
కలిసొచ్చిన అవకాశం
బీసీలకు వరం పెరిగిన సీట్లు ఆశావహుల్లో ఉత్సాహం రిజర్వేషన్ అనుకూలించే వారు పోటీకి సై
జగిత్యాల/జగిత్యాలరూరల్ బీసీలకు ప్రభుత్వం కల్పించిన 42 శాతం రిజర్వేషన్ వరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంతో పోల్చితే సీట్లు పెరిగాయి. ఎంపీపీ, జెడ్పీటీసీతో పాటు, సర్పంచ్ పదవులు బీసీలకు కలిసివస్తున్నాయి. జెడ్పీటీసీ స్థానాలు గతంలో 18 ఉండగా.. అందులో బీసీలకు 5 దక్కాయి. ఈసారి ఏకంగా 9కి చేరాయి. ఎంపీపీ స్థానాలు గతంలో బీసీలకు 4సీట్లు ఉండేవి. అవి ప్రస్తుతం 8కి చేరాయి. సర్పంచుల్లో 385 గ్రామపంచాయతీలకుగాను 79 స్థానాలు దక్కాయి. సీట్లు పెరగడంతో బీసీ సామాజిక వర్గాల నాయకులు టికెట్ల కోసం పైరవీలు కూడా చేస్తున్నారు. దసరా, సద్దుల బతుకమ్మ సెలవులు కలిసిరావడంతో చాలామంది ఊరిబాట పట్టారు. దీంతో ఆశావహులు వారిని ప్రత్యేకంగా కలిసి మద్దతు కోరుతున్నారు.
కొన్ని చోట్ల అసంతృప్తి
రిజర్వేషన్ల కేటాయింపుతో పోటీకి దూరమైన వారిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో సర్పంచ్‌గా కొనసాగిన వారు జెడ్పీటీసీ కావాలని చూశారు. అలాంటివారికి రిజర్వేషన్ అనుకూలించలేదు. ఎంపీపీ పదవి ఆశించిన వారికి రిజర్వేషన్ కలిసి రాక ఏం చేయాలో తోచని పరిస్థితి నెలకొంది.
రిజర్వేషన్ల కేటాయింపు ఇలా..
జిల్లాలో ఎంపీటీసీ స్థానాలు 216 ఉన్నాయి. ఇందులో ఎస్సీ 26, ఎస్టీ 7, బీసీ 52, జనరల్ 41, మహిళలకు 90 కేటాయించారు. జెడ్పీటీసీ 20స్థానాలకు ఎస్సీ 4, ఎస్టీ 1, బీసీ 9, జనరల్ 6 కేటాయించారు. ఎంపీపీ 20స్థానాలు ఉండగా.. ఎస్సీ 4, ఎస్టీ 1, బీసీ, జనరల్‌లో 7 స్థానాలు కేటాయించారు. 385 పంచాయతీలకు ఎస్సీలకు 40, ఎస్టీలకు 27, బీసీలకు 79, జనరల్ 70, మహిళలకు 169 స్థానాలు కేటాయించారు. మహిళలకు ఈ సారి 50 శాతం రిజర్వేషన్ కేటాయించడంతో పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది.
పోటీపై యువత ఆసక్తి
ఎన్నికల్లో యువకులే ఎక్కువగా పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో రాజకీయ అనుభవం ఉన్న కుటుంబాల యువత పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. కొంతమంది ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాక ఇంటి వద్దే ఉంటున్నారు. అలాంటి స్థానిక యువతతో సన్నిత సంబంధాలు ఏర్పర్చుకున్నారు.
2025లో...
జెడ్పీటీసీ స్థానాలు : 20
ఎస్సీ : 4
ఎస్టీ : 1
బీసీ : 9 (4 పెరిగాయి)
జనరల్ : 6
2019లో...
జెడ్పీటీసీ స్థానాలు : 18
ఎస్సీ : 3
ఎస్టీ : 1
బీసీ : 5
జనరల్ : 9
2025లో...
ఎంపీపీ స్థానాలు : 20
ఎస్సీలు : 4
ఎస్టీ : 1
బీసీ : 8 (4 పెరిగాయి)
జనరల్ : 7
2019లో...
ఎంపీపీ స్థానాలు : 18
ఎస్సీలు : 4
ఎస్టీ : 1
బీసీ : 4
జనరల్ : 9