
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.18 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో బుధవారం జరిగింది. ఈ లెక్కింపులో శ్రీవారికి విశేష ఆదాయం సమకూరింది. గత 31 రోజులకు నగదు రూపేణా స్వామికి రూ.2,18,84,539 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యన్నారాయణ మూర్తి తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 120 గ్రాముల బంగారం, 4.079 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2000, రూ.500 నోట్ల ద్వారా రూ. 12 వేలు లభించినట్టు చెప్పారు.
జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన మురళీకృష్ణంరాజు
భీమవరం: వైఎస్సార్‌సీపీ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో బుధవారం సమీక్షా సమావేశంలో నరసాపురం పార్లమెంటు పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు పాల్గొన్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నరసాపురం పార్లమెంటుకు సంబంధించి పలు అంశాలపై చర్చించి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
పెరుగుతున్న గోదావరి వరద
పోలవరం రూరల్: గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలో నీరు కలవడంతో వరద ప్రవాహం కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 30.400 మీటర్లకు నీటి మట్టంచేరుకుంది. స్పిల్‌వే నుంచి 5.50 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. ఎగువన భద్రాచలం వద్ద కూడా క్రమేపీ వరద పెరుగుతూ 34.80 అడుగులకు నీటిమట్టం చేరుకుంది.
ఉప్పొంగిన ఎర్రకాలువ
కొయ్యలగూడెం: ఎర్రకాలువ గేట్లు ఎత్తడంతో కొయ్యలగూడెం మండలం మంగపతిదేవిపాలెం జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామాల మధ్య బుధవారం రాకపోకలు స్తంభించాయి. ఏజెన్సీలోని ఎగువ కురిసిన భారీ వర్షాలతో ఎర్రకాలువ జలాశయం నిండింది. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు కరాటం కృష్ణమూర్తి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఎర్రకాలువ ఉధృతి కొనసాగింది. రెండు మండలాల మధ్య ఉన్న కల్వర్టుకి ఇరువైపులా రెవెన్యూ సిబ్బందిని గస్తీకి నియమించారు.
‘నారాయణ’కు కొమ్ముకాస్తున్న డీఈవో
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా విద్యాశాఖాధికారి నారాయణ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు విమర్శించారు. దసరా సెలవుల్లో నారాయణ జూనియర్ కాలేజీలో హైస్కూల్ నడుపుతుంటే ఎస్‌ఎఫ్‌ఐ వెళ్ళి విద్యార్థులను ఇంటికి పంపించిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లెనిన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల్ని ధిక్కరిస్తూ నారాయణ విద్యాసంస్థలు నడపటం దుర్మార్గమని, బుధవారం జూనియర్ కళాశాలలో 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులను గదుల్లో బంధించి స్కూల్ నడపడం దుర్మార్గమన్నారు. 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు కాగా నారాయణ స్కూల్ ఇప్పటి వరకు సెలవులు ఇచ్చింది లేదన్నారు.

జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన మురళీకృష్ణంరాజు

ఉప్పొంగిన ఎర్రకాలువ