
అర్జీదారులకు సంతృప్తికర పరిష్కారం
అధికారులకు కలెక్టర్ లక్ష్మీశ ఆదేశం జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌కు 182 అర్జీలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదికకు (పీజీఆర్‌ఎస్) వచ్చిన అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులతో కలసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీదారులతో సంబంధిత అధికారి మర్యాదగా ప్రవర్తించాలని, ఎండార్స్‌మెంట్ తప్పకుండా ఇవ్వాలని చెప్పారు. వ్యవహార శైలి, పరిష్కార విధానం సరిగా లేవన్న అభిప్రాయం అర్జీదారుల నుంచి ఎట్టి పరిస్థితిలోనూ రాకూడదని స్పష్టం చేశారు. రీ ఓపెన్ చేసిన ఫిర్యాదులపై ప్రత్యేకంగా దృష్టి సారించి, త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు. రెవెన్యూ అంశాలకు సంబంధించిన అర్జీల పరిష్కారంలో సంతృప్తి స్థాయిని పెంచాలన్నారు.
జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌కు 182 అర్జీలు:
జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో మొత్తం 182 అర్జీలు అందాయి. వీటిలో రెవెన్యూ విభాగంలో అత్యధికంగా 53, పోలీస్ 36, పురపాలక, పట్టణాభివృద్ధి 24, పంచాయతీరాజ్ 14, రవాణా 10, డీఆర్‌డీఏ 9, ఆరోగ్యశాఖ 6, పౌరసరఫరాలు, విభిన్న ప్రతిభావంతులు, దేవదాయ, విద్యాశాఖ, బ్యాంకు లకు సంబంధించిన అర్జీలు మూడు చొప్పున, ఎకై ్సజ్, మార్కెటింగ్, సర్వే శాఖలకు సంబంధించిన అర్జీలు రెండు చొప్పున, గనులు, భూగర్భ శాఖ, నీటిపారుదల, గృహ నిర్మాణం, గ్రామీణ నీటిసరఫరా, కార్మిక, ఉపాధి కల్పన, రిజిస్ట్రేషన్ – స్టాంపులు, నైపుణ్యాభివృద్ధి, డ్వామా శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ అందాయి. ఈ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
ప్రధాన అర్జీలు...
●రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం కొనసాగించాలని ఇంగ్లిష్ మీడియం విద్యా పరిరక్షణ వేదిక రాష్ట్ర సమన్వయకర్త ఏడుకొండలు షెపర్డ్ కలెక్టర్‌ను కలిసి అర్జీ సమర్పించారు. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్‌ఈ, టోఫెల్ కోర్సులను ప్రభుత్వ విద్యాలయాల్లో నెలకొల్పాలన్నారు. వేదిక సభ్యులు మహమ్మద్ నూరు, ఈదర గోపీచంద్ తదితరులు ఉన్నారు.
●డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు గత 9 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, జీవనం దుర్భరంగా ఉందని, తమకు జీతాలు ఇప్పించాలని కాంట్రాక్ట్ కార్మికులు అర్జీ సమర్పించారు.