నాట్యోపాసనం

నాట్యోపాసనం


అద్భుతం.. అమోఘం.. అపూర్వం! ఇదేంటిలా అంటున్నారు? అనుకుంటున్నారా! మంజుల రామస్వామి శిష్యబృందం నగరంలో ప్రదర్శించే వైవిధ్యమైన భరతనాట్య ప్రదర్శనను తిలకిస్తే, ఎవరైనా ఇలా అనక మానరు. ఎంతోమంది ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకొన్నా.. కొన్నింటికి కొందరే లెజెండ్స్. ప్రజల హృదయాల్లో వారి స్థానం సుస్థిరం. భరతనాట్యం అనగానే తెలుగు, తమిళులకు గుర్తుకు వచ్చేది మంజులా రామస్వామే. మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉండే మంజులను ముందుగా ఇటీవల నగరంలో ఓ అవార్డు అందుకొన్న సందర్భంగా ‘సిటీ ప్లస్’ పలుకరించింది.

 

శ్రీరామ నాటక నికేతన్...

భారతీయ శాస్త్రీయ నృత్య కళారూపాల్లో ప్రాచుర్యం పొందిన విశిష్ఠ పక్రియ భరతనాట్యం. అలాంటి దైవికమైన నృత్యం మద్రాసు రాష్ట్రంలో కొన  ఊపిరితో ఉండగా, దానికి ప్రాణం పోసి, దీర్ఘాయుష్షు కల్పించేందుకు పుట్టిన సంజీవిని శ్రీరామ నాటక నికేతన్. నృత్యగురువు ‘దండయార్థపాణీ పిళ్లై’ దానికి ప్రాణం పోశారు. ప్రముఖ భరతనాట్య గురువు వీఎస్ రామమూర్తి (మా నాన్నగారు)దానిని అందిపుచ్చుకున్నారు. మా స్వస్థలం తంజావూరు. 1970లో ఇక్కడికి వచ్చాం. అప్పుడే సికింద్రాబాద్‌లోని అల్వాల్‌లో నృత్య పాఠశాల స్థాపించారు.

 

నమస్కరిస్తా...

భాషా సాంస్కృక శాఖకు చేతులెత్తి నమస్కరిస్తా. ఎందుకంటే రాష్ట్రం విడిచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. మా నాన్నను, నన్ను, నా శిష్యులను అభిమానించి అక్కున చేర్చుకున్నారు. వెన్నుదన్నుగా నిలిచారు. పరాయి రాష్ట్రంవాళ్లమన్న భావనతో ఏనాడూ చూడలేదు.  తల్లిలాగా ఆదరించిది హైదరాబాద్ నగరం. అలాంటి తెలుగు ప్రజల సహృదయత వర్ణించటానికి మాటలు సరిపోవు. ఇప్పుడు మేము తెలుగు బిడ్డలమే.

 

నాన్ననే ఫాలో అవుతా...

నాన్న ప్రిన్సిపుల్స్ ఉన్న వ్యక్తి. నేను ఆయననే ఫాలో అవుతా. దేశంలో, విదేశాల్లో నన్ను ప్రత్యేకంగా చూస్తున్నారు అంటే.. అందుకు కారణం నాన్నగారే. ఆయనెప్పుడూ ఒక్కటే చెప్పేవారు ‘పిల్లలు’ (శిష్యులు)తెచ్చే అవార్డులేమనకు అవార్డులు, రివార్డులు.  వాటి కోసం పరితపించకూడదు’ అని. ఆయన చెప్పిన మాటలు, చూపిన దారే నాకు ముఖ్యం. డ్యాన్స్‌తో పాటు హార్డ్‌వర్క్, విలువలు, కమిట్‌మెంట్ ప్రామాణికంగా శ్రీరామ నాటక నికేతన్ ముందుకు సాగుతుంది. మేం సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నామంటే అందుకు కారణం డ్యాన్సే. ఒక గంట క్లాస్‌లో ఉన్నామంటే అన్నీ మరచిపోతాం. కావాల్సిన ఎనర్జీ వస్తుంది.

 

రెండో ఇల్లు...

పిల్లలకు రెండో ఇల్లులాంటిది శ్రీరామ నాటక నికేతన్. ఏడేళ్లుదాటిన పిల్లలను చేర్చుకొంటాం. నృత్యం నేర్చుకోవడం వల్ల సహనం, ఆత్మస్థైర్యం, క్రమశిక్షణ అలవడతాయి. ‘దీపతరంగిణి’ని తొలుత దేవదాసీలు చేసేవారట. 1966లో మా నాన్నగారు ‘ప్లేట్ అండ్ ప్లాట్’ నృత్యాన్ని రివైజ్ చేశారు. ఇప్పుడు ‘దీపతరంగిణి చేస్తే మంజులా రామస్వామి శిష్యులే చేయాలి’ అని ఒక బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది. ఈ నృత్యం చేసిన ప్రతిసారీ కొత్తగా అనిపిస్తుంది.

- కోన సుధాకర్‌రెడ్డి

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top