
కామెంట్
నేను ఒకసారైనా పోప్ ఫ్రాన్సిస్‌ని కలిసి ఉండాల్సింది. ఆయన విషయంలో తప్ప, ఇతర ప్రముఖుల గురించి ఎప్పుడూ ఇలా అనుకోలేదు. పోప్ ముఖంలో ఎప్పుడూ కరుణ, ఆప్యాయత, ఆనందం ఉట్టిపడుతూ ఉండేవి. ఆయన నవ్వుతూ ఉండేవారు. నవ్విన ప్రతిసారీ ఆ కళ్లు వెలుగులు ప్రసరించేవి. అది పెదవుల మీద చిందే మామూలు మందహాసం కాదు. గుండె లోతుల్లోంచి వచ్చినట్లుంటుంది. సహజమైనది. చిన్నారుల పట్ల ఆయన ఎంతో వాత్సల్యం ప్రదర్శించేవారు. అందులోనూ నిజాయతీ కనిపించేది. పోప్ మరణం తర్వాత నేను ఆయన గురించి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. వాటితోనే నాకాయన ఎంతో ప్రేమాస్పదుడు అయ్యారు.
క్యాథలిక్ చరిత్రలో పరమ పూజ్యుడిగా గుర్తింపు పొందిన సెయింట్ ఫ్రాన్సిస్ పేరును పోప్ తన ‘పాపల్ నేమ్’గా స్వీకరించారు. ఆ ఇటాలియన్ మార్మికుడి మాదిరిగానే పోప్ అతి నిరాడంబరంగా జీవించారు. పోప్ అధికారిక నివాసమైన వ్యాటికన్ ప్యాలెస్‌ను (దీన్నే గ్రాండ్ పాపల్ హోమ్ అంటారు) కాదని అక్కడి అతిథి గృహంలోని ఓ చిన్న రెండు గదుల అపార్టుమెంటులో ఉన్నారు. ఆయన ఎంత సాదాసీదాగా ఉండేవారంటే, తను వేసుకునే బ్రౌన్ కలర్ షూస్ బాగా నలిగిపోయి ఉండేవి. గార్డులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేయడం ఆయనకు పరిపాటి. కార్మికులు తినే క్యాంటిన్‌లోనే తరచూ భోజనం చేసేవారు.
ప్రీస్ట్ కావటానికి ముందు బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా)లో ఫ్రాన్సిస్ ఒక బౌన్సర్ ఉద్యోగం చేశాడంటే నమ్మగలరా? ఇతర ప్రీస్టుల కంటే భిన్నంగా ఉండటా నికి బహుశా అదొక కారణం అయ్యుంటుంది. పేదల పక్షం ఉండటమే ఈ పోప్ తత్వం. వారి కళ్లలో ఆయనకు చర్చి కనబడేది. కాబట్టే ఆయన్ను మురికివాడల బిషప్పు అని పిలుచుకునేవారు.
2023 అక్టోబరులో ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మొదలైనప్పటి ఉదంతమిది: గాజాలో హోలీ ఫెయిత్ చర్చి ఉంది. ఆ ఏకైక క్యాథలిక్ చర్చిలోనే క్రైస్తవులు, ముస్లిములు తల దాచుకున్నారు. వారి కోసం ప్రార్థించడానికి, వారికి ఊరడింపుగా ఉండటానికి పోప్ రాత్రి సమయాల్లో వాటికన్ నుంచి ఫోన్ చేసేవారు. ప్రపంచానికి తెలియని ఇలాంటి ఎన్నో అద్భుతమైన పనులు ఆయన చేశారు. వాటిలో ఇదొకటి. ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా తాను అనుకున్నది చేయడం సెయింట్ ఫ్రాన్సిస్ స్వభావం. అలా ఉండటానికే పోప్ ఫ్రాన్సిస్ కూడా ఇష్టపడేవారు. ఈ విషయాలు తెలిసిన ఆయన సన్నిహితులు సైతం వాటిని అందరి దృష్టికీ తెచ్చేందుకు ప్రయత్నించకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది.
