
వరుణుడి కటాక్షం
జిల్లాలో వర్షపాతం వివరాలు (మి.మీ.ల్లో)
ఈ ఏడాది సాధారణానికి
మించి వర్షపాతం
సీజన్‌లోకెల్లా ఆగస్టులో అధిక వర్షాలు
అనుకూలించిన వానలతో
సమృద్ధిగా పంటల సాగు
ఖమ్మంవ్యవసాయం: ఈ ఏడాది వానదేవుడు అనుకూలించాడు. వరుణుడి కటాక్షంతో సమృద్ధిగా వర్షాలు కురవడంతో జలాశయాలు నిండగా పంటలు అంచనాలకు మించి సాగవుతున్నాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జిల్లాలో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. జూన్‌లో స్వల్పంగా తగ్గినా.. జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో మాత్రం లక్ష్యానికి మించి వర్షాలు కురిశాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం కొంత తక్కువగానే ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలోనే ఉండడం విశేషం. సమృద్ధిగా కురిసిన వానలతో జలాశయాలు సకాలంలో నిండడం.. సాగర్ జలాలు కూడా చేరడంతో పంటల సాగు విస్తీర్ణం లక్ష్యాలను మించి నమోదైంది.
అంతకు మించి...
ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జిల్లాలో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. జూన్ మినహా మిగిలిన మూడు నెలలు అధిక వర్షపాతం నమోదైంది. జూన్‌లో సాధారణ వర్షపాతం 131.2 మి.మీ.కు 123.9 మి.మీ.లు నమోవడంతో రైతుల్లో కొంత నిరాశ అలుముకుంది. కానీ జూన్ ఆరంభానికి ముందు మే 25, 26వ తేదీల్లో రోహిణి కార్తెలోనే వానలు ప్రారంభమయ్యాయి. దీంతో అప్పుడే జిల్లాలో వ్యవసాయ పనులు మొదలైనా జూన్‌లో కాస్త ఇబ్బందపడ్డారు. ఇక జూలైలో సాధరణానికి మించి 16.9 శాతం, ఆగస్టులో 62.4 శాతం, సెప్టెంబర్‌లో 34.7 శాతం వర్షపాతం అధికంగా నమోదైంది.
ఆగస్టులో అదుర్స్
నాలుగు నెలల్లో పరిశీలిస్తే ఆగస్టు నెలలో అధిక వర్షపాతం నమోదైంది. ఈ నెలలో సాధారణ వర్షపాతం 240 మి.మీ.లు కాగా 389.7 మి.మీ.గా నమోదు కావడంతో జలాశయాలు నిండుకుండల్లా మారాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం 52 రోజులు వర్షం కురవగా, ఆగస్టులో 17 రోజుల పాటు వర్షం కురిసింది.
సస్యశ్యామలం
సమృద్ధిగా కురిసిన వర్షాలు పంటల సాగుకు దోహదపడ్డాయి. ఈ ఏడాది వ్యవసాయ శాఖ అన్ని పంటలు కలిపి 6,08,348 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. కానీ 6,97,441 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ప్రధానంగా పత్తి, వరి సాగు విస్తీర్ణం పెరిగింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 2,87,928 ఎకరాలు కాగా 2,95,012 ఎకరాల్లో, పత్తి 2,15,643 ఎకరాలకు గాను 2,25,613 ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. వీటితో పాటు పెసర, కంది వంటి పంటలు, చెరకు, మిర్చి పంటలు కూడా సాగు చేస్తున్నారు.
నెల సాధారణం నమోదు
జూన్ 131.2 123.9
జూలై 240.9 281.6
ఆగస్టు 240.0 389.7
సెప్టెంబర్ 179.0 241.1