
కరోనా సమయంలో పాపులర్ అయిన కొన్ని టెక్నాలజీ సర్వీసులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. అందులో మైక్రోసాఫ్ట్ సర్వీసు స్కైప్ ఒకటి. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి 22 ఏళ్లు అయినా, కొవిడ్ సమయంలో చాలా మంది ఉద్యోగులు, బిజినెస్ సంస్థలు స్కైప్ సర్వీసులు విరివిగా వినియోగించుకున్నారు. కానీ కొవిడ్ అనంతరం క్రమంగా యూజర్ల నుంచి ఆదరణ తగ్గడం, మార్కెట్‌లో పోటీగా మెరుగైన ఇతర ప్రత్యామ్నాయాలు రావడంతో సవాళ్లు ఎదురవుతున్నాయి. దాంతో ఈ సర్వీసును మే 5, 2025 నుంచి నిలిపేస్తున్నట్లు ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అయితే స్కైప్ యూజర్లకు మైక్రోసాఫ్ట్ టీమ్స్‌వైపు మళ్లించేందుకు అన్ని ప్రయత్నాలు జరిగాయి. కాగా, కంపెనీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్కైప్‌ను ఎందుకు నిలిపేస్తున్నారో నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లోకి మార్పు
మైక్రోసాఫ్ట్ తన కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లను ఏకీకృతం చేయడం కూడా స్కైప్‌ను నిలిపేసేందుకు కారణమవుతుంది. మెసేజింగ్, వీడియో కాల్స్ ఇతర సర్వీసుల కోసం దాని ప్రాథమిక కేంద్రంగా మైక్రోసాఫ్ట్ టీమ్స్‌పై పూర్తిగా దృష్టి పెడుతోంది. దాంతో స్కైప్ వినియోగదారులను సైతం ఈ టీమ్స్‌లో చేరమని కొంత కాలంగా కోరుతుంది. ఇప్పటికే చాలామంది టీమ్స్‌లోకి మారారు.
తగ్గుతున్న ప్రజాదరణ
స్కైప్ కొన్నేళ్లుగా మెరుగైన సర్వీసులు అందిస్తున్నప్పటికీ జూమ్, గూగుల్ మీట్, వాట్సాప్.. వంటి పోటీదారులు కూడా ఈ సర్వీసు అందిస్తున్నారు. దాంతో ఆఫీస్ 365లో భాగంగా ఉన్న మైక్రోసాఫ్ట్ టీమ్స్‌వైపు వినియోగదారులు నడిపించేలా సంస్థ చర్యలు తీసుకుంటోంది.
వినియోగదారులకు మద్దతుగా..
స్కైప్ నుంచి టీమ్స్‌కు మైగ్రేట్ అయ్యేందుకు మైక్రోసాఫ్ట్ యూజర్లకు చాలా నెలల సమయం ఇచ్చింది. టీమ్‌ల్లోకి లాగిన్ కావడానికి ఇప్పటికే ఉన్న స్కైప్ ఐడీలను ఉపయోగించవచ్చని తెలిపింది. ఇది యూజర్ ట్రాన్‌పర్మేషన్‌ను సులభతరం చేసింది. చాట్ హిస్టరీలు, కాంటాక్ట్‌లను నిరాటంకంగా టీమ్స్‌కు బదిలీ చేస్తామని మైక్రోసాఫ్ట్ హామీ ఇచ్చింది.
పెయిడ్ సేవలు నిలిపివేత
స్కైప్ క్రెడిట్, కాలింగ్ ప్రణాళికలతో సహా పెయిడ్ సేవల కోసం కొత్త సబ్ స్క్రిప్షన్‌లను మైక్రోసాఫ్ట్ నిలిపివేసింది. ఇప్పటికే ఉన్న వినియోగదారులు వారి తదుపరి రీఛార్జ్ సైకిల్ వరకు సబ్‌స్క్రిప్షన్‌లను కొనసాగించవచ్చని తెలిపింది. ఆ తర్వాత పెయిడ్ ఫీచర్లు నిలిచిపోతాయని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: గూగుల్ కథ కంచికేనా?
ప్రత్యామ్నాయాలు
మార్కెట్‌లో టీమ్స్‌కు కూడా ప్రత్యామ్నాయాలున్నాయి. యూజర్లు వీడియో కాలింగ్ ఫీచర్లను అందించే గూగుల్ మీట్, జూమ్ లేదా వాట్సాప్.. వంటి సర్వీసులకు కూడా మారవచ్చు. అయితే స్కైప్‌తో పోలిస్తే టీమ్స్ మరింత ఆధునిక, ఇంటిగ్రేటెడ్ అనుభవాన్ని అందిస్తుందని మైక్రోసాఫ్ట్ నొక్కి చెప్పింది.