
కొత్త కలెక్టర్ కె.విజయ
● రవి పట్టన్‌శెట్టికి బదిలీ
సాక్షి, అనకాపల్లి: జిల్లా కలెక్టర్ రవి పట్టన్‌శెట్టికి బదిలీ అయింది. ఆయన స్థానంలో ప్రస్తుత సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ కె.విజయను కలెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కె.విజయ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సబ్ కలెక్టర్‌గా, ఉమ్మడి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, ఏపీ టూరిజం సీఈఓగా, ఏడాదిపాటు బాపట్ల కలెక్టర్‌గా పనిచేశారు. బాపట్ల జిల్లా తొలి కలెక్టర్‌గా 2022 ఏప్రిల్ 4 నుంచి 2023 ఏప్రిల్ 14 వరకు విధులు నిర్వహించారు. రవి పట్టన్‌శెట్టికి ప్రస్తుతానికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.
ఆదర్శ ఐఏఎస్
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సబ్ కలెక్టర్‌గా కె.విజయ రాజమండ్రిలో పనిచేస్తున్న సమయంలో ఆమె భర్త, ఇటీవల అల్లూరి జిల్లా కలెక్టర్‌గా నియమితులైన దినేష్‌కుమార్ రంపచోడవరంలో ఐటీడీఏ పీవోగా విధులు నిర్వహించేవారు. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న ఆమె రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ రోగుల మాదిరి పురుడు పోసుకొని ఆదర్శంగా నిలిచారు. ప్రజలను చైతన్యపరుస్తూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందనే మనోధైర్యాన్ని కల్పించారు. ఐఏఎస్ దంపతులిద్దరూ ఆదర్శ కలెక్టర్లుగా పేరు తెచ్చుకున్నారు. కె.విజయ టూరిజం విభాగంలో పనిచేసిన సమయంలో అరకు బెలూన్ ఫెస్టివల్ నిర్వహణలో కీలకపాత్ర పోషించడమే కాకుండా 2019లో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో పూతరేకులు, 15 అడుగుల లాంగెస్ట్ బాంబూ చికెన్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు కల్పించడంలో కీలక పాత్ర పోషించారు.