గుడ్డు లేదు.. ఫుడ్డే!

Eggs Are Not Distributed Properly For Anganwadi Centers - Sakshi

అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు బంద్‌..  

3 నెలలుగా నిలిచిన బిల్లులు  

రాష్ట్రవ్యాప్తంగా 68 కోట్లు పెండింగ్‌ 

సరఫరాకు కాంట్రాక్టర్ల్ల ససేమిరా

కేంద్రాలకు తగ్గుతున్న హాజరు

 సాక్షి, హైదరాబాద్‌: అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల పంపిణీ గాడి తప్పింది. గుడ్లు పంపిణీ చేసే కాంట్రాక్టర్లకు నెలల తరబడి బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేయడంతో క్షేత్రస్థాయిలో సరఫరా నిలిచిపోయింది. గుడ్లకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా రూ. 68 కోట్ల బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఇంత పెద్ద మొత్తం లో బకాయిలు ఉండటంతో ఈ నెల నుంచి కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. దీంతో కేంద్రాలకు వస్తున్న లబ్ధిదారుల సంఖ్య పడిపోతోంది. 

పారదర్శకత కోసం ఎగ్‌ యాప్‌ 
రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 149 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్‌వా డీ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా గర్భిణులు, పాలిచ్చే తల్లులు, చిన్నారులు కలిపి మొత్తంగా 22 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. వీరు పౌష్టికాహార సమస్యను అధిగమించేందుకు అంగన్‌వాడీల ద్వారా ఉడికించిన కోడిగుడ్లను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. గుడ్ల సరఫరా కోసం జిల్లాల వారీగా కాంట్రాక్టర్లను గుర్తించింది. ప్రస్తుతం నెలలో 3 సార్లు గుడ్లు సరఫరా చేస్తున్నారు. సగటున 10 రోజులకు సరిపడా స్టాకును కేంద్రాల్లో నిల్వ ఉంచుతారు. అవి నిండుకునేలోపు తిరిగి స్టాక్‌ కేంద్రానికి పంపి స్తారు. సరఫరాలో పారదర్శకత కోసం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఎగ్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. స్టాక్‌ను తీసుకునే టీచర్‌కు ముందుగా ఓటీపీ వస్తుంది. దాని ఆధారంగానే గుడ్లు తీసుకోవాలి. స్టాక్‌ కేంద్రానికి చేరగానే అధికారులకు సమాచారం వెళ్తుంది. బిల్లులు ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్‌ అవుతాయి. చెల్లింపులూ క్రమ పద్ధతిలో జరుగుతాయి.  

ఓటీపీలు సిద్ధం కానీ..  యాప్‌ విధానంతో పంపిణీ సులువైనా నిధుల విడుదలలో జాప్యం వల్ల సరఫరా అటకెక్కింది. చాలా మంది అంగన్‌వాడీ టీచర్లకు రెండు, మూడు దఫాలకు సంబంధించిన ఓటీపీలు వస్తున్నా బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు స్టాకు ఇవ్వడం లేదు. గత రెండు వారాల ఓటీపీలు తమ వద్ద ఉన్నాయని, కాంట్రాక్టరు వస్తే స్టాకు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లు పేర్కొంటున్నారు. స్టాకు ఉన్నంతవరకు గుడ్లు పంపిణీ చేశామని, పక్షం రోజులుగా గుడ్లు మినహా మిగతా ఆహారం ఇస్తున్నామని మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం కేంద్రాల నిర్వహకులు చెబుతున్నారు.
 
తగ్గుతున్న హాజరు 
అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్ల చెల్లింపులు గాడితప్పాయి. 2018–19 వార్షిక సంవత్సరం ప్రారంభం నుంచీ నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. మూడు నెలలుగా పరిస్థితి మరింత తీవ్రమైనట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రూ. 68 కోట్ల బకాయిలు ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ నెల నుంచి కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. గుడ్ల పంపిణీ నిలిచిపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, మహిళల హాజరు పడిపోతోంది. జూన్‌ నెలలో 39 శాతం లబ్ధిదారులే పౌష్టికాహారం తీసుకున్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. జూలైలో లబ్ధిదారుల సంఖ్య మరింత పతనమైనట్లు ఆ శాఖ వర్గాలు అంటున్నాయి. బకాయిలు చెల్లించనప్పటికీ జూన్‌ నెలాఖరు వరకు గుడ్లు సరఫరా చేసినట్లు ఓ కాంట్రాక్టరు పేర్కొన్నారు. 

      జూన్‌లో పౌష్టికాహారం తీసుకున్న లబ్ధిదారుల సంఖ్య 

కేటగిరీ                                 నమోదు                 హాజరు          శాతం 
గర్భిణులు                              2,51,104             1,13,314      45.13 
పాలిచ్చే తల్లులు                      1,39,627                67,885      48.62 
చిన్నారులు (మూడేళ్ల లోపు)     13,02,650             6,20,705    47.65 
చిన్నారులు (ఆరేళ్ల లోపు)         11,30,040              3,20,493    28.36 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top