
వసతులకు బంక్ కొడుతున్నారు!
తొర్రూరు: జిల్లాలోని పలు పెట్రోల్ బంకుల్లో నిబంధనలు అమలు కావడం లేదు. వినియోగదారులకు కల్పించాల్సిన సౌకర్యాలు మరిచి ధనార్జనే ధ్యేయంగా ఇంధన వ్యాపారం చేపడుతున్నారు. జిల్లా పౌర సరఫరాలు, తూనికలు, కొలతల శాఖల అధికారులు, రెవెన్యూ యంత్రాంగం వినియోగదారులకు కల్పించాల్సిన సౌకర్యాలపై నిఘా పెట్టడం లేదు. సిబ్బంది కొరత, పని భారాన్ని సాకుగా చూపుతూ వాటిని పట్టించుకోవడం లేదు.
నామమాత్రంగా ధరల పట్టికలు..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతన నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. ఇంధన ధరలను రోజు వారీగా ప్రకటించి, అన్ని పెట్రోల్ బంకుల్లో ప్రదర్శించాలన్నది దాని సారాంశం. ఈ విధానం జిల్లాలో అమలు కావడం లేదు. ధరల పట్టికను ఎక్కడా ప్రదర్శించడం లేదు. ఏళ్లనాటి మీటర్లతో మాయ చేస్తూ వినియోగదారులను నట్టేటా ముంచుతున్నారు. కొన్ని బంకుల్లోని యంత్రాల్లోని మీటర్లను తప్పగా అమర్చి తక్కువ యూనిట్లు పెట్రోల్, డీజిల్‌ను పోస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. 50ఎంఎల్, 100 ఎంఎల్ తేడా వస్తుందని గగ్గోలు పెడుతున్నారు. రూ. 100 పెట్రోల్ కొట్టిస్తే రూ. 99.45 వస్తుంది. ఈ విధంగా లక్షల్లో పక్కదారి పడుతోంది.
సౌకర్యాలు సంగతి సరేసరి..
నిబంధనల ప్రకారం పెట్రోలు బంకుల్లో వినియోగదారులకు తాగునీరు, మరుగుదొడ్లు, టైర్లకు గాలి నింపుకునే యంత్రాలు, ఎండ, వానల నుంచి రక్షణ కోసం షెడ్లను ఆయా బంకుల యాజమాన్యాలే కల్పించాలి. అగ్ని ప్రమాదాలను నివారించేలా నీటి తొట్లు, ఇసుక బకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. ప్రమాదాల నివారణకు అవసరమైన నూతన సాంకేతికతను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తేవాలి. అలాగే ఇంధన కల్తీలను చెక్ చేసుకునే అవకాశం వినియోగదారులకు కల్పించాలి. ఈ మేరకు లిట్మస్ పేపర్‌ను అందుబాటులో ఉంచాలి. ఇంధన కల్తీ నివారణ, కొలతల్లో మోసాలను అరికట్టేందుకు తూనికలు, కొలతల శాఖ అధికారులు నెలవారీ తనిఖీలు చేపట్టాలి. జిల్లాలోని పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో మరుగుదొడ్లు, గాలినింపే యంత్రాల ఏర్పాటు కనిపించదు. కొన్ని ప్రాంతాల్లో ఉన్నా అవి సరిగా పని చేయవు. కేవలం చిన్న చిన్న ఆరోపణలు వచ్చిన కొన్ని బంకుల్లో తనిఖీలు చేసి వదిలేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇంధన నమూనాలను సేకరించి వాటి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాలి. ఇది కూడా ఎక్కడా అమలు కావడం లేదు.
పరిశీలనలో తేలిన నిజాలు..
● స్టాకు బోర్డుల్ని సరిగ్గా నిర్వహించడం లేదు.
● అగ్ని ప్రమాద నివారణకు సరైన ఏర్పాట్లు లేవు.
● కల్తీ జరిగితే వినియోగదారులు ఫిర్యాదు చేయడానికి డీలరు, డీఎస్‌ఓ, జేసీల పేర్లు, వివరాలు, మొబైల్ నంబర్లు, అధికారిక వెబ్‌సైట్లు, టోల్ ఫ్రీ నంబర్లను బహిరంగంగా ప్రదర్శించాలి. ఈ నిబంధనలు అత్యధిక పెట్రోల్ బంకుల్లో అమలు కావడం లేదు.
● వినియోగదారుడు ఇంధన కల్తీని, కొలతల్లో తేడాను తెలుసుకునేందుకు హైడ్రోమీటర్, ఫిల్టర్ పేపర్, 5లీటర్ల పెట్రోల్ డబ్బాను అందుబాటులో ఉంచాలి. ఈ నిబంధనలు అమలు కావడం లేదు.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
నిబంధనలకు విరుద్ధంగా బంకులు నిర్వహిస్తే వినియోగదారులు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు. కనీస సౌకర్యాలు కల్పించని యాజమాన్యాలపై చట్టపరంగా చర్యలు ఉంటాయి. కల్తీ పెట్రోల్, డీజిల్ విక్రయించవద్దు. జిల్లాలో పెట్రోల్ బంకుల నిర్వహణ సక్రమంగా ఉండేలా అన్ని చర్యలు చేపడుతాం.
– వింజమూరి సుధాకర్,
జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్
పెట్రోల్ బంకుల్లో తనిఖీలు కరువు
నాణ్యత పరిశీలించేందుకు లిట్మస్ పేపర్ కరువు
గాలి నింపే యంత్రాల విస్మరణ
సిబ్బంది కొరత సాకుతో నిర్వాహకులపై కేసులు పెట్టని వైనం