
మధ్యాహ్న భోజనం బిల్లులు చెల్లించండి
భీమవరం: మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు, జీతాలు వెంటనే విడుదల చేయాలని, పనికి తగ్గ జీతాలు ఇవ్వాలని మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్.నాగమణి డిమాండ్ చేశారు. బుధవారం సీఐటీయూ ఆఫీసులో ఎండీ మదీనా అధ్యక్షతన జరిగిన జిల్లా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత 23 సంవత్సరాల నుండి పనిచేస్తున్నా కేవలం రూ.3000 ఇస్తున్నారని అది కూడా గత పది సంవత్సరాల నుంచి పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదు సంవత్సరాల నుండి మధ్యాహ్నం భోజనంలో అనేక మార్పులు చేశారని వంట పెరిగిందని, ఖర్చులు పెరిగినయని ఖర్చులకు తగ్గట్టు బిల్లులు పెంచలేదని బిల్లులు కూడా నాలుగైదు నెలల పాటు పెండింగ్ పెట్టడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ఐక్యంగా ఆందోళన చేయాలన్నారు. స్థానిక పెద్దల ఒత్తిడితో అనేక ఇబ్బందులతో మధ్యాహ్న భోజన కార్మికులు పని చేస్తున్నారని వారి సమస్యల పట్ల, చిరు ఉద్యోగులపై అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించాలని తోడ్పాటు ఇవ్వాలని కోరారు. సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు బి.వాసుదేవరావు తదితరులు మాట్లాడారు. అనంతరం ఎండీ మదీనా అధ్యక్షులుగా ఎన్.నాగమణి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అక్టోబర్ 6న జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాలని సమావేశం తీర్మానించింది.