ఎన్టీఆర్‌ స్పూర్తి అంటే కాంగ్రెస్‌తో పొత్తా?

BJP MLC Somu Veerraju Fires On Governor Speech - Sakshi

సాక్షి, అమరావతి : దివంగత నేత ఎన్టీఆర్‌ స్పూర్తితో పాలన జరిగితే కాంగ్రెస్‌తో టీడీపీ ఎలా పొత్తుపెట్టుకుంటుందని బీజేపీ నేత సోము వీర్రాజు ప్రశ్నించారు. అసెంబ్లీ వేదికగా గవర్నర్‌ నరసింహాన్‌ అసత్యాలు ప్రసంగించారని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు బీసీ కులాలకు ఎక్కడ మేలు చేశారో చెప్పాలన్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామన్న హామీ ఎందుకు నెరవేర్చలేదో తెలపాలన్నారు. కేంద్రం చేసిన వాటన్నటినీ చంద్రబాబు తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కేంద్ర సాయం వల్లే రాష్ట్ర ప్రభుత్వం విజయాలు సాధించిందని, 24 గంటల విద్యుత్‌ సరఫరా కేంద్ర సహకారంతోనే సాధ్యమైందన్నారు. ప్రైవేట్‌ సంస్థలకు మేలు చేసేందుకే ప్రభుత్వ ప్లాంట్‌లు మూసి ఉత్పత్తి నిలిపేశారని, ఉపాధి హామీ నిధుల్లో వేల కోట్ల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. 

74 అంశాల్లో రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తోందని, కేంద్రం సహకరించడం లేదనడం అవాస్తవమన్నారు. కేంద్ర ప్రభుత్వనిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పథకాలు అమలు చేస్తోందని, రూ.వేల కోట్లు ఇస్తే.. కేంద్రం సహకరించలేదనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఉపాధిహామి పథకంలో భాగంగా రూ. 9 వేల కోట్ల నిధులను రాష్ట్రానికి ఇచ్చారని, అభివృద్ధి పథకాల అమలులో కేంద్రం భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు. చంద్రబాబు విడుదల చేసిన 10శ్వేత పత్రాలు అబద్దాలతో నిండినవని విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top