
భారదేశంలో అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ.. రిలయన్స్ సామ్రాజ్యం గురించి తెలిసిన దాదాపు అందరికీ, ఈ కంపెనీ ప్రారంభించిన వారు ధీరూభాయ్ అంబానీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ధీరూభాయ్ అంబానీ అసలు పేరు ఏమిటో.. బహుశా చాలా తక్కువమందికే తెలిసి ఉంటుంది. ఈ కథనంలో ఆ విషయం తెలుసుకుందాం.
సాధారణ కుటుంబంలో జన్మించిన ధీరూభాయ్ అంబానీ.. ఆర్ధిక పరిస్థితుల కారణంగా, చదువును అర్ధాంతరంగా నిలిపివేసి యెమెన్‌కు వెళ్లి అక్కడ పెట్రోల్ పంప్‌లో రూ. 300 జీతానికి పనిచేయడం మొదలుపెట్టారు. కొన్నేళ్ల తరువాత సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఇండియాకు వచ్చి.. ముంబైలోని అద్దె ఇంట్లో రిలయన్స్ ప్రయాణాన్ని ప్రారంభించారు.
వస్త్రాల వ్యాపారంతో మొదలైన ఈయన ప్రయాణం.. ఆ తరువాత పెట్రోకెమికల్స్, టెలికాం మొదలైన రంగాలవైపు సాగింది. ఆ తరువాత రిలయన్స్ ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మారింది. అందరూ ఈయనను 'ధీరూభాయ్ అంబానీ' అని పిలుచుకునే వారు. కానీ ధీరూభాయ్ అనేది ఆయన ముద్దుపేరు, అంబానీ అనేది ఇంటిపేరు.
ఇదీ చదవండి: కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..
ధీరూభాయ్ అంబానీ అసలు పేరు.. 'ధీరజ్‌లాల్ హీరాచంద్ అంబానీ' (Dhirajlal Hirachand Ambani). 1932 డిసెంబర్ 28న జన్మించిన ఈయన.. ఏడుపదుల వయసులో 2002 జులై 6న మరణించారు. అప్పటికే రిలయన్స్ సామ్రాజ్యాన్ని దశదిశలా వ్యాపింపజేశారు. ఆయన మరణించే సమయానికి, ప్రపంచంలో 138వ ధనవంతుడిగా ఉన్నట్లు.. ఆయన వ్యక్తిగత నికర విలువ 2.9 బిలియన్ డాలర్లు (నేటి భారత కరెన్సీ ప్రకారం రూ. 24000 కోట్లు) అని సమాచారం.