వరద.. గో‘దారి’లో | - | Sakshi
Sakshi News home page

వరద.. గో‘దారి’లో

Oct 5 2025 2:22 AM | Updated on Oct 5 2025 2:22 AM

వరద.. గో‘దారి’లో

వరద.. గో‘దారి’లో

● ఈ ఏడాది దంచికొట్టిన వానలు ● ప్రాజెక్టులకు పోటెత్తిన వరద ● గేట్లు దాటి.. పరవళ్లు తొక్కిన పెన్‌గంగ ● వందలాది టీఎంసీలు దిగువకే..

సాక్షి,ఆదిలాబాద్‌: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 90 టీఎంసీలు.. దీని ద్వారా ఆయా జిల్లాల్లోని 18 లక్ష ల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది.. ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాద్‌ జిల్లాలోని మండలాలను ఆనుకొని ఉండే దిగువ పెన్‌గంగ నుంచి ఈ వానాకాలంలో దిగువకు వెళ్లిన ప్రవాహం అక్షరాలా 360 టీఎంసీలు.. అంటే ఎస్‌ఆర్‌ఎస్పీ నీటి సామర్థ్యం కంటే నాలుగు రేట్లు అధికం. ఇక్కడ కొరటా–చనాఖ సరిహద్దులు గా ఇటు తెలంగాణ నుంచి అటు మహారాష్ట్ర వరకు బ్యారేజ్‌ నిర్మించిన విషయం తెలిసిందే. దీని గేట్లు తెరిచే ఉంటాయి. అయితే జిల్లా జల వనరుల శాఖ అధికారులు ఇక్కడి నుంచి వెళ్లే వరద ప్రవాహాన్ని లెక్కగట్టడం జరుగుతుంది. ఆ లెక్కలే ఇవి.

లోయర్‌ పెన్‌గంగ నుంచి కొరటా–చనాఖా..

తెలంగాణ–మహారాష్ట్ర సంయుక్తంగా నిర్మించతలపెట్టిన ప్రాజెక్ట్‌ లోయర్‌ పెన్‌గంగ. ఇది అంతర్‌రాష్ట్ర ప్రాజెక్ట్‌. 1975లో ఈ ప్రాజెక్టు నిర్మించాలని డిమాండ్‌ తీవ్రంగా ఉండేది. 1996లో సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీడబ్ల్యూసీ) ఇరు రాష్ట్రాలకు సంబంధించి నీటి వినియోగ లెక్కలను నిర్ధారించింది. ప్రధానంగా నది ప్రవహించే భూభాగ నిష్పత్తులను పరిగణలోకి తీసుకొని నీటి వినియోగాన్ని అప్పట్లో నిర్ధారించారు. ఆ సమయంలో వంద టీఎంసీల సామర్థ్యంతో లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్ట్‌ నిర్మించాలని తలపెట్టారు. అందులో మహారాష్ట్ర వాటా 88 టీఎంసీలు కాగా, తెలంగాణ వాటా 12 టీఎంసీలుగా నిర్ధారించారు. అదేనిష్పత్తిలో నిధులు కూడా వె చ్చించాల్సి ఉంటుంది. అయితే మహారాష్ట్రలో భూ సేకరణ, వివిధ కారణాలతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. ఆ తర్వాత కాలంలో దీని నీటి సామర్థ్యం తగ్గిపోయింది. ఆ తర్వాత సీడబ్ల్యూసీ తెలంగాణ వాటా 5.12 టీఎంసీలుగా నిర్ధారించింది. అయితే లోయర్‌ పెన్‌గంగప్రాజెక్ట్‌ నిర్మాణానికి ముందడుగు పడకపోవడంతో ప్రత్యేక రాష్ట్రంలో జిల్లాకు సరిహద్దులో నది భూభాగంపై ఇరు రాష్ట్రాలను కలుపుతూ కొరటా–చనాఖా బ్యారేజ్‌ నిర్మించడం జరిగింది. ఈ బ్యారేజ్‌ సామర్థ్యం కేవలం 0.830 టీఎంసీలు మాత్రమే. ప్రధానంగా జిల్లా నుంచి దిగువకు వందలాది టీఎంసీల వరద నీరు వృథాగా పోతుండగా, ఇక్కడ వాటిని వినియోగించుకునేందుకు సరైన ప్రాజెక్టులు లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది.

సాత్నాల, మత్తడి సామర్థ్యానికి మించి వరద..

జిల్లాలోని రెండు మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటి సాత్నాల, మరొకటి తాంసి మండలంలోని మత్తడివాగు. సాత్నాల పూర్తిస్థాయి సామర్థ్యం 1.24 టీఎంసీలు కాగా, మత్తడివాగు సామర్థ్యం 0.571 టీఎంసీలు. ఈ వర్షాకాలంలో ఈ ప్రాజెక్టుల నుంచి దిగువకు ఎన్నో రేట్లు అధికంగా వరద నీటిని వదిలారు. సాత్నాల నుంచి 4.172 టీఎంసీలు, మత్తడివాగు నుంచి 4.218 టీఎంసీలు దిగువకు వదలినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా భారీ వరదలు రావడంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి ప్రవాహాన్ని దిగువకు వదలాల్సి వచ్చింది. సాత్నా ల ప్రాజెక్ట్‌ కింద లక్ష్మిపూర్‌ రిజర్వాయర్‌ ఉన్నప్పటి కీ, మత్తడివాగుకు దిగువ భాగంలో ఎలాంటి రిజర్వాయర్లు లేకపోవడంతో వరద ప్రవాహం వృథాగా గోదావరిలో కలవాల్సిందే. అయితే రానున్న రోజుల్లో ఈ రెండు ప్రాజెక్టుల నీటి సామర్థ్యం పెంచడం ద్వారా ఆయకట్టు అభివృద్ధికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ లేకపోలేదు.

మత్తడివాగు గేట్ల నుంచి దిగువకు నీటి పరవళ్లు (ఫైల్‌)

ఈ సీజన్‌లో వరద ప్రవాహం ఇలా..

ప్రాజెక్ట్‌ వచ్చిన వరద

సామర్థ్యం

(టీఎంసీలలో)

కొరటా–చనాఖా బ్యారేజ్‌ 360

సాత్నాల 4.172

మత్తడివాగు 4.218

జిల్లాలో వర్షపాతం వివరాలు..

(జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు)

సాధారణం : 996.1 మి.మీ.లు

కురిసింది: 1,362 మి.మీ.లు

వ్యత్యాసం : 35 శాతం అధికం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement