
పంటకోతకు ముందే కన్నీరు
● ఉల్లికి గిట్టుబాటు ధర లేక దున్నేయడం, గొర్రెలకు మేతగా వదిలేస్తున్న వైనం ● పది రోజుల్లో వందలాది ఎకరాల్లో పంటను ధ్వంసం చేసిన రైతులు
కోడుమూరు రూరల్: ఆరుగాలం కష్టించి పండించిన ఉల్లి పంటకు కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధరను కల్పించలేకపోతుంది. ధర లేక చేతికొచ్చిన ఉల్లి పంట ను కొందరు దున్నేస్తుండగా, మరికొందరు రైతులు గొర్రెలకు మేతగా వదిలేస్తున్నారు. దీంతో కష్టపడి పండించిన పంట కళ్లెదుటే నాశనమవుతున్న దృశ్యాలను చూస్తూ రైతుల గుండెలు బరువెక్కుతున్నాయి. గతంలో ఏనాడు కూడా ఇలా చేతికొచ్చిన పంటలను చేజేతులా నాశనం చేసే దృశ్యాలను చూడలేదనిని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ దృశ్యాలు ప్రతి గ్రామంలో నిత్యం చోటుచేసుకుంటున్నాయి.
కర్నూలు జిల్లాలో ఈ ఏడాది 30 వేలకు పైగా ఎకరాల్లో రైతులు వర్షాధారం, బోరుబావుల కింద లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి ఉల్లి పంటను సాగు చేశారు. రైతుల కష్టం ఫలించి దిగుబడులు బాగానే ఉన్నా మార్కెట్లో మాత్రం ధర పూర్తిగా పడిపోవడంతో పాటు, ఉల్లి అంటే మాకొద్దు అనే పరిస్థితి నెలకొంది. మార్కెట్లో క్వింటాల్ ఉల్లి రూ.500 కూడా పలకకపోవడంతో పంట కోసి మార్కెట్‌కు తరలించినా కూలీ రేట్లు కూడా రైతులకు గిట్టుబాటుగాని పరిస్థితి నెలకొంది. దీంతో గత 10 రోజుల వ్యవధిలో జిల్లాలోని కోడుమూరు, గూడూరు, సి.బెళగల్, క్రిష్ణగిరి, దేవనకొండ, గోనెగండ్ల, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆస్పరి, తుగ్గలి, పత్తికొండ, ఆదోని, ఆలూరు వంటి ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో రైతులు చేతికొచ్చిన ఉల్లి పంటను దున్నేస్తూ గొర్రెలకు మేతగా వదిలేస్తూ ధ్వంసం చేశారు. ఒక్క కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలోనే గత వారం రోజుల్లో వెంకటప్ప, రఫీక్, శ్రీనివాసులు, షఫీ, తెలుగు శ్రీనివాసులు, గోపాల్, భాస్కర్‌రెడ్డిలతో పాటు మరికొందరు రైతులు 40కు పైగా ఎకరాల్లో సాగు చేసిన ఉల్లి పంటను ధ్వంసం చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధమవుతోంది.
ఉల్లి రైతులను పట్టించుకోని ప్రభుత్వం
ఆరంభ శూరత్వంగా కొద్ది రోజుల పాటు ఉల్లికి మద్దతు ధర అంటూ క్వింటాలు ఉల్లి రూ.1200 ప్రకారం కోనుగోలు చేసిన కూటమి ప్రభుత్వం ఆ తర్వాత పూర్తిగా చేతులెత్తేసింది. తర్వాత ఉల్లికి మద్దతు ధర గాకుండా హెక్టార్‌కు రూ.50 వేల ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామంటూ ప్రకటన చేసి చేతులు దులుపుకుంది.
ఉల్లి పంటను రోటావేటర్‌తో ధ్వంసం చేస్తున్న రైతు ధ్వంసమైన ఉల్లి

పంటకోతకు ముందే కన్నీరు

పంటకోతకు ముందే కన్నీరు