
రైతుకు మేలుచేసేలా..!
పత్తి కొనుగోళ్లు ఇక సులభతరం, పారదర్శకం
జిల్లాలోని సీసీఐ సెంటర్‌లో పత్తి కొనుగోళ్లు(ఫైల్)
జనగామ: జిల్లాలో పత్తి కొనుగోళ్లకు సీసీఐ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. పత్తి అమ్ముకునే సమయంలో రైతులకు మరింత సులభతరం, పారదర్శకత కల్పించేందుకు నూతన విధానాలు ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పత్తి సాగు విస్తీర్ణం, మార్కెట్ సెంటర్ల ఏర్పాట్లు, సాంకేతికత వినియోగం తదితర అంశాలపై రాష్ట్రస్థాయి మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. జిల్లాలో 16 సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సెంటర్ల కోసం జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, మరో వారం రోజుల్లో పూర్తి స్పష్టత రానుంది. అక్టోబర్ 3వ వారంలో కొనుగోళ్లు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మూడు ప్రాంతాలు..16 కొనుగోలు కేంద్రాలు
జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, కొడకండ్ల మండలాల పరిధిలో పత్తి కొనుగోళ్ల కోసం 16 సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. జనగామ నియోజకవర్గంలో 11, స్టేషన్‌ఘన్‌పూర్ పరిధిలో 3, పాలకుర్తి నియోజకవర్గంలో 2 అవసరమున్నట్లు ప్రాథమిక అంచనా వేశారు.
కపాస్ కిసాన్ యాప్ ద్వారా..
వానాకాలం సీజన్‌లో సాగుచేసిన పత్తిని అమ్ముకునే సమయంలో రైతులు సీసీఐ సెంటర్ల వద్ద ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా కపాస్ కిసాన్ యాప్ సేవలను మరింత పటిష్టం చేయనున్నారు. రైతులు యాప్‌లో ముందుగానే స్లాట్ బుక్ చేసుకునే విధానం ప్రవేశపెట్టనున్నారు. స్మార్ట్‌ఫోన్‌లోని ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. రైతు ఫోన్ నెంబర్‌తో లాగిన్ చేసుకుని, అందులో వచ్చిన ఓటీపీతో రిజిష్ట్రేషన్ చేసుకోవాలి. ఆధార్, పట్టాదార్ పాసుబుక్కు, బ్యాంకు ఖాతా నెంబర్లతో పాటు పత్తి సాగు ఎన్ని ఎకరాల్లో చేశారనే వివరాలను నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత సీసీఐ సెంటర్ల ద్వారా పత్తిని అమ్ముకునేందుకు యాప్ ద్వారా ముందస్తు స్లాట్ బుకింగ్ చేసుకుంటే, అక్కడకు వెళ్లి నిరీక్షించే పని ఉండదు. దీని ద్వారా రైతులు నిర్ణీత సమయానికి తమ పత్తిని విక్రయించే అవకాశం కలుగుతుంది. దీంతో పాటు యాప్‌లో బ్యాంకులో నగదు జమకు సంబంధించి చూసుకోవచ్చు.
ప్రైవేటు ఏజెన్సీకి డేటా ఎంట్రీ..
జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న 16 సీసీఐ కేంద్రాల్లో ప్రైవేటు ఏజెన్సీ ద్వారా డాటా ఎంట్రీ ఆపరేటర్లను ఏర్పాటు చేసే ఆలోచనలో మార్కెటింగ్ శాఖ ఉంది. గతంలో వ్యవసాయ మార్కెట్‌ల పరిధిలో పనిచేసే వారి సేవలను వినియోగించుకునేవారు. పత్తి కొనుగోలు సమయంలో లావాదేవీల రికార్డింగ్‌లో పొరపాట్లు లేకుండా ఉండేందుకు కలెక్టర్ నేతృత్వంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ల బాధ్యతలను ప్రత్యేక ఏజెన్సీకి అప్పగించేందుకు సీసీఐ కసరత్తు చేస్తోంది. సాంకేతిక లోపాల వల్ల గతంలో ఎదురైన ఇబ్బందులు ఈసారి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఏఎంసీల్లో పనిచేసే వారికే ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచన సైతం ఉందని సమాచారం.
సొంత జిల్లా వరకే పరిమితం...?
కొనుగోళ్లలో అక్రమాలు, అవకతవకలకు చెక్ పెట్టేందుకు ఏ జిల్లాకు ఆ జిల్లా పత్తి మాత్రమే కొనుగోలు చేసేలా సీసీఐ కొత్త నిబంధనలు తీసుకురావాలనే ప్రతిపాదనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నిబంధన అమలు చేస్తే పొరుగు జిల్లాల రైతులు తమ పత్తిని మరోచోట విక్రయించే పరిస్థితి ఉండదు. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే ప్రైవేటు మార్కెట్ పోటీ తగ్గి, రైతులకు నష్టమవుతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో మార్కెటింగ్ శాఖ, సీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
జిల్లాలో 1.30లక్షల ఎకరాల పత్తి సాగు
జిల్లాలో వానాకాలం సీజన్‌లో 1.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ప్రస్తుత సమయంలో పంట ఎదుగుదల బాగానే ఉంది. రైతులకు మంచి ధర రావాలంటే పాటించాల్సిన నాణ్యత ప్రమాణాలపై అధికారులు అవగాహన కల్పించనున్నారు. పత్తి క్వింటాల్‌కు ఏగ్రేడ్ రూ.8,110 మద్దతు ధర కల్పిస్తుండగా, 12 శాతం తేమ ఉన్న సరుకుకు రూ.7,710 ఇవ్వనున్నారు. ఇలా 8 నుంచి 12 శాతం వరకు మద్దతు ధర లభించనుంది. కానీ ఈసారి మద్దతు ధర 14 శాతానికి పెంచాలనే డిమాండ్ ఉంది. ఒక్కో శాతం తేమ పెరిగిన కొద్ది మద్దతు ధరలో రూ.81.10 తగ్గిస్తారు. సాంకేతికత వినియోగం సానుకూలమే అయినా, కొత్త నిబంధనలు రైతులకు ఇబ్బంది కలిగించకూడదని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పత్తి కొనుగోళ్లలో సీసీఐ కొత్త విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా రైతులకు సౌలభ్యం కలిగించాలనుకుంటున్నప్పటికీ, నిబంధనలపై ఉన్న సందేహాలు పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత పెరిగే అవకాశం ఉంది.
కొత్తగా స్లాట్ బుకింగ్ విధానం
ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న సీసీఐ
జిల్లాలో 16 సెంటర్లకు అధికారుల ప్రతిపాదనలు
1.26 లక్షల ఎకరాల్లో పత్తిసాగు
గత సీజన్‌లో..
గత సీజన్‌లో జిల్లాలో సుమారు 7.50లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. పత్తి కొనుగోళ్ల సమయంలో అక్రమాలు జరిగానే ఆరోపణల నేపథ్యంలో అప్పటి కార్యదర్శిని సస్పెండ్ చేయగా, రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందిపై వేటు పడింది. ప్రస్తుత సీజన్‌లో వ్యవసాయ శాఖ పత్తి సాగు వివరాలు, రైతుల పేర్లు, తదితర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి. పట్టాదార్ పాస్‌బుక్కు ఆధారంగా ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి చొప్పున రైతు సీసీఐలో అమ్ముకునే నిబంధన ఉంది. అంతకు మించి దిగుబడి వస్తే ప్రైవేటులో అ మ్ముకోవాల్సిందే. ఈ నిబంధన సడలించాలని రైతులు కోరుతున్నారు.

రైతుకు మేలుచేసేలా..!

రైతుకు మేలుచేసేలా..!