
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. భద్రతా మండలి(UN Security Council)లో భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల గురించి చర్చించబోతున్నారు. తద్వారా.. అంతర్జాతీయ సమాజం ముందు ఇరు దేశాల తమ తమ వాదనలు వినిపించే అవకాశం దక్కింది.
ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం పట్టణంలోని బైసరన్ లోయలో 26 మంది పర్యాటకుల్ని ఉగ్రవాదులు బలిగొన్నారు. ఇది పాక్‌పనేనని నిర్ధారించుకున్న భారత్.. అన్ని రకాల ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలో.. పాక్ కూడా కౌంటర్ ఆంక్షలు విధిస్తోంది. మరీ ముఖ్యంగా భారత్ సింధు జలాలను నిలిపివేయడాన్ని ‘‘యుద్ధం’’గానే పాక్ భావిస్తోంది.
ఈ క్రమంలో ఈ పరిణామాలపై ఆదివారం పాక్ విదేశాంగ ప్రతినిధి ఒకరు స్పందించారు. భారత్ దూకుడుగా వ్యవహరిస్తూ తమను(పాక్)ను ఇబ్బంది పెడుతోందని, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తోందని అన్నారు. మరీ ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్ అక్రమంగా వ్యవహరిస్తోందని, ఈ విషయాలన్ని భద్రతా మండలి సమావేశంలో లేవనెత్తుతామని అన్నారాయన.

మరోవైపు.. భద్రతా మండలి పహల్గాం దాడిని ఖండించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం నాటి సమావేశానికి ముందు మండలి ప్రతినిధులు ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై స్పందించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము వ్యతిరేకిస్తామని.. అదే సమయంలో ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన చెందుతున్నామని అన్నారు.