
ప్రతిపాదనలతోనే సరి!
కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు ఎప్పుడో..
ఆదేశాలు రాలేదు..
కార్యరూపం దాల్చక అవస్థలు..
నాగర్‌కర్నూల్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు ప్రతిపాదనలకే పరిమితమైంది. ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ విద్య అభ్యసించేందుకు ఎంతో మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నారు. 5నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని కళాశాలలకు సకాలంలో చేరుకునేందుకు ఉదయాన్నే ఇళ్ల నుంచి బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు అల్పాహారం చేయడం కూడా గగనంగా ఉంటుంది. ఇక మధ్యాహ్న భోజనం తెచ్చుకోలేక.. బయట తినే ఆర్థిక స్థోమత లేక ఆకలి చూపులతో తరగతులు వినాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రతిపాదనలు స్వీకరించింది. అయితే విద్యా సంవత్సరం చివరిలో ఈ ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఈ ఏడాది నుంచి కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తుందని అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ సారి కూడా మధ్నాహ్న భోజనం అమలయ్యే సూచనలు కనిపించడం లేదు.
హాజరు శాతం పెరిగే అవకాశం..
జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. ప్రథమ సంవత్సరంలో 6,483 మంది, ద్వితీయ సంవత్సరంలో 6,823 మంది విద్యార్థులు ఇంటర్ విద్య అభ్యసిస్తున్నారు. ఆయా కళాశాలలకు ఎక్కువ శాతం సమీప గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులే అధికం. వారంతా రోజు దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో డ్రాపౌట్లు కూడా పెరుగుతున్నాయి. ఈ ప్రభావం ఇంటర్ ఉత్తీర్ణత శాతంపై పడుతుంది. ఇదిలా ఉంటే, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించిన తర్వాతే హాజరు శాతం పెరిగింది. ఇదే ఫార్ములాను కళాశాలల్లో ప్రయోగిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతే కాకుండా పరీక్షల సమయంలో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుంటారు. దీంతో గ్రామీణ విద్యార్థులు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కళాశాలల్లో మధ్యాహ్న బోజనం అమలుచేస్తే దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు మేలు చేకూరనుంది.
గతేడాది ప్రతిపాదనలు పంపిన
ఇంటర్ విద్యాశాఖ
నేటికీ ప్రభుత్వం నుంచి రాని స్పష్టత
జిల్లాలోని 16 కళాశాలల్లో 13,872 మంది విద్యార్థులు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఒక్కో విద్యార్థికి ఎంత కేటాయిస్తారు.. ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే విషయాలు తెలియదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే వాటిని అమలుచేస్తాం.
– వెంకటరమణ,
ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్
2018లో అప్పటి ప్రభుత్వం అక్షయ ఫౌండేషన్ ద్వారా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని భావించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత 2021లోనూ మరో మారు ఈ ప్రయత్నం చేసినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. గతేడాది నుంచి ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపాదనలు సేకరించినా.. కార్యరూపం దాల్చలేదు. కాగా, ఒక్కో విద్యార్థికి రూ.20 నుంచి రూ.25 ఖర్చవుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ మేరకు గతేడాది జిల్లాలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు.. ఒక్కో విద్యార్థికి ఎంత ఖర్చవుతుందనే విషయంపై ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ప్రతిపాదనలతోనే సరి!