
విశాఖపట్నం, సాక్షి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలనలో ప్రజాస్వామ్యం మళ్లీ మళ్లీ ఖూనీ అవుతోంది. బలం లేకున్నా విశాఖ మేయర్‌పై అవిశ్వాసం పెట్టి.. కుట్రలు, ప్రలోభాల పర్వాలతో అడ్డదారిలో నెగ్గింది. ఏకంగా 30 మంది కార్పొరేటర్లను కొనుగోలు చేసిన టీడీపీ.. యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకటకుమారిను మేయర్ పీఠం నుంచి దించేసింది.
అధికార వ్యామోహంలో ఉన్న కూటమి ప్రభుత్వం.. కేవలం పది నెలల కాలం ఉన్న ఓ మేయర్ పదవి కోసం కోట్లాది రూపాయలు గుమ్మరించడం గమనార్హం. ఈ క్రమంలో దిగజారుడు రాజకీయాలు చేసింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను తమవైపు తిప్పుకునేందుకు చివరి నిమిషం దాకా ప్రలోభాల పర్వం కొనసాగిస్తూ వచ్చింది.
కార్పొరేటర్లను ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలకు పంపడం, స్టార్ హోటల్స్‌లో విడిది ఏర్పాటు చేయడం లాంటి చేష్టలకు పాల్పడింది. కేరళకు వెళ్లి మరీ వైస్సార్‌సీపీ కార్పొరేటర్లను బెదిరించి.. బతిమాలి.. డబ్బు ఆశ చూపించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొందరు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం.
అవిశ్వాసం నెగ్గాలంటే 74 ఓట్లు అవసరం. ఒకవైపు డబ్బు ఎర, మరోవైపు బెదిరింపులు, ఇంకోవైపు కిడ్నాపులు.. ఇలా టీడీపీ నేతలు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. అయినా సరే బొటాబొటిగా 74 మంది సభ్యులతోనే విశాఖ మేయర్‌పై అవిశ్వాసం నెగ్గింది టీడీపీ. ఇక అవిశ్వాస ఓటింగ్‌కు దూరంగా ఉంటూనే.. భారీ భద్రత నడుమ ఓటింగ్ నిర్వహించాలని, ఓటింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయించాలని వైఎస్సార్‌సీపీ చేసిన విజ్ఞప్తిని అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.
కూటమి నేతలను అడ్డుకోని పోలీసులు
అవిశ్వాసం వేళ.. కూటమి కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియో సభ్యులు కాకుండా కొందరు కూటమి నేతలను పోలీసులు జీవీఎంసీ కార్యాలయంలోకి లోపలికి అనుమతించారు. బస్సులో ఉన్న కూటమి నాయకులను వారి అనుచరులను నిలువరించకుండా చూస్తూ ఉండిపోయారు. ఓటింగ్‌కు వెళ్లిన సభ్యులతో కలిసి జీవీఎంసీ దర్జాగా కొందరు కూటమి నేతలు వెళ్తున్న దృశ్యాలు మీడియాకు చేరడం గమనార్హం.
నీచమైన రాజకీయాలు వద్దని చెప్పా
ప్రత్యేక విమానంలో కేరళ వచ్చి కూటమి నేతలు నన్ను బెదిరించారు. కూటమికి అనుకూలంగా ఓటు వేయమన్నారు. నేను పార్టీ మారేది లేదని చెప్పాను. మొదటినుంచి నేను వైఎస్సార్‌సీపీలో ఉన్నాను. రాజకీయమంటే వ్యాపారం కాదు. డబ్బులు కోసం నీతిమాలిన రాజకీయాలు చేయను. నీచమైన రాజకీయాలను చెయ్యొద్దని చెప్పాను. వైయస్ జగన్ వలనే నేను కార్పోరేటర్ అయ్యాను అని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ శశికళ ఈ ఉదయం ఓ వీడియో విడుదల చేశారు కూడా.

ఓటింగ్‌కు ముందు వాస్తవ బలాబలాలు
వైఎస్సార్సీపీ 58
టీడీపీ 29
జనసేన 3
బీజేపీ 1
సీపీఐ 1
సీపీఎం 1
ఇండిపెండెన్స్ 4.
ఖాళీలు 1.
జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లు
జీవీఎంసీలో 14 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు
టీడీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు.. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఒక ఎమ్మెల్సీ..
వైఎస్సార్సీపీకి ముగ్గురు ఎక్స్ అఫీషియ సభ్యులు.
ఎంపీ గొల్ల బాబురావు, ఇద్దరు, ఎమ్మెల్సీలు పండుల రవీంద్రబాబు, కుంభ రవిబాబు..
ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం జీవీఎంసీ సభ్యుల సంఖ్య బలం 97+14= 111
అవిశ్వాసం నెగ్గేందుకు 2/3 మెజారిటీ అంటే 74 మంది సభ్యులు అవసరం..
ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి వైఎస్సార్‌సీపీ మొత్తం బలం 61
ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కూటమి మొత్తం బలం 48
ఎన్నికకు దూరంగా ఇద్దరు సీపీఎం, సీపీఐ సభ్యులు.