
ఘటనా స్థలిలో చెలరేగుతున్న మంటలు
కూలీల జీవితాల్లో విషాద దీపావళి
రాయవరం మండలంలో ఘటన
ఎనిమిది మంది మృత్యువాత
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
మరుభూమిలా మారిన తయారీ కేంద్రం
పేలుడు ధాటికి ఎగిరి పడిన శరీరాలు
యజమాని సైతం మృత్యువాత
చీకటి వెలుగుల రంగేళీ.. జీవితమే ఒక దీపావళి.. కానీ ఈ దీపావళి వారి జీవితాల్లో చీకట్లు నింపింది. మిరుమిట్లు గొలుపుతూ ఉవ్వెత్తున ఎగసే చిచ్చుబుడ్డి వెలుగులు వారి జీవితాల్లో చిచ్చుపెట్టాయి. ఎవరికి ఎవరూ కాకుండా చేశాయి. మరో పది రోజుల్లో దీపావళి వస్తుంది. ఇంటిల్లిపాదీ ఈ పండగకు ఏ లోటూ లేకుండా బాణసంచా కాల్చాలి.. కొత్త దుస్తులు వేసుకోవాలి.. ఇలా ఎన్నో ఆశలతో ఆ కూలీలు బాణసంచా తయారీలో నిమగ్నమయ్యారు. ఇంతలో రాజుకున్న చిన్న నిప్పురవ్వ పేదల ఇంట పెను విషాదాన్ని నింపి వారి కుటుంబాలను అంధకారమయం చేసింది.
సాక్షి, అమలాపురం/రాయవరం/అనపర్తి/బిక్కవోలు: చుట్టూ పచ్చని పొలాలు.. సమీపిస్తున్న దీపావళి.. పండగ నాడు జనం కళ్లల్లో ఆనంద వెలుగులు చూడాలని అహోరాత్రాలు కష్టపడుతున్న బాణసంచా తయారీ కార్మికులు. అప్పుడప్పుడూ వచ్చిపోయే కొనుగోలుదారుల సందడి. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్క సారిగా పేలుడు శబ్దం. చిచ్చుబుడ్డి తయారు చేస్తున్న సమయంలో రాజుకున్న నిప్పురవ్వలు కొద్ది క్షణాలలోనే ఆ ప్రాంతాన్ని భస్మం చేసేశాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్‌లో పెను విస్ఫోటం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కాకినాడ జీజీహెచ్‌లో వాసంశెట్టి విజయలక్ష్మి, కాకినాడ ట్రస్ట్ ఆస్పత్రిలో పొట్నూరి వెంకటరమణ చికిత్స పొందుతూ మృతి చెందారు. పేలుడు ధాటికి కార్మికులు పది నుంచి ఇరవై అడుగులు దూరం ఎగిరిపడ్డారు. మరి కొందరు కార్మికులు మంటల్లో చిక్కుకుని నీటితో ఆర్పుకొనేందుకు నాలుగువైపులా పరుగులు తీశారు. ఈ ఘటనతో తయారీ కేంద్రం మంటలకు ఆహుతై మరుభూమిని తలపించింది. ప్రమాదం బారిన పడిన వారిని రక్షించేందుకు వెళ్లిన వారికి అక్కడి దృశ్యాలు చూసి ఒళ్లు గగుర్పొడిచింది. ప్రమాద ధాటికి కొంతమంది కార్మికులు ఎగిరి పక్కనే ఉన్న పంట పొలాల్లో పడ్డారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. చేతికి ఉన్న గాజులు, కాళ్లకు ఉన్న మట్టెల ఆధారంగా మాత్రమే పురుషులు, సీ్త్రలుగా గుర్తించారు. ఒంటిపై ఉన్న ఆభరణాలు, చేతికి ఉన్న ఉంగరాల ఆధారంగా తయారీ కేంద్రం యజమానిని గుర్తించారు. మృతుల కుటుంబీకులు చెప్పిన ఆనవాళ్లను బట్టి పోలీసులు కొందరిని గుర్తించారు.
శుభకార్యం ప్రాణాలు నిలిపింది
పేలుడు ఘటనలో గ్రామానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడంతో అనపర్తి సావరం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ గ్రామం నుంచి ప్రతిరోజు సుమారు 15 నుంచి 20 మంది మహిళలు బాణసంచా దుకాణంలో పని చేసేందుకు వెళ్తుంటారు. స్థానికంగా శుభకార్యం ఉండడం, రాబోయే దీపావళికి ఇల్లు శుభ్రం చేసుకునే పని ఉందని చాలామంది పనికి వెళ్లకపోవడంతో వారు మృత్యువు నుంచి తప్పించుకున్నారు. రోజూ తమతో పాటు పనికి వచ్చే వారిలో కొందరు మృతి చెందారని తెలిసి వారు కన్నీరుమున్నీరయ్యారు.
ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు
అసలు తన భార్య బతికుందా.. లేదా.. అనేది తెలియడం లేదని రాయవరం మండలం సోమేశ్వరానికి చెందిన కూలీ పాకా సుబ్బారావు రోదిస్తున్నాడు. మధ్యాహ్నం భోజన సమయంలో 12.02 గంటలకు తన భార్య అరుణకు ఫోన్ చేశానని, ఆ తర్వాత 12.30 గంటలకు ప్రమాదం జరిగినట్టు తెలిసిందని, ఇంతలోనే అంత ఘోరం జరుగుతుందనుకోలేదని బావురుమన్నాడు.
విషాదంలో కుటుంబ సభ్యులు
యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి మృతితో కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. ఎవరూ ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఇంటి వద్ద నెలకొంది. ప్రమాద స్థలికి చిన్న కుమారుడు చిట్టిబాబు చేరుకుని గుండెలు పగిలే రోదించాడు.
ఆలనాపాలనా చూసేవారెవరు?
పెంకే శేషారత్నంకు భర్త సూరిబాబు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు కార్తిక్ అనపర్తిలో దుకాణంలో పని చేస్తుండగా, సుబ్రహ్మణ్యం 9వ తరగతి చదువుతున్నాడు. భర్త సూరిబాబు కార్పెంటర్‌గా పని చేస్తున్నారు. అనారోగ్యంతో ఒకరోజు పని చేస్తే రెండు రోజులు ఇంటి వద్దే ఉంటాడు. శేషారత్నం సంపాదిస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటోంది. తల్లి మృతి చెందిందని తెలిసి బేలగా చూస్తున్న చిన్నారులు స్థానికులకు కంట తడిపెట్టిస్తున్నారు. తమ చిన్నారుల పరిస్థితి ఏమిటని తండ్రి సూరిబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
పిల్లల చదువు కోసం పనికి వెళ్లి..
నిరుపేద కుటుంబానికి చెందిన చిట్టూరి శ్యామలకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె మృతి వార్త విన్న వృద్ధురాలైన ఆమె అత్తగారిని ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. పిల్లలు ఇద్దరూ ఇంకా చదువుకుంటున్నారని వారికి ఖర్చులకు ఉంటాయని పనికి వెళ్లిందని, ఇలా మృత్యువాత పడుతుందని ఊహించలేదని రోదిస్తున్నారు. అత్తగారు గుండెలు పగిలేలా రోదిస్తుంటే ఓదార్చేందుకు మాటలు రావడం లేదని స్థానికులు వాపోతున్నారు.
మా జీవన ‘జ్యోతి’ ఆరిపోయింది
కుడిపూడి జ్యోతి కుటుంబ పరిస్థితి చాలా దయనీయం. కుమార్తె, కుమారుడు, వయసు పైబడిన తల్లి లక్ష్మి ఆమైపె ఆధారపడి జీవిస్తున్నారు. కుమార్తెకు ఇది వరకే వివాహం చేయగా, కుమారుడుకి ఇటీవలే వివాహమైంది. నాలుగు నెలల క్రితం భర్త సత్యనారాయణ మృతి చెందాడు. దీంతో వారి భారం జ్యోతిపై పడింది. ఆమె అనుకోకుండా ఈ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబానికి దిక్కులేకుండా పోయిందని, అనారోగ్యంతో ఉన్న తనను ముందు రోజు ఆస్పత్రికి తీసుకుని వెళ్లి రూ.రెండు వేలు ఖర్చు పెట్టిందని గుండెలు పగేలా రోదిస్తోంది.
మృతులు, క్షతగాత్రుల వివరాలు
మృతులు
1. వెలుగుబంట్ల సత్యనారాయణ (65), బాణసంచా తయారీ దుకాణం యజమాని, కొమరిపాలెం, బిక్కవోలు మండలం
2. పాకా అరుణ(35),
సోమేశ్వరం, రాయవరం మండలం
3. చిట్టూరి శ్యామల(35), అనపర్తి
4. పెంకే శేషారత్నం(40), అనపర్తి సావరం
5. కుడుపూడి జ్యోతి(38), అనపర్తి సావరం
6. కె.సదానందం (52), ఒడిశా వాసి
7. పొట్నూరి వెంకటరమణ (55), కొమరిపాలెం, బిక్కవోలు మండలం
8. వాసంశెట్టి విజయలక్ష్మి (51), సోమేశ్వరం, రాయవరం మండలం
క్షతగాత్రులు
1. చిట్టూరి యామిని, అనపర్తి
2. లింగం వెంకట కృష్ణ, వేండ్ర, పెదపూడి మండలం

భీతావహంగా ఘటనా స్థలి

ప్రమాదం స్థలి నుంచి క్షతగాత్రుడిని తీసుకువెళ్తున్న స్థానికులు

ఘటన స్థలంలో చెలరేగిన మంటలతో దట్టంగా వ్యాపించిన పొగ