
అప్పటి డీజీపీ కౌముది నుంచి పురస్కారాన్ని అందుకుంటున్న సత్తిబాబు (ఫైల్)
రాయవరం: గ్రామం సమీపంలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రాన్ని మూడు తరాలుగా ఒకే కుటుంబం నిర్వహిస్తోంది. రాష్ట్రంలో మొదటిసారిగా ఇక్కడి నుంచే బాణసంచా తయారీ కుటీర పరిశ్రమగా ప్రారంభమైంది. స్వాతంత్య్రానికి పూర్వమే వెలుగుబంట్ల వీరన్న బాణసంచా తయారీని ప్రారంభించినప్పటికీ వారి కుమారులు తాత నారాయణమూర్తి, రామకృష్ణల హయాంలోనే అభివృద్ధి చెందింది.
తాత నారాయణమూర్తి కుమారుడు వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి (సత్తిబాబు), రామకృష్ణ కుమారుడు కోటిబాబులు వేర్వేరుగా వ్యాపారాన్ని సాగించారు. కోటిబాబు మరణించే వరకు ఈ వృత్తిని కొనసాగించగా, వారసులు వృత్తికి స్వస్తి పలికారు. ఇదిలా ఉంటే సత్యనారాయణమూర్తి మాత్రం బాణసంచా తయారీని కొనసాగిస్తున్నారు. దీపావళి పర్వదినానికే కాకుండా వివాహాది శుభకార్యాలకు, గ్రామాల్లో జరిగే అమ్మవారి జాతర్లు, రాజకీయ పార్టీల ఊరేగింపులు, ఉత్సవాలకు బాణసంచా తయారీ చేస్తున్నారు.
1952లో మద్రాస్‌లో జరిగిన ఏఐసీసీ సమావేశం, 1978లో బెంగళూరులో జరిగిన జాతీయ క్రీడలకు, 1983లో ఎన్టీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి, 1983, 1999లలో ఫిలిం ఫెస్టివల్స్‌కు, పలు చలన చిత్రాల శత దినోత్సవాలకు వెలుగుబంట్ల సోదరులు తయారుచేసిన బాణసంచా కాల్చారు. వాటి తయారీలో ప్రత్యేక స్థానాన్ని సాధించి నిశిరాత్రిలో వెలుగుపూలు నింపిన వెలుగుబంట్ల సత్తిబాబు అదే బాణసంచా ప్రమాదానికి గురికావడాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. వివాద రహితుడు, సౌమ్యుడిగా పేరున్న సత్తిబాబు మృతితో ఆయన అభిమానులు, మిత్రులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.