టీడీపీ దుష్ప్రచారం అనుమానాలకు తావిస్తోంది

GVL Narasimha Rao comments about Murder Attempt on YS Jagan - Sakshi

     జగన్‌పై దాడిని ఖండించకుండా కప్పిపుచ్చుకొనే ప్రయత్నాలేమిటి? 

     ఇది టీడీపీ మాఫియా తరహా దాడిలా అనిపిస్తోంది?

     దీని వెనుక ఉన్న శక్తులపై విచారణ జరపాలి

     చంద్రన్న ఇన్వెస్టిగేషన్‌ కమిషన్‌ కాకుండా స్వతంత్ర కమిషన్‌ వేయాలి

     బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు డిమాండ్‌  

సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడి నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారం అనేక అనుమానాలకు తావిస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అభిప్రాయపడ్డారు. దాడి ఘటనను ఖండించాల్సింది పోయి దాన్ని కప్పిపుచ్చుకొనేలా టీడీపీ నేతలు ప్రతిపక్షాలపైనే తిరిగి విమర్శలు చేస్తుండడం వెనుకు ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. వ్యతిరేకించిన వారిపై దాడులు చేస్తాం అన్న రీతిలో అచ్చోసిన ఆంబోతుల్లా దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం దాడిని ఖండించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయకుండా ఇలా ఎదురుదాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ నేతలకు దాడులు కొత్తేం కాదని, గతంలో వారు ఇలాంటివి చాలా చేశారన్నారు.

తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరిగి వస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాపై, జిల్లాల పర్యటనలో తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై టీడీపీ దాడులు జరిపించడం, అలాగే ఒక చర్చా కార్యక్రమంలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ తనపై ఏ విధంగా దుర్భాషలాడింది యావత్తు రాష్ట్ర ప్రజలు చూశారన్నారు.  ఇప్పుడు జగన్‌పై జరిగిన దాడి కూడా టీడీపీ మాఫియానే చేసిందన్న అనుమానం కలుగుతోందన్నారు. దీనిపై చంద్రన్న ఇన్వెస్టిగేషన్‌ కమిషన్లు కాకుండా ఒక స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేసి పూర్తి విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చాలన్నారు. వైఎస్‌ జగన్‌పై పబ్లిక్‌గా దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న భయంతోనే ఏయిర్‌పోర్టులో దాడి చేశారని అనుమానం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ ఓడిపోబోతున్నామన్న భయంతో ఆత్మస్థైర్యం కోల్పోయిన టీడీపీ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నట్టు కనిపిస్తోంది. పిచ్చివేశాలు వేసి ఎవరినైనా భయపెట్టవచ్చు అనుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని జీవీఎల్‌ హెచ్చరించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top