
వైభవంగా విజయదశమి
మహబూబాబాద్ రూరల్: జిల్లా వ్యాప్తంగా విజయదశమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని, జమ్మిచెట్లకు పూజలు చేసి తమను, తమ కుటుంబ సభ్యులను అనుగ్రహించాలని వేడుకున్నారు. శమీ మంత్రాన్ని జపించారు. జమ్మి ఆకులను తమవెంట తీసుకువెళ్లి ఇళ్లలో పెద్దలకు ఇచ్చి వారికి పాదాభివందనం చేసి ఆశీర్వచనాలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాలు, తండాల్లో కొలువుదీరిన దుర్గాదేవి అమ్మవార్ల సన్నిధుల్లో భక్తులు విజయదశమి పూజలు నిర్వహించారు. శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో నిర్వహించిన విజయ దశమి, శమీ పూజల్లో ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, డాక్టర్ భూక్య ఉమ దంపతులు, డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి పాల్గొని గుమ్మడి కాయ, సోరకాయ నరికి అమ్మవారి దర్శనం ప్రారంభించారు.
హన్మంతుని గడ్డలో వేడుకలు..
మహబూబాబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలో హన్మంతునిగడ్డ దసరా ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు హాజరయ్యారు. వేడుకల్లో పాల్గొన్న ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపి ఆలిగనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మురళీ నాయక్ మాట్లాడుతూ.. సమాజంలో చెడుపై మంచి విజయం సాధించినప్పుడే నిజమైన విజయదశమి పండుగ అని అన్నారు. ప్రజలు ప్రతీ పండుగను సుఖఃసంతోషాలతో జరుపుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ.. మానుకోట జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని, జిల్లా పోలీసు యంత్రాంగం యువత చెడు మార్గంలో వెళ్లకుండా మాదకద్రవ్యాలను నివారించాలన్నారు. అనంతరం రావణ వధ కార్యక్రమం నిర్వహించారు. మహబూబాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో దాసరి ప్రసాద్ అధ్యక్షతన పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్‌రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమా, నాయకులు జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, రమేష్, ఖలీల్, రాజు, ప్రవీణ్, శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు ఆరెంపుల విజయ, పోతురాజు రాజు, మార్నేని వెంకన్న, డీఈ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల్లో పూజలు, వేడుకలు
వైభవంగా రావణ వధ కార్యక్రమం

వైభవంగా విజయదశమి

వైభవంగా విజయదశమి

వైభవంగా విజయదశమి