స్వలింగ సంపర్కం పట్ల క్యాథలిక్ చర్చి వైఖరి కఠినంగా ఉంటుంది. ఈ కాఠిన్యాన్ని సడలించిన మొట్ట మొదటి పోప్... ఫ్రాన్సిస్సే! తన విమర్శకులను ఉద్దేశించి, మంచో చెడో ‘‘తీర్పు చెప్పడానికి నేనెవరిని?’’ అని ప్రశ్నించారు. విడాకులు తీసుకున్నవారు, పునర్వి వాహం చేసుకున్నవారు ‘సాక్రమెంటు’ స్వీకరించడంలో తప్పు లేదని చెప్పిన మొదటి పోప్ కూడా ఆయనే. నలుగురు మితవాద కార్డినల్స్ బాహాటంగా వ్యతిరేకించినప్పటికీ పోప్ తన అభిమతం మార్చుకోలేదు.
గర్భనిరోధం, గర్భస్రావం, స్వలింగ వివాహాలు, ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు వంటి అంశాల్లో ఆయన సంప్రదాయానికి లోబడి వ్యవహరించారు. ఏదేమైనా, ఆనవాయితీలను అధిగమించి నూతన భావనలు ప్రవేశపెట్టడాన్నే ఆయన ఇష్టపడేవారు. ఎంత తిరిగినా మళ్లీ అక్కడకే వస్తాం... పోప్ ఫ్రాన్సిస్ సామాన్య జనం గురించి తపన పడేవాడు. వలసదారులు, శరణార్థుల సమస్యపై ఆయన తీసుకున్న వైఖరి దీన్ని రుజువు చేస్తుంది.
పోప్ హోదాలో తన తొలి పర్యటనకు ల్యాంపెడుజా అనే ఇటలీ ద్వీపాన్ని ఎంచుకున్నారు. ఉత్తర అమెరికా అక్రమ వలసదారు లను కలిసి వారి సమస్య పరిష్కరించడమే ఈ పర్యటన ఉద్దేశం. తాను జబ్బు పడటానికి కొన్ని వారాల ముందు కూడా, అక్రమ వలసదారులను నేరస్థులుగా పరిగణిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన విధానాలను పోప్ విమర్శించారు. మరే ఇతర దేశాధిపతీ ఇంతగా తెగించి ఉండడని వ్యాఖ్యానించారు.
ఇస్లాంతో అధికారికంగా చర్చ జరిపిన మొట్ట మొదటి పోప్ కూడా ఆయనే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఆయన బహిరంగ ‘మాస్’ నిర్వ హించారు. అరబ్ ద్వీపకల్పంలో ఇలా చేయడం ఇదే ప్రథమం. ఈ మతాంతర సౌభ్రాతృత్వ చర్యల మీద మితవాదులు దాడి చేశారు. వారిని ఆయన అసలు పట్టించుకోలేదు. పోప్ జీవితంలో వైఫల్యాలు లేవని చెప్పలేం.
ముఖ్యంగా వాటికన్ మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ వ్యవహారంలో సమర్థంగా వ్యవహరించలేక పోయారు. ఈ కేసులో కార్డినల్ ఏంజెలో బెచూ మీద ఆరోపణలు రుజువు అయ్యాయి. 2023లో జైలు శిక్ష కూడా పడింది. అంతిమంగా, పోప్ ఈ సమస్యను విస్తృత స్థాయిలో ఎదుర్కోలేక పోయారనే చెప్పాలి. ఒకటి మాత్రం వాస్తవం, ఆయన ముందున్న వారెవరూ ఆయన కంటే సమర్థులు కారు.
ఏమైనప్పటికీ, ఫ్రాన్సిస్ తన తర్వాత కూడా క్యాథలిక్ చర్చ్ తన ఆకాంక్షలకు అనుగుణంగా నడిచేలా జాగ్రత్తపడ్డారు. ఆయన వారసుడిని ఎన్నుకునే అర్హత 135 మంది కార్డినల్స్‌కు ఉంటుంది. వారిలో 108 మందిని తనే నియమించారు. అందులో యూరోపి యన్లు 53 మంది కాగా, 82 మంది ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, నార్త్ అమెరికా, ఓసియానియా (ఆస్ట్రేలియా సహా అనేక ఇతర పసిఫిక్ దీవులు) ప్రాంతాల వారే! అంటే, ఆయన వారసుడు మరో యూరపే తరుడు అవుతాడా? అవకాశాలు అలానే ఉన్నాయి.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్