అమృత్‌పాల్‌ కేసులో ఊహించని ట్విస్ట్‌.. ఆమె అరెస్ట్‌

Haryana Woman Arrested For Sheltering To Amritpal Singh - Sakshi

పంజాబ్‌లో ఖలిస్తాన్‌ వేర్పాటువేది అమృత్‌పాల్‌ సింగ్‌ వేషాలు మార్చుకుంటూ పోలీసులకు చిక్కకుండా ఆరు రోజులుగా తప్పించుకు తిరుగుతున్నాడు. వాహనాలు మార్చుకుంటూ చివరకు పంజాబ్‌ దాటి హర్యానాలోకి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఇదే క్రమంలో అమృత్‌పాల్‌కు హర్యానాలో ఆశ్రయం ఇచ్చిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

వివరాల ప్రకారం.. ఖలిస్తానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌కు అతడి సహచరుడు పపల్‌ ప్రీత్‌సింగ్‌కు హర్యానాలో బల్జీత్‌ కౌర్‌ అనే మహిళ ఆశ్రయం ఇచ్చింది. ఆమె హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలో తన ఇంట్లో వీరికి ఆశ్రయం కల్పించినట్టు పోలీసులు గుర్తించారు. వారిద్దరూ ఆదివారం అక్కడే బసచేసి మరుసటి రోజు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్ట్‌ చేశారు. ఆమెను పంజాబ్ పోలీసులకు అప్పగించినట్లు హర్యానాలోని కురుక్షేత్ర పోలీసు సూపరింటెండెంట్ సురీందర్ సింగ్ భోరియా తెలిపారు. 

ఇదిలా ఉండగా.. అమృత్‌పాల్‌ సింగ్‌ వేషాలు మార్చకుంటూ పారిపోతున్నాడు. ఇప్పటికే పోలీసులు.. అమృత్‌పాల్‌ మార్చిన వేషాలతో ఫొటోలను రిలీజ్‌ చేశారు. అంతేకాకుండా టోల్‌ప్లాజా దాటడం, కారు నుంచి బైక్‌ ఎక్కి పారిపోతున్న వీడియోలను కూడా బయటపెట్టారు. తాజాగా అమృత్‌పాల్‌ తన ఫేస్‌ కనిపించకుండా గొడుగు అడ్డం పెట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. 

అంతకుముందు.. మొదటి రోజు 50కి పైగా వాహనాల్లో అమృత్‌పాల్‌ను పోలీసులు వెంటాడినా చాకచక్యంగా తప్పించుకున్నాడు. మరోవైపు.. పంజాబ్ పోలీసులు గురువారం అమృత్‌పాల్ ప్రైవేట్ భద్రతా సిబ్బందిలో ఒకరైన తేజిందర్ సింగ్ గిల్‌ను అరెస్ట్ చేశారు. కాగా, తేజిందర్‌ సింగ్‌.. అజ్నాలా పోలీస్ స్టేషన్‌పై దాడిలో కీలక వ్యక్తిగా ఉన్నాడు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top