
స్థిరమైన ఆర్థిక ప్రణాళిక కీలకం
గుంటూరు ఎడ్యుకేషన్: భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా డబ్బును పొదుపు చేసేందుకు స్థిరమైన ఆర్థిక ప్రణాళిక ఎంతో కీలకమని ఏఎన్‌యూ రెక్టార్ ఆచార్య ఆర్.శివరామప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం అమరావతి రోడ్డులోని హిందూ మేనేజ్‌మెంట్ కళాశాలలో ‘సురక్షిత ఆర్థిక ప్రణాళిక – మోసాల నివారణ’పై అవగాహన సదస్సు నిర్వహించారు. ధర్మపీఠం లీగల్ సర్వీసెస్, అభిజ్ఞ భారత్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా శివరామప్రసాద్ మాట్లాడుతూ.. ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఆర్థిక నిర్ణయాలు సైతం క్లిష్టంగా మారుతున్నాయని చెప్పారు. భద్రమైన ఆర్థిక ప్రణాళిక అంటే కేవలం డబ్బును ఆదా చేయడం ఒక్కటే కాదన్నారు. దానిని సక్రమంగా వినియోగించి, భవిష్యత్తులో మనకు అవసరమైన సమయంలో ఆదుకునేలా పెట్టుబడి పెట్టడమేనని వివరించారు.
మోసాలను అడ్డుకునేందుకు చర్యలు
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ రవిరాజ్ మాట్లాడుతూ దేశ ఆర్థికాభివృద్ధిలో సెక్యూరిటీస్ కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ఈ రంగంలో పారద్శకత, నైతికత, పెట్టుబడిదారులకు అవగాహన లేకపోతే మోసాలకు గురవుతారని అన్నారు. మార్కెట్ నియంత్రణ, పెట్టుబడిదారుల రక్షణ, పారదర్శక వ్యాపార పద్ధతులు వంటి అంశాల్లో సెబీ నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. ఇటీవలి కాలంలో పంప్ అండ్ డంప్స్ స్కీమ్స్, సోషల్ మీడియా మోసాలు, డీప్ ఫేక్ వీడియోల ద్వారా పెట్టుబడిదారులు మోసాలకు గురవుతున్నారని తెలిపారు. ఈ మోసాలను అరికట్టేందుకు ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కలిగించడం అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు అంశాలను వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సింగరాజు వెంకటరమణ మాట్లాడుతూ డిజిటల్ యుగంలో ఆర్థిక వ్యవహారాలను సురక్షితంగా నిర్వహించడం అవసరమన్నారు. కార్యక్రమంలో ధర్మపీఠం లీగల్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్, అభిజ్ఞ భారతి వ్యవస్థాపకురాలు డాక్టర్ దుంప శ్రీదేవి, కళాశాల కరస్పాండెంట్ చెరువు రామకృష్ణమూర్తి, ఎంబీఏ, ఎంసీఏ విభాగాధిపతులు డాక్టర్ చక్రవర్తి, రాజ్యలక్ష్మి, ఐక్యూఏసీ డైరెక్టర్ డాక్టర్ కె.లలిత, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కళ్యాణి, సహాయాచార్యులు చల్లా వైష్ణవి, వేదవతి, బాజీబాబు, అనిత, వెంకట్ కళ్యాణ్, ఉమాదేవి, రాజేశ్వరి దేవి, శశికళ, గణేష్, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.