
సందర్భం
జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చాలామందిని ఆశ్చర్యపరిచింది. కులగణన నిర్వహించా లన్న ప్రతిపక్షాల డిమాండ్‌కు కేంద్రం తలొ గ్గిందని కూడా కొందరు సామాజిక రాజకీయ వేత్తలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఏమైనా కులగణన ప్రకటన చరిత్రాత్మక రాజకీయ ప్రకటన అని భావించవచ్చు.
అంబేడ్కర్, రామ్ మనోహర్ లోహియా భారతదేశంలో కుల గణన జరగాలని ఎంతో పోరాడారు. నిజానికి బీసీల కులగణన లేక పోవటం వల్ల బహుజనుల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో న్యాయం జరగలేదు. ఓబీసీల జీవన వ్యవస్థ ఆర్థిక సరళీకరణ, ప్రపంచీకరణ, పాశ్చాత్యీకరణ వలన విధ్వంసం అవుతూ... వారు జీవించే హక్కులు మృగ్యమవుతున్న తరుణంలో ఈ ప్రకటన రావడం ముదావహం.
మారిన పార్టీల అవగాహన
ఈ ప్రకటన తర్వాత దేశంలోని రాజకీయ, సామాజిక విశ్లేషకు లకు అనేక ప్రశ్నలు ముందుకొచ్చాయి. ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్ కులగణన ప్రస్తావన వచ్చినప్పుడల్లా వ్యతిరేకించాయి. ఇప్పుడు వాళ్లు మనస్ఫూర్తిగా అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి. బిహార్, బెంగాల్, తమిళనాడుల్లో జరగబోయే ఎన్నికల కోసం ఈ ప్రకటన జరిగిందా అనే మరో ప్రశ్న అందరి ముందుకు వచ్చింది. సాక్షాత్తూ పార్లమెంటులోనే బీజేపీ ఎంపీలు కులగణనను వ్యతిరేకిస్తూ మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
భారతదేశ పాలకవర్గం... బ్రాహ్మణ, బనియా, భూస్వామ్య కూటమిగా ఉందనేది స్పష్టం. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో అంబేడ్కర్, లోహియా, పెరియార్ రామస్వామి చెబుతూనే వచ్చారు. ‘లండన్ హౌజ్ ఆఫ్ కామన్స్’లో అంబేడ్కర్ శత జయంతి సందర్భంగా... భారత మాజీ ప్రధానమంత్రి వీపీ సింగ్ నాతో మాట్లా డుతూ బీసీల రాజకీయ, సామాజిక సంస్కరణల విషయంలో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వ్యతిరేకంగా వ్యవహరించార ని అన్నారు.
మండల్ కమిషన్ రిపోర్టును ఇందిరాగాంధీ అమలు జరపలేదు. దీనికోసం వీపీ సింగ్ చొరవ చూపారనేది సత్యం. ఈ విషయాలను వీపీ సింగ్, శరద్ యాదవ్, రామ్‌విలాస్ పాశ్వాన్ అనేక సందర్భాల్లో, ముఖ్యంగా చుండూరు పోరాటం సందర్భంలో నాతో చర్చించడం జరిగింది. బీజేపీ అధికారంలోకి రాక ముందున్న తన ప్రవర్తనను కాంగ్రెస్... బీజేపీ అధికారంలోకి వచ్చాక మార్చుకున్నట్లు అర్థమవుతోంది. నెహ్రూ, ఇందిరాగాంధీ కంటే కూడా సామాజిక, రాజకీయ విషయాల్లోనూ; దళిత బహుజన దృక్పథంలోనూ రాహుల్ గాంధీ అవగాహన భిన్నంగా ఉంది. ఆయనపై సబాల్ట్రన్ స్టడీస్ ప్రభావం కనిపిస్తుంది.
తమిళనాడు ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో ఒక అడుగు ముందుకు వేసి 50 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలు చేసేందుకు పూనుకున్నప్పుడు, వీపీ సింగ్ ప్రభుత్వ మండల్ నివేదికలను అమలు జరపడానికి పూనుకున్నప్పుడు రిజర్వే షన్లకు వ్యతిరేకంగా పోరాటం నడిపినవారు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ వారేనన్నది స్పష్టమే.
కుల నిర్మాణ చట్రం
ఒక రాజకీయ పథకంపై ఓ తీర్పు ఇవ్వడానికి ముందు దానికి సంబంధించిన ప్రాథమిక ప్రణాళికను పరిశీలించడం తప్పనిసరి. ‘ప్రాథమిక ప్రణాళిక’ అంటే ఏ సమాజానికైతే రాజకీయ పథకాన్ని వర్తింపజేయాలని అనుకుంటున్నారో, ఆ సమాజపు నిర్మాణమే ప్రాథ మిక ప్రణాళిక అని చెప్పవచ్చు. సామాజిక నిర్మాణంపై రాజకీయ నిర్మాణం ఆధారపడి ఉందని చెప్పడానికి ఎటువంటి సమర్థనా అవసరం లేదు. వాస్తవానికి రాజకీయ నిర్మాణంపై సామాజిక నిర్మాణం ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. రాజకీయ నిర్మాణం పని చేసే తీరును అది మార్చవచ్చు, నిరర్థకం చేయవచ్చు లేదా అపహాస్యం పాలు కూడా చేయవచ్చు.
భారతదేశ విషయంలో సామాజిక నిర్మాణం అనేది కుల వ్యవస్థపై నిర్మితమై ఉంది. కుల స్వభావం గురించి ఎవరికీ వివరించాల్సిన అవసరం లేదు. కానీ కులవ్యవస్థకు ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాలను గుర్తించి తీరాలి. కులాలు ఎలా పంపిణీ అయ్యాయి అంటే... ప్రతి ప్రాంతంలోనూ ఒక ప్రధాన కులమూ, కొన్ని చిన్న కులాలూ ఉన్నాయి. జనాభా రీత్యా ప్రధాన కులంతో పోల్చినప్పుడు చిన్నవి కావడం వల్లనూ, గ్రామంలో ఉన్న భూమిలో ఎక్కువ భాగం సొంతం చేసుకున్నటువంటి ప్రధాన కులంపై ఆర్థికంగా ఆధారపడి ఉండటం వల్లనూ... ఈ చిన్న కులాలు ప్రధాన కులానికి లోబడి ఉండేవిగా ఉన్నాయి.
కేవలం అసమానతే కులవ్యవస్థ ప్రత్యేకత కాదు. క్రమబద్ధంగా శ్రేణీకరించిన అసమానతతో అది ప్రభావితమై ఉంది. కులాలు ఒకదానిపై మరొకటి ఉంటాయి. అదొక రకమైన ఆరోహణా క్రమపు ద్వేషమూ, అవరోహణా క్రమపు ఏవగింపూ కలిగి ఉన్నాయి. కులమనేది సామాజిక, సాంస్కృతిక, తాత్త్విక జీవన వ్యవస్థల నుండి ఆ యా కాలాలలో పరిణామం చెందుతూ వచ్చి కుల నిర్మూలనా దశకు చేరుకుంటుందని అంబేడ్కర్ భావించారు. అందుకే ఆయన కులనిర్మూలనా ప్రణాళికను రూపొందించారు. కులనిర్మూలనా సంస్కృతి కార్యక్రమ ప్రతిపాదనలు చేశారు.
ఈ నేపథ్యంలో దేశంలో కుల గణనే కాక, కుల ఆర్థిక గణన కూడా చేయగలిగితే... భారతదేశ సామాజిక, ఆర్థికపరమైన నిజ స్వరూపం బయటకు వస్తుంది. అప్పుడే ఏ కులానికి ఎంత సంపద ఉందన్నది బయటకు వస్తుంది. మొత్తం మీద నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన భారతదేశంలో తప్పక గుణాత్మకమైన మార్పు వస్తుందనీ; బీసీలు, దళితులలో... ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యం పెరుగుతుందనీ ఆశించాల్సిన చారి త్రక సందర్భం ఇది. సానుకూల దృక్పథమే భారతదేశ భవితవ్యానికీ, దళిత బహుజన రాజకీయ విప్లవానికీ దోహదం చేస్తుందన్నది వాస్తవం.
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695