలుచుకునేవారని గుర్తుచేశారు. ఆ రోజులను మళ్లీ వాస్తవరూపంలోకి తీసుకురావాలన్నారు.  

అవిశ్రాంతంగా శ్రమిస్తూ..
‘మా ప్రభుత్వం రోడ్లు, రైలు, విద్యుత్‌ వంటి మౌలిక వసతులతోపాటుగా ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, అందరికీ తాగునీరు వంటివి అందించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తోంది. స్పష్టమైన లక్ష్యాలను మదిలో ఉంచుకుని మేం పథకాలను ప్రారంభిస్తున్నాం. రోడ్‌మ్యాప్‌ సిద్ధమయ్యాకే పథకం ప్రారంభం చేస్తున్నాం. తద్వారా సరైన సమయంలో అమలు పూర్తవుతుంది. గతంలో ఇలా జరిగేది కాదు. ఎన్నికల సమయంలో హామీలివ్వడం. తర్వాత మరిచిపోవటం అలవాటుగా చేసుకున్నారు’ అని మోదీ పేర్కొన్నారు. బిహారీలకు మోదీ దీపావళి, ఛట్‌ (దీపావళి తర్వాత ఆరవరోజు జరుపుకునే పెద్ద పండుగ) పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

హైవేలకు సంబంధించిన ప్రాజెక్టులు, భారీ మురుగు నీటిశుద్ధీకరణ ప్రాజెక్టును మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిహార్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్, సీఎం నితీశ్‌ కుమార్, కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, రాం విలాస్‌ పాశ్వాన్, రవిశంకర్‌ ప్రసాద్, అశ్విని చౌబే, ఉపేంద్ర కుశ్వాహ సహా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. దాదాపు 30 నిమిషాలసేపు ప్రసంగించిన మోదీ.. స్థానికంగా మాట్లాడే మాఘీ యాసలో మాట్లాడి ప్రజలను ఆకట్టుకున్నారు. పరుశురాముని జీవితంతో ముడిపడి ఉన్న ఈ ప్రాంత విశిష్టాన్ని గుర్తుచేశారు. ఈ ప్రాంతం నుంచి వచ్చిన ప్రముఖకవి రాంధారీ సింగ్‌ దినకర్, బిహార్‌ తొలి సీఎం శ్రీకృష్ణ సింగ్‌ చేసిన కృషినీ మోదీ ప్రశంసించారు.

నితీశ్, నితిన్‌లపై ప్రశంసలు
బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్,  కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీలపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. బిహార్‌ అభివృద్ధికి నితిశ్‌ చిత్తశుద్ధితో ఉన్నారని కితాబిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి 2022 కల్లా రాష్ట్రాన్ని సుభిక్షంగా మారుస్తామని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన పథకాల అమల్లో నితీశ్‌ సహకారం మరువలేనిదని.. కొనియాడారు. దేశంలో రోడ్డు నెట్‌వర్క్‌ను విస్తృతం చేసేందుకు గడ్కరీ అవిరళ కృషి చేస్తున్నారన్నారు. గంగానదిపై బక్సర్, వారణాసిలను కలుపుతూ.. విక్రమశిల సేతుకు సమాంతరంగా మరో బ్రిడ్జి నిర్మాణానికి ప్రధాని చొరవతీసుకోవాలని ఈ సందర్భంగా నితీశ్‌ కోరారు. 27 ఏళ్ల తర్వాత ఒకే ఆలోచనతో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చాయని బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ పేర్కొన్నారు. బిహార్‌ను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు రెండు ఇంజన్లు (మోదీ, నితీశ్‌లు) ఉన్నాయని తెలిపారు. జేడీయూ పార్టీ ఎన్డీయేలో చేరిన తర్వాత బిహార్‌లో ప్రధాని మోదీ తొలిపర్యటన ఇదే కావటం విశేషం.  

వర్సిటీల సంకెళ్లను తొలగిస్తాం
అంతకుముందు, పట్నా యూనివర్సిటీ వందేళ్ల వేడుకలకు సంబంధించిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ప్రపంచ ఉత్తమ వర్సిటీల జాబితాలో భారత్‌ తొలి 500 స్థానాల్లో లేకపోవటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. యూనివర్సిటీల సంకెళ్లను తెంచి ప్రపంచంలోనే ఉత్తమ విద్యాకేంద్రాలుగా మార్చేందుకు దేశంలోని 20 వర్సిటీలకు రూ.10వేల కోట్లు కేటాయించనున్నట్లు స్పష్టంచేశారు. ‘వర్సిటీలకు కేంద్రం గ్రాంట్స్‌ స్టేటస్‌ ఇవ్వడం ఇకపై గతమే అవుతుంది. దేశవ్యాప్తంగా 10 ప్రభుత్వ, 10 ప్రైవేటు వర్సిటీలను ప్రపంచస్థాయికి చేరుస్తాం.

ఇందుకోసం ఐదేళ్లపాటు రూ.10వేల కోట్లను అందజేస్తాం. వర్సిటీలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సత్తా చాటాలని కోరుకుంటున్నా’ అని మోదీ పేర్కొన్నారు. పాత పద్ధతిలో కొనసాగే విద్యావిధానాన్ని పక్కనబెట్టి.. యువత ఆలోచనలను అత్యాధునిక సమాచారం, సృజనాత్మకతతో కూడిన విద్యావిధానంపై వర్సిటీలు దృష్టిపెట్టాలని మోదీ కోరారు. ఈ 20 యూనివర్సిటీల ఎంపిక ప్రభుత్వాలు, పార్టీల చేతుల్లో కాకుండా థర్డ్‌పార్టీ ప్రొఫెషనల్‌ ఏజెన్సీతో జరుగుతుందన్నారు.

అప్పుడు పాములు.. ఇప్పుడు ఎలుకలు!
అంతర్జాతీయ వేదికపై భారత ముఖచిత్రాన్ని మార్చటంలో యువ ఐటీ నిపుణుల పాత్ర మరువరానిదని మోదీ ప్రశంసించారు. ‘చాలాకాలం వరకు పాములు ఆడించేవారిగా, భూతవైద్యం, మూఢనమ్మకాల దేశంగా మనల్ని చూసేవారు. ఇప్పుడు పాములు వదిలి ఎలుకల (కంప్యూటర్‌ మౌస్‌)తో ప్రపంచాన్ని శాసించే దేశంగా మారుతున్నాం’ అని మోదీ తెలిపారు. ‘బిహార్‌ సరస్వతిని ఆరాధిస్తోంది. ఇక లక్ష్మీ కటాక్షం కూడా దక్కితే 2022 కల్లా సుసంపన్న రాష్ట్రాల్లో ఒకటిగా మారిపోనుంది’ అని అన్నారు. అనంతరం ఇటీవలే ప్రారంభించిన బిహార్‌ మ్యూజియంను ప్రధాని సందర్శించారు. 

Advertisement
Advertisement