
సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు
భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలను కలెక్టర్ రాహుల్‌శర్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా, ఆడబిడ్డల ఆరాధన పండుగగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నట్లు తెలిపారు. దసరా పండుగ శక్తి ఆరాధనకు సంకేతమని, ఈ రెండు పండుగలు ప్రజలందరికీ ఆనందం, సౌఖ్యం, ఐకమత్యం కలిగించాలని ఆకాంక్షించారు. తొమ్మిది రోజుల పాటు మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆట, పాటలతో దిగ్విజయంగా జరుపుకున్నారని పేర్కొన్నారు.
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులను నియమించినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ సిబ్బంది, అధికారులను సమకూర్పు, బ్యాలెట్ బ్యాక్స్‌లు, ఎన్నికల సిబ్బంది రవాణా, ఓటింగ్ సామగ్రి, ఎంసీసీ, ఖర్చుల వివరాలు, మానిటరింగ్ టీమ్, మీడియా కమ్యూనికేషన్‌లతో వివిధ విభాగాలకు జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు.
పలిమెల: గోదావరికి వస్తున్న భారీ వరద కారణంగా మండలంలోని పంకెన, సర్వాయిపేట, పలిమెల గ్రామాల్లో సుమారు 30 ఎకరాల వరకు పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడి మొత్తం వృథా అయిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం ముగింపు దశకు వచ్చినప్పటికీ వర్షాలు, వరదలతో పత్తి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు వాపోయారు. తమను వ్యవసాయ అధికారులు, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
కాటారం: రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని సాగుకు సరిపడా యూరియా అందిస్తామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు అన్నారు. కాటారం మండలకేంద్రంలోని పీఏసీఎస్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో సోమవారం యూరియా పంపిణీని పర్యవేక్షించారు. యూరియా పంపిణీ పారదర్శకంగా నిర్వహించాలని రైతులకు ఇబ్బందులు కల్గనివ్వవద్దని డీఏఓ పీఏసీఎస్ అధికారులు, ఆగ్రోస్ కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. డీఏఓ వెంట ఏఓ పూర్ణిమ, ఏఈఓలు, సిబ్బంది ఉన్నారు.
కాళేశ్వరం: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో రాజకీయ పార్టీల నాయకులు, దేశ నేతల విగ్రహాలను కనిపించకుండా పంచాయతీ అఽధికారులు వస్త్రాలు తొడిగారు. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికలు జరుగనున్నాయి. ప్రతీ ఒక్కరు ఎన్నికల ప్రవర్తన నియమాలు పాటించి సహకరించాలని పంచాయతీ కార్యదర్శి ఎన్.సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు