
ముందుకు సాగట్లే..
మరుగునపడ్డ వైకుంఠధామాల నిర్మాణాలు
● బిల్లులు అందక నిలిచిన పనులు
● కొత్త మున్సిపాలిటీల్లో కనిపించని పురోగతి
● ఒక్కో వైకుంఠధామం నిర్మాణానికి రూ.కోటి
●
పట్టణంలో నిర్మిస్తున్న వైకుంఠధామ నిర్మాణ పనులు గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమయ్యాయి. అమరచింతలో 70 శాతం పనులు పూర్తి చేశారు. స్నానాల గదులు, వెయిటింగ్ గది, పార్కింగ్ పనులు జరగాల్సి ఉంది. బిల్లులు చెల్లించలేదని పనులను కాంట్రాక్టర్ నిలిపివేశాడని తెలిసింది. విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించడం జరిగింది.
– నాగరాజు,
మున్సిపల్ కమిషనర్, అమరచింత
అమరచింత: గత ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో అధునాతన హంగులతో నూతన వైకుంఠధామాలను నిర్మించడానికి నిధులు మంజూరు చేసింది. ఒక్కో వైకుంఠధామం కోసం రూ.కోటి కేటాయించారు. టెండర్ ప్రక్రియను చేపట్టి కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించింది. కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించినా.. సరైన సమయానికి బిల్లులు అందకపోవడంతో నిర్మాణ పనులు నిలిపివేశారు. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో నిర్మాణ పనులు 65 నుంచి 70 శాతం వరకు పూర్తి కాగా.. మిగిలిన పనులు అటకెక్కాయి. వీటికి తోడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో నిర్మాణ పనులు పూర్తిగా మరుగునపడినట్టయింది. పెద్ద పట్టణాల్లో స్థలం లేకపోవడంతో భవిష్యత్‌లో మృతదేహాల ఖననానికి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు వేగంగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
సౌకర్యాలు..
కొత్తగా నిర్మించే వైకుంఠధామాల్లో మృతదేహాలను ఖననం చేసేందుకు వచ్చిన వారికి సౌకర్యాలను కల్పించేందుకు ప్రణాళికతో పనులు చేస్తున్నారు. వీటిలో వెయిటింగ్ గదులు, సెక్యూరిటీ గది, ఆఫీస్ రూంతో పాటు సీటింగ్ గ్యాలరీ ఏర్పాటు చేస్తారు. రెండు బర్నింగ్ ప్లాంట్లు, పూజా మండపం, టాయిలెట్లు, స్నానపు గదులను సిద్ధం చేయాలి. అంతే కాకుండా ఆహ్లాదం కోసం పచ్చదనం, వైకుంఠధామం మధ్యలో పార్కును ఏర్పాటు చేస్తారు. వీటి చుట్టు ప్రహరీ లేదా పెన్సింగ్‌ను కల్పించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ప్రభుత్వం సంకల్పించింది.
జిల్లాలో ఇలా..
జిల్లాలోని అమరచింత, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూర్ మున్సిపాలిటీల్లో రెండేళ్ల కిందట వైకుంఠధామ నిర్మాణాలకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కానీ ఆలస్యంగా పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లు బిల్లులు రాలేదన్న నెపంతో పూర్తిగా నిలిపివేశారు. కొత్తకోట, అమరచింత, ఆత్మకూర్ పట్టణాల్లో 75 శాతం నిర్మాణ పనులు జరిగాయని, పెబ్బేరులో మాత్రం 30 శాతం సైతం పనులు జరగలేదని సంబంధిత అధికారులు తెలిపారు. కాని వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో యాభై శాతం పనులు మాత్రమే జరిగాయని తెలుస్తోంది.

ముందుకు సాగట్లే..

ముందుకు సాగట్లే..

ముందుకు సాగట్లే..