
పార్శిల్ సర్వీస్ సెంటర్ల తనిఖీ
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలో విజిలెన్సు, జీఎస్‌టీ, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా పట్టణంలోని పార్శిల్ సర్వీసు కార్యాలయాలు ఎస్‌ఆర్‌ఎంటీ, నవత, సింధు పార్శిల్ సర్వీస్‌లను బుధవారం తనిఖీ చేశారు. జగదీశ్వర్‌రావుకు చెందిన రూ.1,88,800 విలువ కలిగిన 116 లీటర్లు నిషేధిత గ్‌లైఫోసైట్, కేంద్ర ప్రభుత్వం నిషేధించిన డైక్టోరావోస్ పురుగు మందులు ఎటువంటి లైసెన్స్, బిల్లులు లేకుండా ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఎసై కె.సీతారాము, జీఎస్‌టీ అధికారి బి.దానేశ్వరరావు, వ్యవసాయ శాఖ అధికారి ఆర్‌ఎస్.ప్రసాద్ తెలిపారు.
ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్‌గా రాజ్‌కుమార్
రాజమహేంద్రవరం సిటీ: ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్‌గా కత్తుల రాజ్‌కుమార్ బుధవారం రాజమహేంద్రవరంలోని జోనల్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆయన కరీంనగర్ జోన్ నుంచి పదోన్నతిపై ఇక్కడకు బదిలీపై వచ్చారు. రాజమహేంద్రవరం జోన్ పరిధిలోని కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 64 శాఖలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తారు. ఇప్పటి వరకు జోనల్ కార్యాలయం పరిధిలో రూ.10,037 కోట్ల వరకు వ్యాపారం జరిగినట్లు బ్యాంక్ వర్గాలు తెలిపారు.
తప్పిపోయిన బాలిక అప్పగింత
గంటల వ్యవధిలో ఆచూకీ కనుగొన్న పోలీసులు
భీమవరం: సాంకేతిక పరిజ్ఞనాన్ని వినియోగించి గంటల వ్యవధిలో మైనర్ బాలిక మిస్సింగ్ కేసును ఛేదించినట్లు భీమవరం టూటౌన్ సీఐ జి కాళీచరణ్ బుధవారం చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన 8వ తరగతి విద్యార్థి బాలిక (14 ఏళ్లు) ఈనెల 22వ తేదీ సాయంత్రం 4 గంటలకు కన్పించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు చుట్టపక్కల, సమీప బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆ రోజు రాత్రి 11 గంటలకు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సదరు బాలిక ఆచూకీ కోసం ముందుగా జిల్లా వ్యాప్తంగా లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి డాగ్ స్క్వాడ్, డ్రోన్స్ సహాయంతో పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించినా ఫలితం లేకపోయింది. అనంతరం చుట్టుప్రక్కల ప్రదేశాల్లోని సీసీ టీవీ కెమేరాల ఫుటేజ్ పరిశీలించి, సదరు బాలిక పూరీ – తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో విశాఖపట్నం వైపు ప్రయాణిస్తున్నట్లు గ్రహించి తుని, అనకాపల్లి, విశాఖపట్నం రైల్వే స్టేషన్లలోని జీఆర్‌పీ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసు అధికారులకు సమాచారమిచ్చారు. బుధవారం విశాఖపట్టణం రైల్వే స్టేషన్‌న్‌లో బాలికను విశాఖ రైల్వే పోలీసులు గుర్తించి భీమవరం టూటౌన్ పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికెళ్లి బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు సీఐ కాళీచరణ్ చెప్పారు.
వ్యక్తి ఆత్మహత్య
ఉంగుటూరు: యర్రమళ్ల గ్రామంలో ఓ వ్యక్తి ఊరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మానుకొండ బాబూరావు (50), అతని భార్య పదేళ్ల నుంచి విడిగా ఉంటున్నారు. మంగళవారం రాత్రి బాబూరావు ఇంటి సమీపంలోని చెట్టుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. బాబూరావు మృతదేహానికి తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బుధవారం అంత్యక్రియలు పూర్తిచేశారు.

పార్శిల్ సర్వీస్ సెంటర్ల తనిఖీ