
జిల్లాకు చేరిన ఇంటర్ పుస్తకాలు
నెల్లూరు (టౌన్): ఇంటర్ ద్వితీయ సంవత్సర పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. స్థానిక స్టోన్‌హౌస్‌పేటలోని కేఏసీ జూనియర్ కళాశాలలో ఈ పుస్తకాలను భద్రపరిచారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 11 వేల పాఠ్య పుస్తకాలు, 1.19 లక్షల నోటు పుస్తకాలు వచ్చాయి. వీటిని జిల్లాలోని ఆయా ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కళాశాలలకు బుధవారం నుంచి చేరవేయనున్నారు.
డైట్‌లో అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు (టౌన్): పల్లిపాడు డైట్ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి అధ్యాపక ఖాళీలను డిప్యుటేషన్‌పై భర్తీ చేసేందుకు అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లు, హెచ్‌ఎంలు, ఎంఈఓల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఆర్.బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 10వ తేదీలోపు పంపాలన్నారు. ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన, 16, 17 తేదీల్లో రాత పరీక్ష ఉంటుందన్నారు. 19న ఇంటర్వ్యూలు నిర్వహించి 21న ఆర్డర్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆర్డర్లు తీసుకున్న ఉపాధ్యాయులు ఈ నెల 22న డైట్ కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉందన్నారు.
30న పాలిసెట్
నెల్లూరు (టౌన్): పాలిటెక్నిక్ కోర్సుల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఈ నెల 30వ తేదీన పాలిసెట్ (పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) నిర్వహించనున్నట్లు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఏసుదాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షకు సంబంధించి విద్యార్థినులకు ఈ నెల 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకు స్థానిక మహిళా పాలిటెక్నిక్ కళాశాల, దర్గామిట్టలో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. దీంతో పాటు ప్రవేశ పరీక్షకు సంబంధించి పుస్తకాలను ఉచితంగా ఇస్తామన్నారు. మరిన్ని వివరాలకు 99123 42048 నంబరులో సంప్రదించాలన్నారు.
ఏపీ గురుకులాల్లో
ప్రవేశాలకు దరఖాస్తులు
ఉదయగిరి: జిల్లాలోని నెల్లూరు (అక్కచెరువు), గండిపాళెం, తుమ్మలపెంట, ఆత్మకూరు గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశానికి మిగిలి ఉన్న తరగతుల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల పాఠశాలల జిల్లా కన్వీనర్ జి.మురళీకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో ప్రవేశం, మిగిలి ఉన్న, 6,7,8 తరగతుల్లో ప్రవేశం పొందేందుకు అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఈ నెల 6వ తేదీలోపు దాఖలు చేసుకోవాలన్నారు. వీరికి ఈ నెల 25న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్‌చార్జిగా జేసీ
నెల్లూరురూరల్: పబ్లిక్ లైబ్రరీలు, జిల్లా గ్రంథాలయ సంస్థల వ్యవహారాలను నిర్వహించడానికి జేసీ కార్తీక్‌ను పర్సన్ ఇన్‌చార్జిగా నియమిస్తూ గవర్నర్ తరఫున ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పర్సన్ ఇన్‌చార్జిగా ఆరు నెలల కాలం లేదా కొత్త చైర్మన్ నియామకం అయ్యే వరకు ఈ బాధ్యతలు చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.