పీరుసాహెబ్‌ పేటలో విషాదఛాయలు

Constable Commits Suicide In Chittoor - Sakshi

చిత్తూరులో కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి

ఆమదాలవలస: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని కలి వరం పంచాయతీ పీరుసాహెబ్‌ పేట కు చెందిన ఎ.ఆర్‌.కానిస్టేబుల్‌ చింతా డ రాజశేఖర్‌ (30) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఆయన చిత్తూరులోని ఎస్పీ బంగ్లా వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి ఎస్పీ బంగళా వెనుక భాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకు సెంట్రీ డ్యూటీ చేసి.. తరువాత జయచంద్రారెడ్డి అనే కా నిస్టేబుల్‌కు డ్యూటీ అప్పగించాల్సి ఉంది. రాజశేఖర్‌ నిద్ర లేపకపోవడంతో 5.30 ప్రాంతంలో జయచంద్రారెడ్డి అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో గుండెల్లో బుల్లెట్‌ దిగి విగత జీవిగా పడి ఉన్న రాజశేఖర్‌ను చూసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఎస్పీ రాజశేఖర్‌ బాబుతోపా టు డీఎస్పీ తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

ఈ విషయం తెలియడంతో మృ తుడి స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని కలివరం పంచాయతీ పీరుసాహెబ్‌ పేట గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు. సంక్రాంతి పండగకు గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి వెళ్లిన కుమారుడు ఇలా మరణించాడనే వార్త తల్లిదండ్రులకు చెప్పే సాహసాన్ని స్థానికులు చేయలేకపోతున్నారు. మృతుడికి తల్లి రత్నాలు, తండ్రి సుబ్బయ్య, చెల్లెలు ఝాన్సీ ఉన్నారు. ఝాన్సీకి తిరుపతి కొండపై ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న భూలోకేశ్వరరావుతో పెళ్లి చేశారు. వారు ప్రస్తుతం తిరుపతిలోనే ఉన్నట్లు సమాచారం. రాజశేఖర్‌ మరణవార్త తెలుసుకున్న శ్రీకాకుళం క్రైం బ్రాంచి పోలీసులు పీరుసాహెబ్‌ పేటలోని ఇంటికి వచ్చి మృతుడి తల్లిదండ్రులను శ్రీకాకుళం తీసుకువెళ్లారు.

మృతుని తల్లి రత్నాలు హృద్రోగ సమస్యతో బాధపడుతున్నారని, ఈ విషాదకర వార్త తెలిస్తే షాక్‌కు గురయ్యే ప్రమాదముందని గ్రామస్తులు చెప్పారు. దీంతో రాజశేఖర్‌కు యాక్సిడెంట్‌ అయిందని, స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపి ఆమెను ఇంటికి పంపించేశారు. తండ్రి సుబ్బయ్యను మాత్రం చిత్తూరు తీసుకువెళ్లారు. కుమారుడి మరణవార్త తల్లికి తెలియకుండా, గ్రామంలోకి ఎవరు వెళ్లినా రాజశేఖర్‌ ఇంటి వద్దకు వెళ్లనీయకుండా గ్రామస్తులు జాగ్రత్త పడుతున్నారు. సోమవారం ఉదయానికి రాజశేఖర్‌ మృతదేహం గ్రామానికి చేరుకుంటుందని, ఈలోగా రత్నాలుకు ఈ విషయం చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని గ్రామస్తులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top