
డిజిటల్ బుక్‌పై అవగాహన ముఖ్యం
ఒక్కో నియోజకవర్గానికి 14 వేల మంది సైనికులను తయారు చేయడమే లక్ష్యం
ప్రజల సొమ్ము ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తున్న సర్కారు
కూటమి వైఫల్యాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించడం కీలకం
వైఎస్సార్‌సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి
తాడేపల్లి రూరల్: పార్టీ నాయకులపై, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడులను, పెడుతున్న అక్రమ కేసులను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు డిజిటల్ బుక్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని రాజ్యసభ సభ్యులు, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ వై.వి. సుబ్బారెడ్డి అన్నారు. దానిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్‌లోని కుంచనపల్లిలో ఉన్న ఫార్య్చూన్ గ్రాండ్ హోటల్‌లో వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లాకు సంబంధించి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండల స్థ్ధాయి నాయకులతో డిజటల్ బుక్‌పై అవగాహన సదస్సు, పార్టీ ప్రణాళికలపై విస్తృత స్థాయి సమావేశాన్ని మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి అధ్యక్షత నిర్వహించారు. ముఖ్య అతిథిగా వై.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ గ్రామ, వార్డు స్థాయిలో డిజిటల్ బుక్‌పై నాయకులకు, కార్యకర్తలకు అవగాహన కల్పించాలన్నారు. వారి రక్షణ కోసమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ డిజిటల్ బుక్‌ను ఏర్పాటు చేశారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను కాస్తోకూస్తో అమలు చేసిందంటే పార్టీ అధినేత చేసిన పోరాట ఫలితమేనని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపైన సైతం కొన్ని పత్రికల వారు భజన చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం అందరికీ ఉన్న ఒకే ఒక్క ఆయుధం సోషల్‌మీడియా అని, ప్రభుత్వ వైఫల్యాలను అందులో ఎండగడుతున్న వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. నాయకులను, కార్యకర్తలను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
అక్రమ కేసులపై పోరాటమే స్ఫూర్తి
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేదల కోసం ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను కూటమి సర్కారు తమ పార్టీ నాయకులకు ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. దీనిపై పోరాటం చేస్తున్న వారిపై అనేక దుష్ప్రచారాలు చేస్తూ తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. 16 నెలల నుంచి లేని లిక్కర్ కేసును సొంత పత్రికల ద్వారా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతోందని చెప్పారు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాలో నాయకులు, కార్యకర్తలు ఆ కేసును ఎండగడుతూ నిలదీస్తున్నారని గుర్తుచేశారు. అది పార్టీకి ఉన్న బలమని పేర్కొన్నారు.
ప్రజారోగ్యంతో పాలకుల ఆటలు
గతంలో ఉన్న మద్యం పాలసీని కూటమి ప్రభుత్వం రద్దు చేసి తమ పార్టీ నాయకులతో కల్తీ మద్యాన్ని తయారుచేయిస్తున్న సంగతి గత వారం రోజుల నుంచి చూస్తున్నామని గుర్తుచేశారు. అదే మద్యం దుకాణాలు ప్రభుత్వం చేతిలో ఉంటే ఇలాంటి ఘటనలు జరగవని అన్నారు. కూటమి నాయకుల జేబులు నింపేందుకు కల్తీ మద్యాన్ని అమ్మించి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్సీలు చంద్రగిరి ఏసురత్నం, టి.కల్పలత రెడ్డి, మాజీ మంత్రి మేకతోటి సుచరిత, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ (పొన్నూరు), షేక్ నూరి ఫాతిమా(గుంటూరు తూర్పు), వనమా బాల వజ్ర బాబు (తాడికొండ), బలసాని కిరణ్‌కుమార్ (ప్రత్తిపాడు), సీఈసీ సభ్యులు జియావుద్దీన్, మందపాటి శేషగిరిరావు, ఆతుకూరి ఆంజనేయులు, ఎస్‌ఈసీ సభ్యులు కొలకయూరి కోటేశ్వరరావు, నల్లమోతు రూత్‌రాణి, రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, షేక్ మస్తాన్ వలి, షియాక్ గులాం రసూల్, అన్నపరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షుడు పానుగంటి చైతన్య, రాష్ట్ర కుమ్మరి శాలివాహన సంఘ అధ్యక్షుడు మండెపూడి పురుషోత్తం, రాష్ట్ర కృష్ణ బలిజ సంఘ అధ్యక్షుడు కోలా భవాని, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెంకటప్పరెడ్డి పాల్గొన్నారు.
గ్రామ, వార్డు స్థాయి కమిటీలను బలోపేతం చేయండి

డిజిటల్ బుక్‌పై అవగాహన ముఖ్యం