మహిళా మణిహారం | Women maniharam | Sakshi
Sakshi News home page

మహిళా మణిహారం

Sep 15 2016 11:58 PM | Updated on Jun 4 2019 6:34 PM

మహిళా మణిహారం - Sakshi

మహిళా మణిహారం

కడప నగరంలోని ఎస్‌కేఆర్‌ అండ్‌ ఎస్‌కేఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలకు ఎంతో విశిష్టత ఉంది... ఇది జిల్లాలోని ఏకైక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కావడంతో ఇక్కడ సీటు లభించడం కాస్త కష్టమే... సామాన్య, మధ్య తరగతి విద్యార్థులకు అందుబాటులో ఉండటంతోపాటు రవాణాకు అనువుగా ఉండటంతో ఇక్కడ సీటు లభించడం అంటే మామూలు విషయం కాదు.

వైవీయూ :
మహిళా సాధికారతే ధ్యేయంగా జిల్లాలో ఏర్పాటైన ఏకైక మహిళా డిగ్రీ కళాశాల. ఈ కళాశాల ఏర్పాటైనప్పటి నుంచి జిల్లాలోని మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. స్త్రీ విద్య అభ్యున్నతికి ఏర్పాటైన ఈ విద్యాలయం గురించి.. క్లుప్తంగా.. 1973లో సుమారు ఆరు లక్షల మంది ఉన్న జనాభా.. 2016 నాటికి దాదాపు 30 లక్షలు అయింది. ఇందులో సగం జనాభా మహిళలు ఉన్నారు. అప్పటి జనాభా ఆధారంగా 1973లో కోటిరెడ్డి రామసుబ్బమ్మ చొరవతో కోర్టు భవన సముదాయంలో జిల్లాలో మొట్టమొదటి మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు ఒకే ఒక్క ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జిల్లా విద్యార్థినులకు సేవలందిస్తోంది.

కడప నగర నడిబొడ్డున, చక్కటి రవాణా సౌకర్యం, హాస్టల్‌ వసతి, నాణ్యమైన విద్యాప్రమాణాలు కలిగిన ఈ కళాశాలలో సీటు లభించడమే భాగ్యంగా భావించే విద్యార్థులు సైతం ఉన్నారు. ఈ ఏడాది ప్రవేశాల కోసం ఏకంగా 3 వేల దరఖాస్తులు వచ్చాయంటే, కళాశాలకు ఉన్న ప్రాధాన్యత అర్థమవుతోంది. అయితే నాటి జనాభా ఆధారంగా మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయగా నేడు అంతకు మూడు రెట్లు జనాభా పెరిగినప్పటికీ అదే కళాశాల సేవలందిస్తోంది. బీఏ, బీకాం కోర్సులతో ప్రారంభమైన కళాశాల నేడు సంప్రదాయ కోర్సులతోపాటు ఆధునిక కోర్సులను విద్యార్థినులకు అందజేస్తోంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా మరో మహిళా కళాశాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ తెరపైకి వస్తోంది.
కోటిరెడ్డి రామసుబ్బమ్మ ప్రత్యేక చొరవ..
1973లో కోటిరెడ్డి రామసుబ్బమ్మ ప్రత్యేక చొరవతో జిల్లాలో తొలి మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటైంది. కళాశాల అభివృద్ధికి ఆమె సొంత నిధులు వెచ్చించారు. చాలా కాలం పాటు కోర్టు భవనాల్లో నిర్వహించారు. అనంతరం 3.5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో కోటిరెడ్డి, రామసుబ్బమ్మ తనయుడు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేసిన జయభారత్‌రెడ్డి వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం దాదాపు రూ.1 కోటి వెచ్చించి మహిళల కోసం హాస్టల్‌ను అధునాతన సౌకర్యాలతో నిర్మించారు.
వైఎస్‌ఆర్‌ చొరవతో సరికొత్త సొగబులు..
2004లో జిల్లాకు చెందిన డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కావడంతో కళాశాల దశ మారింది. 2.5 కోట్ల నిధులు విడుదల చేయడంతోపాటు స్వయాన ముఖ్యమంత్రి హోదాలో 2005లో ఆయనే శంకుస్థాపన చేశారు. 2008 నాటికి నూతన భవనాలు పూర్తయి కళాశాల సరికొత్త రూపును సంతరించుకుంది. అనంతరం 2014లో కళాశాల న్యాక్‌ బీ గ్రేడ్‌ సాధించింది. కాగా ఈ ఏడాది స్వయంప్రతిపత్తి పొందేందుకు సన్నద్ధం అవుతోంది.
ఆహ్లాదకర వాతావరణంలో...
కో ఎడ్యుకేషన్‌ ఇష్టపడని విద్యార్థినులకు చక్కటి విద్యనందించే కళాశాల కోటిరెడ్డి మహిళా డిగ్రీ కళాశాల. ఇక్కడ ఆహ్లాదకర వాతావరణంలో మంచి అధ్యాపక బృందం, చక్కటి లైబ్రరీ ఉండటంతో పాటు నగర నడిబొడ్డులో ఉండటం కారణంగా ఎక్కువగా ఈ కళాశాలలో అభ్యసించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ సీటు లభించాలంటే కాస్త కష్టమే. ఇక్కట సీటు లభించని వారు ప్రైవేట్‌ కళాశాలలను ఆశ్రయిస్తున్నారు. ఇదే క్యాంపస్‌లో మరో మహిళా కళాశాలను ఏర్పాటు చేసినా బాగుంటుంది.
– వికిలారెడ్డి, బీఏ విద్యార్థిని, ఎస్‌కేఆర్‌ అండ్‌ ఎస్‌కేఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల, కడప
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులో..
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిపోయే విద్యార్థులకు ఈ కళాశాల ఎంతో అనువుగా ఉంటుంది. నేను కూడా ఖాజీపేట నుంచి కళాశాలకు వచ్చి వెళ్తుంటాను. ఇక్కడ చదువుతో పాటు ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాలతో పాటు ఇతరత్రా ఎక్ట్రా కరికులర్‌ యాక్టివిటీస్‌ ఉండటం వలన కళాశాలలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాలో మరో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే మరింత మంది విద్యను పొందేందుకు అవకాశం ఉంటుంది.
– ఆర్‌. నాగవాసవి, ఎంఎస్‌ కంప్యూటర్స్‌ విద్యార్థిని, ఎస్‌కేఆర్‌ అండ్‌ ఎస్‌కేఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల, కడప
ఆల్‌రౌండ్‌ డెవలప్‌మెంట్‌ సాధనే ధ్యేయంగా...
మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశించే విద్యార్థులకు చక్కటి రక్షణతో, జేకేసీ, టిస్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, కమ్యూనికేషన్, కరాటే, యోగ తదితర అంశాల్లో కూడా శిక్షణ ఇస్తున్నాం. బేసిక్‌ డిగ్రీ విద్య పోటీపరీక్షలకు మూలం కావున.. డిగ్రీ విద్యకు ప్రాధాన్యత మళ్లీ పెరుగుతోంది. కళాశాలలో చక్కటి హాస్టల్‌ వసతి, అన్ని సౌకర్యాలు ఉండటంతో వేల సంఖ్యలో అభ్యర్థులు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాలో మరో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే మంచిదే.
– డాక్టర్‌ పి. సుబ్బలక్షుమ్మ, ప్రిన్సిపాల్, ఎస్‌కేఆర్‌ అండ్‌ ఎస్‌కేఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల, కడప
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement