మనసును ‘స్కాన్‌’ చేసి వైద్యం నడిపిద్దాం | Teen Girl’s Sudden Paralysis Solved: Doctors Diagnose Rare Functional Neurological Disorder | Sakshi
Sakshi News home page

మనసును ‘స్కాన్‌’ చేసి వైద్యం నడిపిద్దాం

Aug 22 2025 9:38 AM | Updated on Aug 22 2025 11:27 AM

Hoovers sign for the diagnosis of functional weakness

ఓ టీనేజీ అమ్మాయి అప్పటివరకూ అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంది. కానీ అకస్మాత్తుగా కాళ్లు రెండూ చచ్చుబడ్డాయి. ఏమాత్రం కదల్లేకపోవడంతో వీల్‌చైర్‌కు పరిమితమైంది. కారణం తెలుసుకోడానికి చేయని పరీక్ష లేదూ... తీయని స్కాన్‌ లేదు. కానీ ఎందులోనూ ఏమీ కనిపించలేదు. ఎట్టకేలకు తెలిసిన విషయం డాక్టర్లనే అబ్బురపరచింది. ఆ మెడికల్‌ సీక్రెట్‌ ఏమిటో చూద్దాం.  

ఈ కథ ఓ మెడికల్‌ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎంతకూ క్లూయే దొరకని పరిశోధనాత్మకమైన సస్పెన్స్‌ స్టోరీని గుర్తుచేస్తుంది. రియా (పేరు మార్చాం) అనే ఓ పదిహేనేళ్ల చురుకైన అమ్మాయికి అకస్మాత్తుగా ఓ క్షణాన రెండు కాళ్లూ పడిపోయాయి. ఎంతకీ చలనం కలగలేదు. దాంతో అమ్మాయి వీల్‌ చైర్‌కే పరిమితం కావాల్సివచ్చింది. 

రియాను హాస్పిటల్‌కు తరలించారు. అపరాధ పరిశోధనల్లో నేరస్తుని జాడల కోసం వెతికినట్టుగా డాక్టర్లు ఓ అమ్మాయి జబ్బుకు కారణమైన ఆ అంశం కోసం పరిశోధనలు చేశారు... చేస్తూ పోయారు. రక్తపరీక్షలు చేశారు, ఎమ్మారైలు తీశారు. వాటి ద్వారా కండరాలను పరీక్షించారు. నరాలల్లోకి పరికించి చూశారు. ఇంకా ఇంకా అడ్వాన్స్‌డ్‌ పరీక్షలతో మెదడూ, వెన్నుముల్లోకి తరచి చూశారు. ఊహూ... కారణమెంతకూ దొరకలేదు. 

రియా చదువుల్లో సరస్వతి. స్కూలు వక్తృత్వపు పోటీల్లో మంచి వక్త. అంతేకాదు...  మంచి మంచి పెయింటింగ్స్‌ కూడా వేసేది. అలాంటి అమ్మాయిని పేరు తెలియని జబ్బు హైజాక్‌ చేసేసింది. కాళ్లనొప్పితో ఎలాగో కుంటుతూ స్కూలు దాకా వెళ్లిన ఆ అమ్మాయి స్కూలు నుంచి తిరిగి వచ్చేసరికి ఆమె రెండు కాళ్లూ చచ్చుబడ్డాయి. రక్త పరీక్షలు చేశారు. 

ఏమీలేదు. ఇలా ఎన్ని పరీక్షలు చేసినా జబ్బు ఆచూకీ అంతు చిక్కలేదు. విటమిన్‌ లెవెల్స్, ఎలక్ట్రోలైట్స్‌ ఇలా ఎన్ని చికిత్సలు చేసినా ఫలితమూ దక్కలేదు. అప్పటివరకూ అక్షరాలా ‘తన కాళ్ల మీద తాను నిలబడ్డ’ ఆ అమ్మాయి తన స్వతంత్రతను కోల్పోయి మరొకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో   లంబార్‌ పంక్చర్‌ అనే వెన్నుముక గాటు పెట్టి అందులో నీరు తీసి చూసే చిట్టచివరి పరీక్షకు డాక్టర్లు సిఫార్సు చేశారు.

రెండో ఒపీనియన్‌ కోసం... 
దేహానికి గాటు పెట్టి చేసి మరింత తీవ్రమైన పరీక్షలతో ఆమెను బాధించడానికి పూనుకునే ముందర ఎందుకోగానీ... రియా తల్లిదండ్రులు రెండో ఓపీనియన్‌ కోసం హైదరాబాద్‌లోని సుధీర్‌కుమార్‌ అనే న్యూరాలజిస్టును సంప్రదించారు. ఇతరత్రా పరీక్షలతో పాటు రిపోర్టుల్లో విటమిన్‌–బి12, విటమిన్‌ డీతోపాటు మెదడూ, వెన్నెముకా, నర్వ్‌ కండక్షన్‌ స్టడీస్‌... ఇలాంటివన్నీ పరిశీలిస్తున్న డాక్టర్‌గారికి ఎందుకో అనుమానం వచ్చి ‘హూవర్స్‌ సైన్‌’ అనే ఓ సునిశిత పరిశీలన చేశారు.

ఏమిటీ హూవర్స్‌ సైన్‌ ? 
బాధితులను పడుకోబెట్టాక రెండు కాళ్ల మడమల కింద రెండు చేతులూ పెట్టి, బలహీనంగా ఉన్న ఓ కాలిని ప్రయత్నపూర్వకంగా ఎంతోకొంత పైకెత్తమని డాక్టర్లు అడుగుతారు. వాస్తవంగా కాళ్లలో పూర్తిగా చచ్చుబడిపోయిన వ్యక్తుల్లో ఓ కాలు కాస్త ఎత్తడానికి ప్రయత్నించినా రెండోకాలిలో ఎలాంటి చలనమూ ఉండదు. 

కానీ అది  వాస్తవంగా చచ్చుబడిన కేసు కానప్పుడు బాధితులు ఓ కాలు ఎత్తడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మరో కాలిమీద బరువు/ఒత్తిడి పెరుగుతుంది. అంటే... కాలిని ఎత్తే ప్రయత్నంలో మరోకాలు వెనక్కెళ్తుండటంతో ఇలా జరుగుతుంది. (ఈ హూవర్స్‌ సైన్‌ (గుర్తు) అన్నది కాలు చచ్చుబడిపోయిన సందర్భంలో నిర్ధారణ కోసం చేసేది. 

ఇలాంటి హూవర్స్‌ సైన్స్‌ (గుర్తులు) ఊపిరితిత్తుల విషయంలో మరో రకంగా ఉంటాయి). దాంతో ఇది వాస్తవంగా కాళ్లు చచ్చుబడిపోయిన కేసు కాదనీ, ఆ కండిషన్‌ను అనుకరిస్తున్న (మిమిక్‌ చేస్తున్న కేసు) అని డాక్టర్‌కు అర్థమైంది. అంతా బాగున్నప్పటికీ ఆమె కాళ్లను కదలించలేకపోతోందంటే ఏదో మతలబు ఉంది.

అది నటన కాదు... బాధితురాలు నటించడం లేదు...  
అయితే ఇక్కడ బాధితురాలు రియా నటిస్తోందని అనుకోడానికి వీల్లేదు. కాళ్లు పడిపోవడం జరగనప్పటికీ... మానసిక కారణాలతో కాళ్లను కదలించలేకపోతోంది. తన మానసిక సమస్య కారణంగా నిజంగానే ఆమె కాళ్లు కదిలించలేకపోతోంది. దీన్ని వైద్యపరిభాషలో ‘ఫంక్షనల్‌ న్యూరలాజికల్‌ డిజార్డర్‌ – ఎఫ్‌ఎన్‌డీ’ అంటారు. దీనికి కౌన్సెలింగ్‌ అవసరమని గ్రహించిన డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ ఆమెతో ఏకాంతంగా మాట్లాడారు.

అసలు కారణమిది... 
రియా కాస్త బొద్దుగా ఉండటంతో తోటి విద్యార్థినీ, విద్యార్థులు ఆమెను వెక్కిరిస్తుండేవాళ్లు. ఆమె బరువును చూసి గేలి చేస్తుండేవాళ్లు. దాంతో తీవ్రమైన వ్యాకులతకూ, మనఃక్లేశానికీ లోనైన ఆమె తనకు తెలియకుండానే ఇలాంటి కండిషన్‌కు గురైంది. అన్నీ నార్మల్‌గా ఉన్నా అనారోగ్యానికి గురయ్యే మానసిక సమస్య అని తేల్చారు డాక్టర్‌ సుధీర్‌కుమార్‌. 

ఇందులో నరాలకు సంబంధించిన అంశంతో పాటు మానసిక నిపుణులతో మల్టీ డిసిప్లినరీగా ప్రయత్నించాల్సిన సంక్లిష్టమైన కేసు. ఇది అర్థమయ్యాక ఆమెలో మానసిక స్థైర్యం నింపేలా అనేక స్పెషాలిటీలకు సంబంధించిన డాక్టర్లు సంయుక్తంగా చికిత్స మొదలుపెట్టారు.

ఆర్నెల్ల తర్వాత... 
అన్ని చికిత్సలూ ఫలించడంతో రియా మామూలుగా మారింది. ఇప్పుడు తన కాళ్ల మీద తాను మళ్లీ నిలబడటంతో పాటు తన చేతుల్లోని కుంచెను కదిలించి అందమైన బొమ్మలు వేయడం మొదలుపెట్టింది. ఇప్పుడామె టీనేజ్‌ లైఫ్‌ తాను వేస్తున్న పెయింటింగ్స్‌ అందంగా అందులోని కలర్సంతగా రంగులమయంగా మళ్లీ  మారిపోయింది. 

చివరగా... అందించాల్సిన ట్రీట్‌మెంట్‌ ఒక్కటే డాక్టర్ల బాధ్యత కాదు... సంక్లిష్ట సమయాల్లో అందించాల్సినవి... చికిత్సా, మందులతో పాటు అక్కడ నిజంగా అందాల్సినదీ, అవసరమైనదేమిటంటే...  చక్కటి సానుభూతీ, చిక్కటి సహానుభూతి. 
– యాసీన్‌

డాక్టర్లూ... ఇది వినండి

ఈ కేసు ద్వారా డాక్టర్లకూ ఓ సందేశమిస్తున్నారు డాక్టర్‌ సుధీర్‌కుమార్‌. అదేమిటంటే... 

కేవలం రిపోర్టులు చూసే ఓ నిర్ధారణకు రాకండి. బాధితులు చెప్పేది పూర్తిగా సానుభూతితో, సహానుభూతితో వినండి. అప్పుడు కొన్ని వాస్తవాలు తెలుస్తాయి.

ఫంక్షనల్‌ డిజార్డర్లలో పేషెంట్స్‌ చేసేది నటించడం కానే కాదు. వాళ్ల బాధలు పూర్తిగా జెన్యూన్‌. వాళ్లు చెప్పేది పచ్చి వాస్తవం. 

క్లినికల్‌ పరీక్షల తర్వాత కూడా ఏ కారణాలూ తెలియకపోతే... వారిని కోసి చేసే పరీక్షలకూ, పొడిచి నిర్వహించాల్సిన ప్రోసీజర్లకు వెంటనే గురిచేయకండి. కాస్త చురుగ్గా, నిశితంగా ఆలోచించి ‘హూవర్స్‌ సైన్స్‌’ లాంటి వాటి గురించి మీ పరిధి దాటి (ఔట్‌ ఆఫ్‌ ద బాక్స్‌) ఆలోచించేలా ప్రయత్నించండి. దాంతో పేషెంట్స్‌ను బాధించి చేసే ఇన్వేజివ్‌ ఇన్వెస్టిగేషన్స్‌కు ముందే జబ్బు నిర్ధారణకు అవకాశం దొరుకుతుంది. 

ఒక వ్యక్తికి స్వస్థత చేకూర్చడం మీ ఒక్కరివల్లనే కుదరనప్పుడు టీమ్‌తో కలిసి...  అంటే సైకాలజిస్టులూ, ఫిజీషియన్లూ, ఫిజియోథెరపిస్టుల తోపాటు అవసరమైతే టీచర్లూ, కుటుంబ సభ్యులందరూ బృందంగా టీమ్‌వర్క్‌తో తగిన చికిత్స అందించి, బాధితులు హాయిగా కోలుకునేలా 
చేయండి. 
డాక్టర్‌ సుధీర్‌కుమార్‌, సీనియర్‌ న్యూరో ఫిజీషియన్‌  

(చదవండి: 'శంఖారావం' చేస్తే..ఆ వ్యాధి తగ్గిపోతుందట..! అధ్యయనంలో వెల్లడి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement