
కోల్‌కతాకు కీలక విజయం
నరైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
14 పరుగులతో ఓడిన ఢిల్లీ
ఐపీఎల్‌లో ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలకు పూర్తిగా తెర పడిపోకుండా కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ ఆశలు సజీవంగా ఉంచుకుంది. గత మూడు మ్యాచ్ లలో రెండు పరాజయాలు, ఒక మ్యాచ్ రద్దు తర్వాత ఎట్టకేలకు ఆ జట్టు గెలుపు రుచి చూసింది. సమష్టి బ్యాటింగ్‌తో 200 పరుగుల స్కోరు దాటిన టీమ్... ఢిల్లీని వారి వేదికపై కట్టడి చేయడంలో సఫలమైంది. ముఖ్యంగా మ్యాచ్ చేజారుతున్న దశలో నరైన్ 7 బంతుల వ్యవధిలో 3 వికెట్లు తీసి ఆటను మలుపు తిప్పాడు.
న్యూఢిల్లీ: డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఐపీఎల్ 18వ సీజన్‌లో కీలక విజయం దక్కింది. గెలిస్తేనే నిలిచే స్థితిలో మంగళవారం బరిలోకి దిగిన కేకేఆర్ 14 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. అంగ్‌కృష్ రఘువంశీ (32 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రింకూ సింగ్ (25 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడగా, స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులే చేయగలిగింది. ఫాఫ్ డుప్లెసిస్ (45 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (23 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), విప్‌రాజ్ నిగమ్ (19 బంతుల్లో 38; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సునీల్ నరైన్ (3/29) మూడు ప్రధాన వికెట్లతో ఢిల్లీని దెబ్బ తీశాడు.
పవర్‌ప్లేలో కోల్‌కతా ఇన్నింగ్స్ జోరుగా సాగింది. చమీరా ఓవర్లో సునీల్ నరైన్ (16 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టగా...స్టార్క్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదిన రహ్మనుల్లా గుర్బాజ్ (12 బంతుల్లో 26; 5 ఫోర్లు, 1 సిక్స్) అదే ఓవర్లో అవుటయ్యాడు. తొలి 6 ఓవర్లలో మొత్తం 79 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో నరైన్, అజింక్య రహానే (14 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్), వెంకటేశ్ అయ్యర్ (7) వికెట్లను కేకేఆర్ కోల్పోయింది.
ఈ స్థితిలో రఘువంశీ, రింకూ ఐదో వికెట్‌కు 46 బంతుల్లో 61 పరుగులు జోడించి ఆదుకున్నారు. చివర్లో కోల్‌కతా కట్టడి చేయడంలో ఢిల్లీ సఫలమైంది. 3 పరుగుల వ్యవధిలో రఘు, రింకూ వెనుదిరగ్గా... స్టార్క్ వేసిన చివరి ఓవర్లో వరుస బంతుల్లో 3 వికెట్లు పడ్డాయి.
రాణించిన డుప్లెసిస్
ఛేదనలో ఢిల్లీకి సరైన ఆరంభం లభించలేదు. పొరేల్ (4), కరుణ్ నాయర్ (15), కేఎల్ రాహుల్ (7) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. అయితే డుప్లెసిస్, అక్షర్ భాగస్వామ్యంతో ఢిల్లీ గెలుపుపై ఆశలు రేగాయి. నాలుగో వికెట్‌కు డుప్లెసిస్, అక్షర్ 42 బంతుల్లోనే 76 పరుగులు జత చేశారు.
41 బంతుల్లో 69 పరుగులు చేయాల్సిన సమయంలో అక్షర్‌ను నరైన్ అవుట్ చేయడంతో ఆట మలుపు తిరిగింది. అదే ఓవర్లో స్టబ్స్ (1) కూడా వెనుదిరగ్గా... నరైన్ తన తర్వాతి ఓవర్లో డుప్లెసిస్‌ను కూడా వెనక్కి పంపించాడు. 10 పరుగుల వ్యవధిలో ఈ 3 వికెట్లు పడ్డాయి.
స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) పొరేల్ (బి) స్టార్క్ 26; నరైన్ (ఎల్బీ) (బి) విప్‌రాజ్ 27; రహానే (ఎల్బీ) (బి) అక్షర్ 26; రఘువంశీ (సి) నాయర్ (బి) చమీరా 44; వెంకటేశ్ (సి) విప్‌రాజ్ (బి) అక్షర్ 7; రింకూ (సి) స్టార్క్ (బి) విప్‌రాజ్ 36; రసెల్ (రనౌట్) 17; పావెల్ (ఎల్బీ) (బి) స్టార్క్ 5; అనుకూల్ (సి) చమీరా (బి) స్టార్క్ 0; హర్షిత్ (నాటౌట్) 0; వరుణ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–48, 2–85, 3–91, 4–113, 5–174, 6–177, 7–203, 8–203, 9–203. బౌలింగ్: స్టార్క్ 4–0–43–3, చమీరా 3–0–46–1, ముకేశ్ 2–0–17–0, విప్‌రాజ్ 4–0–41–2, అక్షర్ పటేల్ 4–0–27–2, కుల్దీప్ 3–0–27–0.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పొరేల్ (సి) రసెల్ (బి) అనుకూల్ 4; డుప్లెసిస్ (సి) రింకూ (బి) నరైన్ 62; కరుణ్ నాయర్ (ఎల్బీ) (బి) అరోరా 15; రాహుల్ (రనౌట్) 7; అక్షర్ (సి) హర్షిత్ (బి) నరైన్ 43; స్టబ్స్ (బి) నరైన్ 1; విప్‌రాజ్ (బి) రసెల్ 38; అశుతోష్ (సి) నరైన్ (బి) వరుణ్ 7; స్టార్క్ (సి) గుర్బాజ్ (బి) వరుణ్ 0; చమీరా (నాటౌట్) 2; కుల్దీప్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–4, 2–43, 3–60, 4–136, 5–138, 6–146, 7–160, 8–160, 9–189.బౌలింగ్: అనుకూల్ రాయ్ 4–0–27–1, వైభవ్ అరోరా 2–0–19–2, హర్షిత్ రాణా 4–0–49–0, వరుణ్ చక్రవర్తి 4–0–39–2, నరైన్ 4–0–29–3, రసెల్ 2–0–22–1.
ఐపీఎల్‌లో నేడు
చెన్నై X పంజాబ్
వేదిక: చెన్నై
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం