
సీపీఆర్‌ఎంఎస్‌లో గందరగోళం
శ్రీరాంపూర్: సింగరేణిలో రిటైర్డ్ అయిన కార్మికులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు సంస్థ కాంట్రీబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ స్కీం(సీపీఆర్‌ఎంఎస్) సదుపాయం కల్పించింది. ఈ స్కీం కింద హెల్త్‌కార్డులు పొందిన కార్మికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. తమకు కార్డులో ఎంత మొత్తం ఖర్చయిందో, ఇంకా ఎంత మిగిలి ఉందో తెలియక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కార్మికులకు ఈ స్కీం కింద చేరాలంటే రూ.60 వేలు ముందుగా చెల్లించాలి. గతంలో ఈ మొత్తం రూ.40 వేలుగా మాత్రమే ఉండేది. ఈ మొత్తాన్ని సర్వీసులో ఉండగానే రికవరీ చేస్తారు. ఈ స్కీం రాక ముందు రిటైర్డ్ అయిన వారు తర్వాత డబ్బులు చెల్లిస్తే వారికి కూడా కార్డులు అందించారు. ఈ కార్డు కింద రిటైర్డ్ కార్మికునికి, ఆయన భార్యకు కలిపి రూ.8 లక్షల వైద్యం చేయించుకోవచ్చు. ఈ మొత్తం ఖర్చయితే ఇక అంతే. మళ్లీ రూ.60 వేలు చెల్లిస్తామన్నా కూడా కార్డు ఇవ్వరు. వన్‌టైం కిందే కార్డు ఇస్తారు. సింగరేణి పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ ఆసుపత్రులు, కరీంనగర్, వరంగల్, ఖమ్మంతోపాటు హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్ ఆసుపత్రులతో కంపెనీ ఈ కార్డుతో చికిత్స అందించేలా అనుసంధానం చేసుకుంది. ఆ ఆసుపత్రులకు కార్డు పట్టుకుని రిటైర్డ్ కార్మికుడు వెళ్తే క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ అందుతుంది. భార్యాభర్తలిద్దరికి కలిపి రూ.8 లక్షల విలువ గల చికిత్స
పొందవచ్చు.
బ్యాలెన్స్ వివరాలు లేవు..
రిటైర్డ్ కార్మికుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు ముందుగా అతను అక్కడ కార్డు చూపించి అడ్మిట్ అవుతారు. దాని ప్రకారం ట్రీట్‌మెంట్ చేయడానికి ముందు సదరు ఆసుపత్రి యాజమాన్యం కంపెనీ సీఎంఓకు వైద్య ఖర్చుల బిల్లులను ఎస్టిమేట్ చేసి పంపుతారు. అక్కడి నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాతే ట్రీట్‌మెంట్ మొదలవుతుంది. ఐతే ట్రీట్‌మెంట్ జరిగిన తర్వాత సదరు రిటైర్డ్ ఉద్యోగికి తన కార్డులో ఎంత మొత్తం ట్రీట్‌మెంట్ కింద కట్ అయిందో తెలియడం లేదు. కంపెనీ వారు చెప్పడం లేదు. ఆసుపత్రి వారు చెప్పే అంచనే తప్ప, డిశ్చార్చి అయిన తర్వాత తన వైద్యానికి ఆసుపత్రుల్లో కార్డు నుంచి ఎంత మొత్తం కట్ అయిందో తెలియక వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఏ కార్యాలయం వద్దకు వెళ్లి అడిగిన కూడా వివరాలు ఇవ్వడం లేదు. మళ్లీ ఏదైనా జబ్బు పడ్డప్పుడు దానికి సరిపడా డబ్బులు కార్డులో ఉన్నాయా లేవో అని గందరగోళపడుతున్నారు.
ఖర్చు, మిగులు ఎంతో తెలియదు
లెక్క చెప్పాలంటున్న రిటైర్డ్ కార్మికులు
ఆసుపత్రుల వద్ద ఇబ్బందులు
ఎస్‌ఎంఎస్ అలర్ట్ పెట్టాలి
రిటైర్డ్ కార్మికుడు ఆసుపత్రిలో డిశార్చి అయిన వెంటనే అతని సెల్‌ఫోన్‌కు ఎంత మొత్తం కార్డు నుంచి వైద్యానికి కట్ అయిందో వారి ఫోన్‌కు మెసేజ్ వచ్చేలా యజమాన్యం ఏర్పాటు చేయాలి. కనీసం జీఎం కార్యాలయానికి వెళ్లి అడిగిన అక్కడ వివరాలు చెప్పేలా ఏర్పాటు చేయాలి. ఇవేవి లేకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
– నాతాడి శ్రీధర్‌రెడ్డి, బీఎంఎస్ ఎస్సార్పీ బ్రాంచి ఉపాధ్యక్షుడు