
ఒకటి రెండు కప్పలు సింక్ కింద ఉంటే చాలు, ఇంట్లో బొద్దింకల బెడద తీరిపోతుందని రోమ్ వాళ్ల అమ్మ ఎప్పుడూ అంటుండే వారు. ఆలోచించి చూస్తే, మా అస్తవ్యస్థమైన తోటలాగే, కప్పలు మా ఇంటిలో గుమిగూడి, గంపలు తెంపలుగా చేరాయి, అచ్చం ఆ చెట్టుకప్పల దాడి లాగ. అడవి దారిలో నడిచినట్టు, ప్రతి రాత్రి నేను నా చెప్పులు తొడగని కాలిని ఎక్కడ పెడుతున్నానో చూసుకోవలసి వచ్చేది. నేను ఎంత జాగ్రత్త తీసుకున్నా, ఆ అద్భుత-పరిమాణం గల జిగురోడే కప్ప మలం ఎగిరోచ్చి నా పాదాలకు అంటుకునేది. నేను ఏమి చేస్తున్నా మరచిపోయి, ఆ నల్ల ‘కప్ప జిగురుని’ కడుక్కోవడానికి వెంటనే కుంటూ కుంటూ వెళ్ళాల్సొచ్చేది. అలా కొన్ని రాత్రి సంఘటనల తరువాత నేను ఆ కప్పల్ని ఇంటి నుంచి అవతల విసిరేశాను కానీ అవి నా కోపాగ్నిని ఎదురుకోవడానికి భయం లేకుండా తిరిగి వచ్చాయి.
వాటిని నేనొక ప్లాస్టిక్ డబ్బాలోకి పోగు చేసి, ఒక 250 మీటర్లు అవతల, ఇంటి ముందుపెరటి చివర్న వదిలాను. అవి ఒక మొండి ధైర్యంతో తిరిగి వచ్చాయి. నేను 500 మీటర్ల దూరంలో వాటిని వదిలేముందు వాటికి ముద్ర వేసి (గుర్తించడం కోసం), డబ్బాని గిరగిరా గుండ్రంగా తిప్పి తోటలో వాటిని చాలా గజిబిజిగా త్రోవ మార్చి తిప్పాను (అయోమయం సృష్టింద్దామని అనుకున్నా). కానీ అవి 25 గంటల్లో తిరిగి వచ్చాయి.
ఆడ-రాక్షసి వాటికోసం వస్తే వాటి భాగ్యంలో ఏముందో ఈ పాటికి ఆ వేధించే జీవులకి అర్ధమయ్యింది. అవి బాధలో కీచుమన్నాయి, వణుకుతూ ఎక్కడ పడితే మూత్రం చేసాయి, ఇంకా పట్టుబడకుండా వుండే ప్రయత్నం చేసాయి. నేను ఇంచుమించు క్షమించేశా, కానీ నా కుతూహలం నన్ను ఎగదోసింది. 750 మీటర్లు. 30 గంటల్లో తిరిగి వచ్చాయి. ఆ చిన్న ప్రాణులకి నడవటానికి అది చాలా పెద్ద దూరమే. సీసాని గిరగిరా తిప్పి, ఒక కిలోమీటర్ దూరంలో రోడ్డవతల బురదనిండిన పొడవాటి దారిలో తీసుకెళ్లి, అడవిలో నీటి మడుగు దెగ్గర వదిలేశా. వాటిని ఇంటి నుండి తరిమెయ్యడంలో నేను విజయం సాధించాను కానీ, పెరటి బయట కుండీలో ఒక కప్ప జంటని నేను కనుగొన్నాను. అవన్నీ తిరిగివచ్చాయా లేదా కొన్నే తిరిగివచ్చాయా అన్నది నేనిప్పుడు చెప్పలేను. వేరే జంతువులు వాటిని ఇంటి నుండి దూరంగా తీసుకుపోతే ఏం చేస్తాయి?
నేను వెలికి తీసిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇవిగో...
నమీబియాలో ముద్ర వేసి 800 కిలోమీటర్ల దూరంలో వదిలివేసిన ఎనిమిది చిరుతల్లో, 5 నుండి 28 నెలల వ్యవధిలో ఆరు చిరుతలు ఇంటికి తిరిగి వచ్చాయి. ఒక ఉదాహరణ ఇస్తాను ఉండండి: ఈ చిరుతల్ని చెన్నై నుంచి తీసుకుపోయి గోవాకి కొద్దిగా ఉత్తరాన వదిలినట్టయితే, అవి తిన్నగా ఇంటికి నడుచుకుంటూ వచ్చేసాయాన్నమాట! అమెరికాలో, వాటి ఇంటికి 200 కిలోమీటర్ల అవతల వదిలేసిన 34 నల్ల ఎలుగుబంట్లలో చాలామటుకు విజయవంతంగా వాటి భూభాగానికి తిరిగి వచ్చేశాయి. భారతదేశంలో, టెరాయి నుంచి 250 కిలోమీటర్ల దూరంలో బక్స పులుల సంరక్షణ కేంద్రంకి మార్చాబడిన ఒక ఏనుగు రెండు నెలల కంటే తక్కువ కాలంలో తిరిగి వచ్చేసింది. ఆస్ట్రేలియాలోని, ఇంటి నుండి 400 కిలోమీటర్ల అవతల వదల బడ్డ ఉప్పునీటి మొసళ్లు తిరిగి వచ్చేసాయ్..అదే నన్ను బెంగుళూరులో వదలండి, నేను మరుక్షణం తప్పిపోతాను.
ఏదేమైనా, దూరాల నుండి ఇంటికి చేరుకోవడంలో ఆరితేరినవి మాత్రం ఆల్బట్రాస్, షీర్వాటర్ వంటి సముద్ర పక్షులదే. మధ్య పసిఫిక్ నుంచి 6,500 కిలోమీటర్ల దూరంలో ఫిలిప్పిన్స్ లో ఉన్న ఒక దీవిలో విడిచి పెడితే, అది ఒక ఆల్బట్రాస్ నెలలో తిరిగి వచ్చింది, మరో రెండు 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాషింగ్టన్ (అమెరికా) నుంచి తిరిగి వచ్చాయి.
ఈ అద్భుత నేర్పు కేవలం పెద్ద జంతువులకు మాత్రమే ఉండదు. U. K లో, వాటి తేనె తుట్ట నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ప్రణాళిక లేకుండా విడిచెయ్యబడ్డ బంబల్ బీ తేనెటీగలు వాటి ఇంటికి తిరిగి వచ్చేసాయి. కాబట్టి, కప్పకు ఒక కిలోమీటర్ ఎంత, ఊఁ?
ఈ జంతువులు, పక్షులు, పురుగులు ఇంటికి తిరిగి చేరుకుంటాయన్న వాస్తవం బాగా డాక్యుమెంట్ చేయబడింది. కానీ, దూరతీరాలలోని తెలియని భూభాగం నుంచి అవి ఇంటి దారి ఎలా కనుగొంటాయి?
ఈ జంతువులను వాటి ఇంటి నుంచి బయట చోటికి మార్చేప్పుడు, అన్ని వైపులా మూసి ఉన్న వాహనాలలో (లేదా మూసి ఉన్న ప్లాస్టిక్ డబ్బాలలో) తీసుకు వెళతారు కనుక, అవి దారిలో దాటి పోయే దృశ్యాలను, చెట్లను చూసి, జ్ఞాపకం ఉంచుకోవడానికి అవకాశం లేదు. చాలా కేసులలో, ఆ జ్వంతువులు తీసుకువెళ్లే దారిలో కాకుండా, దానికి బదులుగా, ఇంటికి రావటానికి డైరెక్ట్ తోవ ఎంచుకున్నాయి. అయితే, అవి అది ఎలా చేస్తాయి?
-ఇంకా ఉంది
Author : Janaki Lenin -- జానకి లెనిన్
Photo credit - జానకి లెనిన్