మాణిక్‌రాజాలు

మాణిక్‌ చంద్, రాజాఖైనీ, ఇతర గుట్కాల తయారీ కేంద్రంగా గుంటూరు

గుట్కా సామ్రాజ్యానికి కింగ్‌లుగా మారిన అక్రమార్కులు

ఏకంగా మెషీన్లు తీసుకొచ్చి తయారీ చేస్తున్న వైనం

జిల్లాలో మాణిక్‌రాజాలు అవినీతి పునాదులపై అక్రమాల పీఠం వేసుకుని గుట్కా సామ్రాజ్యానికి కింగ్‌ల అవతారమెత్తారు. అమ్మడానికే అనుమతిలేని గుట్కాలను ఏకంగా మెషీన్‌లు తెచ్చి మరీ తయారు చేస్తున్నారు. ప్రతి రోజూ బస్తాలకొద్దీ మాణిక్‌చంద్, రాజాఖైనీ ప్యాకెట్లను జిల్లాలో సరఫరా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఆదివారం గుంటూరులో అధికారుల సోదాలు చేసిన గుట్కా తయారీ కేంద్రాన్ని పరిశీలిస్తే ఏళ్ల తరబడి ఈ దందా కొనసాగుతున్నట్లు అర్థమవుతోంది. ప్రజల ప్రాణాలను హరించే ఈ అక్రమాలకు మామూళ్ల మత్తు ఆవరించిన అధికారుల అండ ఉన్నట్లు తెలుస్తోంది.

గుంటూరు(పట్నంబజారు): గుట్కా మాఫియా మరోసారి మార్క్‌ దందాకు తెరదీసింది. ఇన్నాళ్లూ వేరే రాష్ట్రాల నుంచి గుట్కాలను తీసుకుని వ్యాపారాలు చేస్తున్న మాఫియా ఒక్కసారి మిషనరీలనే దిగుమతి చేసుకుంది. కానిస్టేబుల్‌ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి, ఇంజినీరింగ్‌ చదువుతున్న అతని కుమారుడు ఇటువంటి వ్యాపారాలు చేయటం విస్మయానికి గురి చేస్తోంది. వీరు ప్రాంతాల వారీగా గుట్కా వ్యాపారాలు చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు.

జిల్లా వ్యాప్తంగా వ్యాపారం
గుంటూరు శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని నిషేధిత గుట్కా తయారీ కేంద్రాలు వెలుస్తున్నాయి. నగరంలోని కొండా వెంకటప్పయ్యకాలనీ చివర ఆదివారం సీతయ్య కాటన్‌ మిల్లులో అధికారులు సోదాలు చేశారు. అమరావతి రోడ్డుకు చెందిన పాలెం శివకుమార్‌ అనే ఇంజినీరింగ్‌ విద్యార్థి గుట్కాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కాఫీ గింజల తయారీ కేంద్రం పెట్టుకుంటున్నట్లు మిల్లు యజమానికి చెప్పారు. తన తండ్రి రామ్మోహనరావు హైదారాబాద్‌లో పోలీసు కానిస్టేబుల్‌ అని, ప్రమాదం జరగటంతో మెడికల్‌ లీవ్‌లో ఉన్నాడని శివ వెల్లడించాడు. అయితే రామ్మోహనరావు ప్రమాదం జరిగిన రెండు సంవత్సరాల నుంచి గుట్కా వ్యాపారం చేస్తున్నారని అధికారులు గుర్తించారు. విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసిన సమయంలో నేరుగా రామ్మోహనరావు దొరికారని, అతనిని తప్పించి శివను చూపించారనే విమర్శలు వస్తున్నాయి. నగరంలో కొంత మంది పెద్ద గుట్కా వ్యాపారులతో కలిసి గుంటూరు శివారు ప్రాంతాలైన ఏటూకూరు రోడ్డు, నల్లపాడు రోడ్డుతోపాటు పట్నంబజారు, లాలాపేట, కాకానిరోడ్డు, ఆర్టీసీ కాలనీ, జిల్లాలోని నర్సరావుపేట, వినుకొండలలో మెషీన్ల ద్వారా గుట్కా తయారు చేస్తున్నట్లు సమాచారం.  

రాజస్థాన్‌ నుంచి మిషన్లు
గుట్కా తయారీకి అనుమతి ఉన్న రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాల నుంచి మిషన్‌లను తీసుకొస్తున్నారు. ఈ మిషన్‌లు చిన్న సైజులో ఉండటం, విడిభాగాలను మాత్రమే పార్శిల్‌ చేస్తుండడంతో రవాణా తేలికవుతోంది. ఏదైనా చెకింగ్‌లు జరిగినప్పటీకీ కాఫీ తయారీ మిషన్‌లుగా చెబుతామని శివ తెలిపాడు. మిషన్‌ విలువ రూ 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఉంటుంది. సుమారు గుంటూరులో ఐదు ప్రాంతాల్లో మిషన్లు ఉన్నట్లు సమాచారం.

రెండు కోట్లకుపైగా వ్యాపారం
రాజస్థాన్‌ నుంచి తీసుకొచ్చిన మిషన్‌ల ద్వారా గంటకు ఆరు బస్తాల గుట్కాలు తయారు చేస్తున్నారు. బస్తాకు 50 ప్యాకెట్లు, ఒక్కో ప్యాకెట్‌లో 70 నుంచి 80 పొట్లాలు, ఒక్క ప్యాకెట్‌ను సిటిలో అయితే రూ 200 నుంచి 250, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 300కుపైగా అమ్ముతున్నారు. నిత్యం జిల్లాతోపాటు అనేక ప్రాంతాలకు 500 నుంచి 800 బస్తాల వరకు బయటకు వెళతాయని సమాచారం. ఒక్కొ బస్తా విలువ రూ 13 వేల నుంచి 15 వేల వరకు అమ్ముతున్నారు. కేవలం జిల్లాలో నెలకు రూ 4 కోట్ల వరకు ఎంసీ, గరుడ, ఖలేజాలను నకిలీ ప్యాకెట్లలో పెట్టి విక్రయిస్తున్నారు.

ముందుగానే సమాచారం..
నమిలే పొగాకు ఉత్పత్తులు నిషేధిస్తూ నాలుగేళ్ల క్రితం హైకోర్టు తీర్పు వెలువరించింది. అప్పటి నుంచి కొంత మంది గుట్కా వ్యాపారానికి తెరదీశారు. ఈ క్రమంలో కొంత మంది విజిలెన్స్, పోలీసు అధికారులు కూడా హస్త లాఘవాన్ని ప్రదర్శించటంతో గుట్కా వ్యాపారం మూడు మాణిక్‌చంద్‌లు..ఆరు రాజా ఖైనీలుగా సాగిపోతోంది. తయారీ కేంద్రాలు, గుట్కా నిలువలు ఉన్నట్లు తెలిసిన అధికారులు దాడులు నిర్వహించేందుకు బయలుదేరిన క్షణాల్లోనే వ్యాపారులకు తెలిసిపోతుంది. పూర్తిగా సరుకు బయటకు వెళ్లిన తరువాతే దాడులు జరుగుతున్నాయి. అందుకు నిదర్శనం ఆదివారం కేవీపీ కాలనీ చివర మిల్లులో దొరికిన శివకుమార్‌ ఇప్పుడేంటని మీడియా ఎదుటే వ్యాఖ్యలు చేయటమే నిలుస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top