
స్థానిక ఎన్నికల విధుల్లో టీచర్లు
● పరిషత్ పోరుకు 3,500 మంది ● పంచాయతీకి 3,800 మంది ● ఇప్పటికే రెండు విడతల్లో శిక్షణ పూర్తి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల విధుల్లో అత్యధికంగా ఉపాధ్యాయులు పనిచేయనున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఎంపిక చేసి వారికి ఎన్నికల నిర్వహణపై రెండు విడతల్లో శిక్షణ సైతం ఇచ్చారు. కాగా పరిషత్ పోరుకు 3,500 మంది, పంచాయతీ ఎన్నికలకు 3,800 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించనున్నారు. ఇందులో సీనియర్ ఉపాధ్యాయులు ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా, సూపర్‌వైజర్లుగా, ప్రిసైడింగ్, స్టేజ్–1, స్టేజ్– 2 అధికారులుగా పనిచేయనున్నారు. అలాగే డీఈఓ రాధాకిషన్‌తో పాటు మరో 11 మంది అధికారులు జిల్లా ఎన్నికల నోడల్ ఆఫీసర్లుగా నియమితులయ్యారు. వీరితో పాటు పంచాయతీ సెక్రటరీలకు పోలింగ్ కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కాగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మొదటి దశలో మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లోని 99 ఎంపీటీసీ, 10 జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 23న పోలింగ్ జరగనుంది. రెండో దశలో నర్సాపూర్ డివిజన్‌లోని 5 మండలాలు, తూప్రాన్ డివిజన్‌లోని 6 మండలాల పరిధిలో గల 11 జెడ్పీటీసీ, 91 ఎంపీటీసీ స్థానాలకు 27న పోలింగ్ నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికలు సైతం రెండు దశల్లో జరుగనున్నాయి. మొదటి దశలో మెదక్ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో 244 పంచాయతీ, 2124 వార్డులకు వచ్చే నెల 4న పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో విడతలో నర్సాపూర్, తూప్రాన్ డివిజన్‌లోని 11 మండలాల్లోని 248 పంచాయతీలకు, 2,096 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటికి నవంబర్ 8న పోలింగ్, అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు.