మహిళా రక్షణ చట్టాల కోసం..

Inspirational Indian Women in Legal Profession - Sakshi

ప్రస్తుత సమాజం కన్నా ఆదిమ సమాజం ఎంతో మెరుగ్గా ఉంది. ఎందుకంటే అప్పటికి మనుస్మృతి ఇంకా వెలువడలేదు. అందుకే ఆ సమాజంలో అసమానతలు లేవు. జాతి,మత, కుల వైషమ్యాలు లేవు. ఆడ, మగ అనే తేడాలు అసలే లేవు. కాలం గడుస్తున్న కొద్ది సమాజం విస్తరిస్తూ పోయింది. రాజ్యాలు, రాజులు కాలం ప్రారంభమయ్యింది. విజ్ఞానం పెరిగిన కొద్ది విచక్షణ నశిస్తుందేమో అనేట్టుగా సమాజం మారింది. ఆడవారిని వంటింటికే పరిమితం చేయడం ప్రారంభమయ్యింది. చివరికి మగ  వారి అండ లేకుండా వారి మనుగడ కష్టం అనే స్థాయికి పరిస్థితులు మారాయి. కట్టుబాట్లు, సంప్రదాయాల పేరుతో ఎన్నో దురాచారాలు రాజ్యమేలాయి. వీటి నిర్మూలనకు కృషి చేసిన మహనీయులేందరో. ఎన్నో చట్టాలు తెచ్చినప్పటికీ వివక్ష కొనసాగుతూనే ఉంది. నేటి సమాజంలో ఉన్న ఆధునిక రుగ్మతలను రూపుమాపడానికి, సమానత్వం కోసం న్యాయవాద వృత్తిని ఎంచుకుని పోరాటం సాగిస్తున్నమహిళలెందరో....
 

కర్నేలియా సోరాబ్జి
1866లో జన్మించిన కర్నేలియా సోరాబ్జి దేశంలోనే తొలి  మహిళ న్యాయవాది. బ్రిటన్‌లో, భారతదేశంలో అలహబాద్‌ హై కోర్టులో ప్రాక్టీస్‌ చేసిన తొలి మహిళ. బాంబే యూనివర్సీటి నుంచి తొలి మహిళ పట్టభద్రురాలు. అంతేకాదు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సీటిలో న్యాయశాస్రం చదివిన తొలి మహిళ భారతీయ మహిళ కూడా కర్నేలియా సోరాబ్జినే.

ఇందిరా జైసింగ్‌ 
కట్నం కోసం వేధింపులు, అత్తాఆడుచుల ఆరళ్లు, ఆడపిల్లను కంటే కాటికే, కట్టుకున్నవాడే కసాయిగా మారి బంధాన్ని, బతుకును నరకప్రాయం చేస్తుంటే ఆదుకునే వారు లేక మూగగా రోదించారు. సహనం నశించి ప్రాణాలు తీసుకున్న వారెందరో. ఈ హింసనుంచి ఆడవారిని బయటపడెయ్యటానికి ప్రభుత్వం 2005లో గృహ హింస చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం రూపుదిద్దికోవడానికి వెనక ఓ మహిళ న్యాయవాది అసమాన కృషి ఉంది. ఆమె ఇందిరా జైసింగ్‌. ప్రముఖ న్యాయవాది. అంతేకాదు స్త్రీల హక్కుల కోసం, మానవ హక్కుల కోసం పోరాడుతున్నారు. మన దేశంలో అడిషనల్‌ సోలిసిటర్‌ జనరల్‌గా నియమితులైన తొలి మహిళ ఇందిరా జైసింగ్‌.

మీనాక్షి అరోర
నేటికి ఆడవారు స్వేచ్ఛగా ఉద్యోగం చేసే పరిస్థితులు లేవు. ప్రధాన కారణం లైంగిక వేధింపులు. దీనికి ఏ రంగం మినహాయింపు కాదు. ఈ వేధింపులను నిరోధించాడనికి 2013లో  ప్రభుత్వం పనిప్రదేశాల్లో వేధింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం రూపోందించడంలో మీనాక్షి అరోర పాత్ర కీలకమైనది. సుప్రీం కోర్టులో సీనియర్‌ న్యాయవాది. స్త్రీల హక్కుల కోసం పోరాడుతున్నారు.

వ్రింద గ్రోవర్‌
దేశంలో సోని సోరి అత్యాచార కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే. ఈ కేసులో బాధితుల తరుపున నిలబడ్డారు వ్రిదా గ్రోవర్‌. ఆమె గృహ హింస బాధితుల కోసం, లైంగిక వేధింపులకు గురయిన పిల్లల గురించి పోరాడుతున్నారు. ఆమె కృషి ఫలితంగా 2010లో హింసా నిరోధక చట్టం, 2012లో పోస్కో చట్టం, 2013లో క్రిమినల్‌ లా సవరణ ముసాయిదాలు రూపోందించారు. మానవ హక్కులు, స్త్రీల హక్కుల కోసం పోరాడుతున్న వ్రిందా గ్రోవర్‌ను 2013లో టైమ్స్‌ మాగ్‌జైన్‌ 100మంది ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా గుర్తించారు.

లీలా సేథ్
ఢిల్లీ హైకోర్టులో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి, ఒక  రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన  మొదటి మహిళ లీలా సేథ్. కుమార్తెలకు కూడా  ఉమ్మడి కుటుంబం ఆస్తిలో  సమాన హక్కులు ఉన్నాయని 2005లో హిందూ వారసత్వ సవరణ చట్టం రావడానికి ఆమె చేశారు. లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్‌  హక్కుల గురించి  సానుకూల ప్రకటనలు చేశారు.

మేనక గురుస్వామి
రాజ్యంగం అంటే ప్రాణం, రాజ్యంగం కల్పించిన హక్కులు అందరికి సమానం అని నమ్మే వ్యక్తి మేనక గురుస్వామి. తనను తాను‘‘తమ బాధలు చెప్పుకోలేని, తమ స్వేచ్ఛకు భంగం కలుగుతున్నా మౌనంగా భరించే పేదల పక్షపాతిగా’’ చెప్పుకోవడానికి ఇష్టపడతారు మేనక. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న మేనకా గురుస్వామి విద్యాహక్కు చట్టంగా రూపొందడంలో విశేష కృషి చేశారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 377 ను సవాలు చేసినప్పుడు నాజ్ ఫౌండేషన్‌ తరుపున వాదించిన న్యాయవాదుల్లో ఆమె ఒకరు.

కరుణ నంది
సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న కరుణ నంది లింగ సమానత్వం కోసం పోరాడుతున్నారు. 1984లో భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనలోని బాధితుల తరుపున న్యాయం కోసం పోరాడుతున్నారు కరుణ నంది. వాక్‌ స్వాతంత్రాన్ని నిరోధించే ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీలోని 66ఏ సెక్షన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంలో కరుణ నంది పాత్ర కీలకం.

ఫ్లావియా ఆగ్నెస్
మహిళలకు చట్టపరమైన ప్రాతినిధ్యాన్ని అందించే 'మజ్లిస్' సహ వ్యవస్థాపకురాలైన ఫ్లావియా ఒక ప్రముఖ రచయిత, న్యాయవాది, మహిళా హక్కుల కార్యకర్త. ఆమె చేసిన  స్త్రీవాద రచనలు చాలా ప్రాముఖ్యత కలిగివున్నాయి. ఆమె సేవలను అప్రతిష్ట చేయడానికి ఆమె ప్రసిద్ధి చెందింది. చట్టపరమైన విషయాలలో మహిళలకు ఆమె చేసిన సేవలు అసమానం. 1979లో ఆమె ఫోరం ఎగైనెస్ట్  ఒప్ప్రెషన్‌ ఆఫ్ విమెన్ (ఎఫ్‌ఏఓడబ్ల్యూ)ను  ఏర్పాటు చేసి భార్యను కొట్టడం, వరకట్నం, లైంగిక వేధింపులు వంటి  సమస్యల గురించి ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు.

పింకీ ఆనంద్
పింకీ ఆనంద్ సుప్రీం కోర్టులో ఒక సీనియర్ న్యాయవాది. ఆమె  రాజ్యాంగ లా, కుటుంబ లా, పర్యావరణం లా వంటి  రంగాలలో నిపుణురాలు.  ఆమె భారతదేశపు అడిషనల్‌ సొలిసిటర్ జనరల్‌గా  నియమితులైన రెండో  మహిళ.

                                                                                                                                                                                                               
తృప్తి దేశాయ్
లింగ సమానత్వం కోసం పోరాడుతున్న కార్యకర్త. ముఖ్యంగా మహిళలను నిషేధించిన ఆలయాల్లో వారి  ప్రవేశం కోసం ముంబైలో భుమాత బ్రిగేడ్ సంస్థను స్థాపించరు. ఆ సంస్థ కార్యకర్తలతో కలిసి  మహారాష్ట్రలోని శని శింగాపూర్ ఆలయం, మహాలక్ష్మీ దేవాలయం, త్రైయంబకేశ్వరాలయం వంటి ఆడవారి ప్రవేశాన్నినిషేధించిన ఆలయాల్లో  వారిక ప్రవేశం కల్పించాలని ప్రచారం చేశారు. కేవలం హిందూ దేవలయాలనే కాకుండా హాజీ ఆలీ దర్గాలో స్త్రీలు ప్రవేశించే హక్కును పోరాడి సాధించారు. ఇటీవల కాలంలో ఆమె శబరిమలలో మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటున్న నియమాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూన్నారు.

- పిల్లి ధరణి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top