
ఆలస్యంతో అర్హత!
గత పంచాయతీ ఎన్నికల్లో లెక్కలు సమర్పించని 1058 మంది వారందరిపైనా అనర్హత వేటేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం 2024 ఏప్రిల్ తో ముగిసిన నిషేధం కాలపరిమితి స్థానిక ఎన్నికల ఆలస్యంతో పోటీకి దక్కిన అవకాశం
నిర్మల్‌చైన్‌గేట్: ‘ఆలస్యం అమృతం విషం‘ అంటారు పెద్దలు.. చేయవలసిన పనిని సరైన సమయంలో చేయకపోతే, అది అనర్థాలకు దారితీస్తుంది. మంచి ప్రయోజనాలు సైతం చెడుగా మారతాయి. కానీ, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం చేసిన ఆలస్యం.. గత ఎన్నికల్లో ఎన్నికల ఖర్చు వివరాలు వెల్లడించక అనర్హతకు గురైనవారికి అమృతంగా మారింది. ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడంతో అనర్హత వేటు పడిన అభ్యర్థులు పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది.
ఎన్నికల ఖర్చు వివరాలు ఇవ్వక..
2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసిన కొందరు నిర్దేశిత గడువులోగా ఖర్చుల వివరాలు సమర్పించలేదు. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం వారిపై మూడేళ్లు నిషేధం విధించింది. ఎన్నికల నిర్వహణలో జాప్యం కారణంగా ఆ కాలపరిమితి ముగిసింది. దీంతో వారు మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారు. మరోమారు ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సన్నద్ధమవుతున్నారు.
మూడు దశల్లో ఎన్నికలు..
2019 జనవరిలో జిల్లాలో 396 గ్రామ పంచా యతీలకు 3,368 వార్డులకు మూడు దశలుగా ఎన్నికలు నిర్వహించారు. పాలకవర్గాల పదవీ కాలం 2024 ఫిబ్రవరి 1న ముగిసింది. వెంట నే లోక్‌సభ ఎన్నికలు రావడంతో ప్రభుత్వం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యే క అధికారులను నియమించింది. ఎంపీటీసీ, జె డ్పీటీసీ సభ్యుల పదవీకాలం కూడా 2024 ఆగ స్టు మొదటి వారంలో ముగిసింది. పరిషత్‌లో నూ స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే జిల్లాలో అనర్హతకు గురైనవారు పోటీకి దూరమయ్యేవారు.
1,058 మందిపై వేటు
జిల్లాలో మొత్తం 1,058 మందిపై ఈసీ మూడేళ్ల అనర్హత వేటు వేసింది. వీరు 2024 ఏప్రిల్ వరకు ఏ ఎన్నికల్లోనూ పాల్గొనకుండా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఆలస్యం కావడంతో నిషేధ కాలం ముగిసింది. తాజాగా ఎన్నికల సంఘం ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని షెడ్యూల్ ప్రకటించింది. దీంతో నిషేధం ముగిసినవారు పోటీకి సిద్ధమవుతున్నారు.
లెక్కలు చూపాల్సిందే..
నూతన పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం 2019 జనవరిలో 396 గ్రామ పంచాయతీలకు, మేలో 157 ఎంపీటీసీలు, 18 జెడ్పీటీసీ పదవులకు ఎన్నికలు జరిగాయి. పోటీ చేసిన అభ్యర్థులు ఫలితాలు వెలువడిన 45 రోజుల్లోగా ప్రచార ఖర్చుల లెక్కలు నిర్దేశిత ఫార్మాట్‌లో ఎంపీడీవో కార్యాలయాల్లో సమర్పించాలి. 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో వార్డు సభ్యులు రూ.30 వేల వరకు, సర్పంచ్ అభ్యర్థులు రూ.1.5 లక్షల వరకు ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. 5 వేలకు మించిన జనాభా ఉన్న గ్రామాల్లో వార్డు సభ్యులు రూ.50 వేలు, సర్పంచ్ అభ్యర్థులు రూ.2.5 లక్షల వరకు ప్రచారానికి వెచ్చించే వెసులుబాటు కల్పించారు. గెలిచినా, ఓడినా పోటీ చేసినవారంతా ఖర్చుల వివరాలు వెల్లడించాలి. కొందరు వార్డు సభ్యులు విజ యం సాధించినా నిర్లక్ష్యంతో సమర్పించలే దు. ఓడిపోయిన మరికొందరు నిబంధనల ను ఉల్లంఘించారు. ఈసీ పలుసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. దీంతో ఎంపీడీవోల నివేదికల ఆధారంగా 2021 నవంబర్‌లో అనర్హత ఉత్తర్వులు జారీ చేసింది.
సర్పంచులు 125
వార్డు సభ్యులు 870
ఎంపీటీసీలు 59
జెడ్పీటీసీలు 4