
సందడిగా దుర్గమ్మ నిమజ్జనోత్సవం
రాయగడ: స్థానిక పోలీస్ కాలనీలో అష్టమి నుంచి విజయదశమి వరకు కొనసాగిన దుర్గా అమ్మవారి పూజలు ముగిశాయి. శుక్రవారం రాత్రి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి సదరు సమితి సమీపంలోని హలువ ప్రాంతంలో ఉన్న నాగావళి నదిలో నిమజ్జనం చేసారు. కార్యక్రమంలొ పోలీసు సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు.
ఓపీఆర్‌బీ అత్యవసర సమావేశం
భువనేశ్వర్: ఒడిశా పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ సుశాంత్ కుమార్ నాథ్ అధ్యక్షతన శనివారం అత్యవసర సమావేశం జరిగింది. రాష్ట్ర పోలీసు సబ్ ఇన్‌స్పెక్టరు రాత పరీక్ష మోసాల సంఘటన నేపథ్యంలో ఈ సమావేశం కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశం వివరాలు స్పష్టం కాకున్నా ఈ సంఘటనపై ఒక కేసు నమోదు చేశారు. రాష్ట్ర క్రైం శాఖ దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు నివేదిక అందిన తర్వాత బోర్డు తదుపరి చర్యలను ప్రకటిస్తుంది. ఔత్సాహిక అభ్యర్థులు రాత పరీక్ష సన్నాహాల్లో నిమగ్నం కావాలని ఓపీఆర్‌బీ అధ్యక్షుడు సుశాంత్ కుమార్ నాథ్ తెలిపారు.
డీజీపీ అభినందనలు
భువనేశ్వర్: శుక్రవారం కటక్‌లో జరిగిన ప్రసిద్ధ దుర్గా పూజ అనుపు ఊరేగింపులో గాయపడిన కటక్ నగర డీసీపీ ఖిలారి రిషికేశ్‌ను రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా ప్రత్యక్షంగా కలిసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఊరేగింపు శాంతియుతంగా జరిగేలా చూడటంలో డీసీపీ అంకితభావాన్ని డీజీపీ అభినందించారు.
రత్నప్రభకు దర్యాప్తు బాధ్యత
● ఎస్ పోస్టుల కుంభకోణం
భువనేశ్వర్: సబ్ ఇన్‌స్పెక్టర్ రాత పరీక్ష మోసం సంఘటనపై క్రైమ్ శాఖ డీఎస్పీ రత్నప్రభ శతపతికి దర్యాప్తు బాధ్యత అప్పగించారు. గంజాం జిల్లా గొలంతరా పోలీస్ ఠాణాలో నమోదైన అన్ని కేసులను ఆమె దర్యాప్తు చేస్తారు. క్రైమ్ శాఖ పోలీసు సూపరింటెండెంట్ అనిల్ బెవురియా పర్యవేక్షణ అధికారిగా వ్యవహరిస్తారు. పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ మోసం సంఘటనలో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన 2 దళారులను కోర్టులో ప్రవేశపెట్టారు. క్రైమ్ శాఖ డిజిటల్ సమాచారం సేకరించడంలో నిమగ్నమై ఉంది. పంచ్‌సాఫ్ట్ కంపెనీ యజమాని శంకర్ పృష్టి ఈ మోసం వెనుక ప్రధాన సూత్రధారిగా సందేహిస్తున్నారు. గతంలో, 114 మంది అభ్యర్థులు, ముగ్గురు దళారులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
నాగావళిలో యువకుడి మృతి
రాయగడ: నాగావళిలో స్నానానికి దిగి ఒక యువకుడు మృతి చెందిన ఘటన సదరు సమితి పరిధి కొత్తపేట గ్రామంలో చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న చందిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొత్తపేటలోని రెల్లివీధికి చెందిన సింహాద్రి మినియాక (14) అనే యువకుడు శుక్రవారం సాయంత్రం స్నానానికని సమీపంలోని నాగావళి నదిలో దిగాడు. అయితే నదీ ప్రవాహం ఎక్కువ కావడంతో కొట్టుకుపోయాడు. హతీపర్ వద్ద అతని మృతదేహం బయటపడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సందడిగా దుర్గమ్మ నిమజ్జనోత్సవం

సందడిగా దుర్గమ్మ నిమజ్జనోత్సవం

సందడిగా దుర్గమ్మ నిమజ్జనోత్సవం