రుతువు మారింది, రుచి మార్చండి

Seasonal Food Items Making - Sakshi

శిశిరం పోయి వసంతం వస్తోంది. చెట్లు కొత్త చిగుళ్లు వేస్తాయి అవి కొత్తదనం తెచ్చుకున్నప్పుడు మన వంట గిన్నెలోకి కూడా కొత్తదనం రావాలి కదా. రుతువు మారేటప్పడుకొన్ని పదార్థాలు తప్పక తినాలంటారు పెద్దలు. ఎందుకు చెప్పారో. కూపీ లాగేబదులు కిచెన్‌లోకి నడిస్తే సరిపోదూ!!!

ఖర్జూరాల లడ్డు

కావలసినవి: వేయించిన సెనగ పప్పు (పుట్నాల పప్పు) – ఒక కప్పు; ఖర్జూరాలు – పావు కప్పు (గింజలు తీసేయాలి); ఎండు కొబ్బరి తురుము – ఒక టేబుల్‌ స్పూను
తయారీ: వేయించిన సెనగ పప్పు, ఖర్జూరాలు మిక్సీలో వేసి మెత్తగా చేసి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి ∙ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని ఉండలు చేయాలి ∙ఎండు కొబ్బరి తురుములో దొర్లించాలి ∙కొద్దిగా ఆరాక గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి ∙ఇవి వారం రోజుల దాకా నిల్వ ఉంటాయి (ఇష్టమైన వారు రంగులు కూడా జత చేసుకోవచ్చు. తాజాగా ఎప్పటికప్పుడు చేసుకోవటం మంచిది)

కర్ర పెండలం బాల్స్‌
కావలసినవి: కర్ర పెండలం – అర కిలో; చిలగడ దుంప – పావు కేజీ; కొత్తిమీర – ఒక కట్ట; వెల్లుల్లి ముద్ద – అర టేబుల్‌ స్పూను; పచ్చి మిర్చి ముద్ద – పావు టీ స్పూను; నిమ్మ రసం – ఒక టేబుల్‌ స్పూను; అల్లం ముద్ద – అర టీ స్పూను; నువ్వులు – ఒక టీ స్పూను; ఆవాలు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; కిస్‌మిస్‌ – 15; నూనె – ఒక టేబుల్‌ స్పూను సాధారణంగా ఈ వంటకాన్ని హోలీ పండుగకు తయారుచేస్తారు. హోలికను దహనం చేసిన మంట బాగా చల్లారాక, ఆ సన్నని మంట మీద దుంపలను రాత్రంతా వండుతారు. ఒక్కోసారి ఆవిరి మీద ఉడికించి కూడా తయారుచేస్తారు.
తయారీ: కర్ర పెండలాన్ని శుభ్రం చేసి, పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి సుమారు అర గంట సేపు ఉడికించాలి ∙చిలగడ దుంపలను శుభ్రంగా కడిగి, ముక్కలు చేసి, తగినంత నీరు జత చేసి సుమారు పావు గంట సేపు ఉడికించాలి ∙ఇవి కొద్దిగా చల్లారాక, రెండు రకాల దుంపలకు తొక్కు తీసి, సన్నగా తురమాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙నువ్వులు వేసి మరోమారు వేయించాలి ∙పచ్చిమిర్చి ముద్ద, అల్లం ముద్ద జత చేసి రెండు నిమిషాల పాటు బాగా వేయించాలి ∙కిస్‌మిస్, కర్ర పెండలం తురుము, చిలగడ దుంప తురుము, కొత్తిమీర, వెల్లులి ముద్ద, ఉప్పు వేసి బాగా కలిపి, ఐదు నిమిషాల పాటు ఉడికించి దింపేయాలి ∙నిమ్మరసం జత చేసి బాగా కలిపి ఉండలు చేసి అందించాలి.

హెల్తీ ఠండై

కావలసినవి: ఏలకులు – 5; సోంపు – ఒకటిన్నర టీ స్పూన్లు; ధనియాలు – పావు టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; పొద్దు తిరుగుడు గింజలు – ఒక టీ స్పూను; బాదం పప్పులు – 50 గ్రా.; బ్రౌన్‌ సుగర్‌ – 5 టేబుల్‌ స్పూన్లు; గులాబీ రేకలు – 3 టేబుల్‌ స్పూన్లు; రోజ్‌ వాటర్‌ – 2 టేబుల్‌ స్పూన్లు; పాలు – ముప్పావు లీటరు; కుంకుమ పువ్వు – చిటికెడు.
తయారీ: స్టౌ మీద బాణలి వేడయ్యాక, ఏలకులు, సోంపు, ధనియాలు, మిరియాలు, పొద్దుతిరుగుడు గింజలు, బాదం పప్పులను విడివిడిగా వేసి దోరగా వేయించాలి ∙తగినన్ని నీళ్లలో రెండు గంటలు నానబెట్టాక, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙బ్రౌన్‌ సుగర్, గులాబీ రేకలు, రోజ్‌ వాటర్‌ జత చేసి మరోమారు మిక్సీ తిప్పి ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ పాలు జత చేసి బాగా కలియబెట్టి, వడకట్టి, గ్లాసులలో పోయాలి ∙గులాబీ రేకలు, కుంకుమ పువ్వులతో అలంకరించాలి.

జొన్నల చట్‌పట్‌

కావలసినవి: జొన్న పేలాలు – 5 కప్పులు; నూనె – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; కరివేపాకు – ఒక రెమ్మ; ఇంగువ – పావు టీ స్పూను; పుట్నాల పప్పు – 2 టేబుల్‌ స్పూన్లు; పసుపు – అర టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత.
తయారీ: స్టౌ మీద బాణలి వేడి చేశాక, జొన్న పేలాలు వేసి రెండు మూడు నిమిషాలు వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి ∙వేయించిన సెనగ పపున్ప జత చేసి కొద్దిసేపు ఉంచాలి ∙పసుపు, మిరపకారం, ఉప్పు జతచేసి కొద్దిసేపు ఉడికించాలి ∙వేయించిన జొన్న పేలాలు, పుట్నాల పప్పు జత చేసి సుమారు రెండు నిమిషాల పాటు వేయించి దింపేయాలి ∙బాగా చల్లారాక గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి‘

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top