
న్యాయఫలాలు అందరికీ అందాలి
● వనపర్తిలో రూ.81 కోట్లతో న్యాయస్థానాల సముదాయం నిర్మాణానికి శంకుస్థాపన
● వర్చువల్‌గా ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేష్‌కుమార్‌సింగ్
వనపర్తి టౌన్: న్యాయసేవలు సామాన్యుల దరి చేరేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు మెరుగైన పాత్ర పోషించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్‌కుమార్‌సింగ్ అన్నారు. ఆదివారం వనపర్తిలోని వైద్యకళాశాల సమీపంలో రూ.81 కోట్లతో 20 ఎకరాల విస్తీర్ణంలో కోర్టు సముదాయం నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించగా.. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మాధవి, జస్టిస్ అనిల్ జూకంటి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ న్యాయవాదులు కక్షిదారులకు న్యాయ ఫలాలు చేరువ చేసేందుకు తగిన చొరవ చూపాలని సూచించారు. ప్రజలకు న్యాయవ్యవస్థపై బలమైన విశ్వాసం ఉందని.. దానిని పదిలపర్చడంలో న్యాయవాదులు ముందుండాలన్నారు. మెరుగైన వసతులతో కూడిన న్యాయస్థానాల ద్వారా అందరికీ న్యాయ ఫలాలు దక్కాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం కోర్టు ఆవరణలో నిర్వహించిన సమావేశంలో జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటిి మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో ప్రజలందరికీ న్యాయం చేకూర్చడానికి మౌలిక వసతుల ఏర్పాటు అవసరమన్నారు. జస్టిస్ మాధవి మాట్లాడుతూ తాను ఉమ్మడి పాలమూరు జిల్లా ఆడబిడ్డనే అని చెబుతూ, వనపర్తిలో సంస్థానాధీశుల కాలం నుంచే న్యాయస్థానాలు ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయసేవలు అందించే వ్యవస్థ ఉందని గుర్తుచేశారు. అంతకు ముందు జిల్లాకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తులకు ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్ పూలమొక్కలు అందజేసి సాధారంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో రిటైర్డ్ న్యాయమూర్తి, తెలంగాణ ఈఆర్సీ చైర్మన్ నాగార్జున, వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీపీ కిరణ్‌కుమార్, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.