
కాంతార మూవీతో పాన్ ఇండియావ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిషబ్ శెట్టి. ఈ సినిమాకు ముందు పెద్దగా పరిచయం లేని ఆయన.. ఈ ఒక్క మూవీతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీక్వెల్గా కాంతార చాప్టర్-1 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య నటిస్తున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు. తాజాగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ను పంచుకున్నారు. ఈ మూవీలో కులశేఖర పాత్రలో మెప్పించనున్నారు. దాదాపు ఏడు భాషల్లో గుల్షన్ దేవయ్య పోస్టర్ రిలీజ్ చేశారు. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా గుల్షన్ దేవయ్య శాండల్వుడ్ అరంగేట్రం చేయనున్నారు.
ఈ చిత్రంలో మరో నటి రుక్మిణి వసంత్ కనకవతి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే ఆమె రోల్ రివీల్ చేస్తూ పోస్టర్ను విడుదల చేశారు. హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం అక్టోబర్ 2న కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.