
చినుకు.. వణుకు
పర్లాకిమిడి: భారీ వర్షాలకు గజపతి జిల్లా చివురుటాకులా వణికింది. బుధవారం, గురువారం కురిసిన భారీ వర్షాలకు రాయగఢ, మోహన, నువాగడ, మహేంద్రగడ, గుమ్మలో కొండ చరియలు విరిగిపడటంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. జిల్లాలో విజయ దశమి నాడు కురిసిన వర్షం తిత్లీ తుఫాను మరపించింది. రాయఘడ బ్లాక్ పెక్కట గ్రామం మౌలసాయి వద్ద కొండ చరియలు విరిగిపడటంతో పొలానికి వెళ్లి తిరిగి వస్తున్న తండ్రీకొడుకులు రజికా శోబోరో (35), తండ్రి కార్తీక్ శోబోరో (65) కొట్టుకుపోయారు. వారి మృతదేహాలు ఇంతవరకూ దొరకలేదు. ఆర్.ఉదయగిరి బ్లాక్‌లో బస్త్రిగుడ వద్ద కొండ చరియలు విరిగి పడటంతో త్రినాథ నాయక్ (50) మృతి చెందారు. ఆర్.ఉదయగిరి బదిశల ఘాట్ వద్ద గురువారం కురిసిన భారీ వర్షాలకు జాతీయ రహదారి 326ఎ ధ్వంసమైంది. మోహన బ్లాక్‌లో నడిబోందో నల్లా ఉప్పొంగడంతో జాతీయ రహదారి (326ఎ) పాత వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. అటు రాయగడ, మోహన, పర్లాకిమిడికి వెళ్లే వాహనాలు బంద్ అయ్యాయి. మోహనలో ఎడతెరిపి వర్షాలకు బందగుడ గ్రామానికి చెందిన లక్షణ్ నాయక్ (40) లుడ్రునల్లాలో కొట్టుకుపోయాడు. ఆయన మృతదేహాన్ని శుక్రవారం ఓడ్రాఫ్ సిబ్బంది బయటకు తీసినట్టు ఎస్పీ జె.ఎన్.పండా తెలియజేశారు. రాయఘడ బ్లాక్ మహేంద్రగడ–బురుఖాత్ పాస్ వద్ద కొండచరియలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడటంతో గత రాత్రి మహేంద్రగిరికి వెళ్లిన టూరిస్టులు 22 మంది చిక్కుకున్నారు. గురువారం రాత్రి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బిభూతీ జెన్నా ముఖ్యమంత్రి మోహాన్ మఝి ఆదేశాల మేరకు బురుఖాత్ పాస్‌కు హుటాహుటిన చేరుకుని జేసీబీలతో రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న బండరాళ్లను పక్కకు తీసి రోడ్డు క్లియర్ చేశారు. దీంతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన టూరిస్టులు మహేంద్రం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. గుమ్మబ్లాక్ సెరంగో, అజయగడ వద్ద కొండచరియలు విరిగి పడటంతో రోడ్డు బ్లాక్ అయ్యింది. అలాగే ఖోజురిపద నుండి నువాగడ బ్లాక్ రోడ్డులో అశురపహాడ్ నల్లా ఉద్ధృతంగా ప్రవహించడంతో అక్కడ నిర్మాణంలో ఉన్న వంతెన కొట్టుకుపోయింది. అఽతివృష్టి కారణంగా నువాగడ శివాలయం వద్ద నువాగడ– గుణుపురం రోడ్డు కూడా కొట్టుకుపోయింది. అధిక వర్షాల వల్ల రోడ్లు, భవనాల శాఖకు వందల కోట్ల నష్టం వాటిల్లగా, గ్రామీణ రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో నష్టం రూ.కోట్లలో వాటిల్లినట్లు రాష్ట్ర రవాణా శాఖా మంత్రి బిభూతీ జెన్నా విలేకరులతో తెలిపారు.

చినుకు.. వణుకు

చినుకు.. వణుకు

చినుకు.. వణుకు

చినుకు.. వణుకు