‘కరోనా’ చికిత్సకు ఏర్పాట్లు

Etela Orders Immediate Action In Medical Colleges Over Coronavirus - Sakshi

వైద్య కళాశాలల్లో తక్షణ చర్యలకు మంత్రి ఆదేశం

నేటి నుంచి గాంధీలో రోగ నిర్ధారణ పరీక్షల నిర్వహణ

వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించిన ఈటల

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ హైఅలర్ట్‌ నేపథ్యంలో అన్ని మెడికల్‌ కాలేజీలు, అనుబంధ ఆస్పత్రుల్లో అనుమానిత కేసులకు చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్‌ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పల్మనాలజిస్టులు అందరూ అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. సోమవారం నుంచి గాంధీ మెడికల్‌ కాలేజీలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తామన్నారు. ఇప్పటివరకు తెలంగాణలో ఒక్క కేసు కూడా పాజిటివ్‌గా నమోదు కాలేదన్నారు. చైనా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఫీవర్, గాంధీ, ఛాతీ ఆస్పత్రులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రుల్లో చేరినవారికి చికిత్స అందించేందుకు అన్ని వసతులు ఏర్పాటు చేశామన్నారు.

పర్యవేక్షణలో చైనా నుంచి వచ్చినవారు..
గత 3 రోజుల్లో చైనా నుంచి 15 మంది రాష్ట్రానికి వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంకు సమాచారం అందింది. ఈ మూడు రోజుల్లో మొత్తం 35 మంది వరకు ఫోన్లు చేశారని, వారిలో 15 మంది చైనా నుంచి వచ్చినట్లు తెలిపింది.వారెవరికీ కరోనా అనుమానిత లక్షణాలు లేవని, వైరస్‌ బయటపడేందుకు 14 రోజుల సమయం పడుతుంది కాబట్టి తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలని వారిని కోరినట్లు తెలిపారు. వారి వివరాలన్నింటినీ సేకరించి తమ వద్ద పెట్టుకున్నామన్నారు. వారుండే ప్రాంతాలు, జిల్లాల వైద్యాధికారులు, సమీప ప్రభుత్వ ఆస్పత్రులకు సమాచారం ఇచ్చామని, వారిలో వచ్చే మార్పులను గమనిస్తున్నామన్నారు. వారి వివరాలు తెలిపితే పక్కనున్న ఇళ్లల్లోని ప్రజలు దూరం పెట్టే అవకాశముందని, అందుకే వారి సమాచారం ఏమాత్రం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top